డ్రోనాస్త్రం
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:02 AM
వన్‌వే బోర్డు ఉన్నా వ్యతిరేక మార్గంలో వాహనాలపై దూసుకెళ్తారు కొందరు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా పట్టించుకోరు మరికొందరు. పోలీసులను చూసి హెల్మెట్ ధరించేవారు, తమ పనికోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలను పార్కింగ్ చేసేవారు ఇంకొందరు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ‘డ్రోన్లతో జరిమానాల విధానం’ సత్ఫలితాలను ఇస్తోంది. 20 రోజుల్లో 174 కేసులు నమోదుకావడమే ఇందుకు నిదర్శనం.
నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్
డ్రోన్లతో ఫొటోలు తీసి జరిమానాల విధింపు
ముఖ్యంగా ఆ ఆరు రకాల ఉల్లంఘనలకు..
20 రోజులు.. 174 కేసులు.. రూ.1,77,640 జరిమానాలు
హెల్మెట్ లేని ప్రయాణం, స్నేక్ డ్రైవింగ్‌పై దృష్టి
కొండపల్లి ఖిల్లాపై మందు తాగుతున్న యువకులు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : నగరంలో నిత్యం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లతో షాక్ ఇస్తున్నారు. గగనతలం నుంచి డ్రోన్లతో నిఘాపెట్టి వాహనదారులకు జరిమానాల ఝలక్ ఇస్తున్నారు. గతనెలలో ట్రాఫిక్ విభాగానికి దాతలు సమకూర్చిన ఆరు డ్రోన్లను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా పోలీస్ కమిషనరేట్‌కు అందజేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రధాన కూడళ్లలో ఉన్న పరిస్థితులను పరిశీలించడానికి ఈ డ్రోన్లను సమకూర్చుతున్నట్టు చెప్పారు. ఈ టాస్క్‌లతో పాటు డ్రోన్లతో ట్రాఫిక్ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌లు చేయిస్తున్నారు. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఫొటోలను తీస్తున్నారు. వారి వాహనం నెంబరు స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీసి యజమానులకు పంపుతున్నారు.
20 రోజుల్లో 174 కేసులు
నగరంలో ట్రాఫిక్ పోలీసులకు అందజేసిన డ్రోన్లకు ప్రత్యేకంగా ఆ విభాగంలో సిబ్బందిని పైలెట్లుగా నియమించారు. డ్రోన్లను ఎగరేయడం, వాటిద్వారా ఫొటోలు తీయడం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు లైవ్‌ను అనుసంధానించడం వంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చారు. నగరవ్యాప్తంగా గగనతలంలో తిరిగిన డ్రోన్లు 20 రోజుల్లో 174 కేసులకు ఆధారాలను అందజేశాయి. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారుల ఫొటోలను తీసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపాయి. వాటిని విశ్లేషించి కంట్రోల్ రూంలో ఉన్న సిబ్బంది జరిమానాలు విధించారు. ఈ కేసుల్లో మొత్తం రూ.1,77,640 జరిమానాలు విధించారు. వాహనదారులు మొత్తం ఆరు రకాల ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం, రేస్ డ్రైవింగ్, వన్‌వేలో వెళ్లడం, సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, నో పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలపడం వంటివి ప్రధానం కాగా, వాటికే జరిమానాలు విధించారు.
బైక్ వెంటే..
స్పోర్ట్స్ బైక్‌లపై యువత వేగాన్ని పోలీసులు సైతం నియంత్రించుకోలేకపోతున్నారు. రహదారులపై మెలికలు తిరుగుతూ వాహనాలు నడుపుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. కూడళ్లలో ఆపడానికి ప్రయత్నిస్తున్నా దూసుకుపోతున్నారు. స్నేక్ డ్రైవింగ్, రేస్ డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై వీరి ప్రవర్తన అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. అటువంటి వారికోసం పైలెట్లు డ్రోన్లను వాడుతున్నారు. వాహనదారులకు పంపే ఫొటోలో వాహనంతో పాటు దాని రిజిసే్ట్రషన్ నెంబరు స్పష్టంగా కనిపించాలి. అందుకోసం డ్రోన్‌ను ఆ వాహనం వద్దకు తీసుకెళ్లాలి. స్పోర్ట్స్ బైక్‌లు, హార్స్‌పవర్ ఎక్కువ ఉన్న వాహనాలపై వెళ్తున్న వారిని చిత్రీకరించడానికి డ్రోన్‌ను అదే వేగంతో పరుగులు తీయిస్తుండటం విశేషం.