Share News

‘మ్యాపింగ్‌’ను మార్చండి

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:00 AM

వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తలపెట్టిన ‘మ్యాపింగ్‌’ను కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుండటంపై తెలుగు తమ్ముళ్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇదే విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు.

‘మ్యాపింగ్‌’ను మార్చండి

గతంలోని ప్రజాసాధికార సర్వేనే అమలు చేయాలి

వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటి మ్యాపింగ్‌కు శ్రీకారం

కుటుంబాల లెక్కల్లో వివక్ష.. వైసీపీ వారికే న్యాయం

తిరిగి ప్రజాసాధికార సర్వేను తెస్తే అందరికీ సమన్యాయం

ఐదేళ్లు ఏ పథకాలూ అందని తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తలపెట్టిన ‘మ్యాపింగ్‌’ను కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుండటంపై తెలుగు తమ్ముళ్లు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. ఇదే విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. సొంత పార్టీకి చెందినవారికి కూడా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ మ్యాపింగ్‌ విధానాన్ని తీసుకొచ్చిందని, దానిని రద్దుచేసి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ‘ప్రజాసాధికార సర్వే’ను అమల్లోకి తీసుకురావాలంటున్నారు. అప్పుడైతేనే పార్టీలకతీతంగా సమన్యాయం జరుగుతుందనేది తమ్ముళ్ల మాట.

వైసీపీ హయాంలో మ్యాపింగ్‌ మైండ్‌గేమ్‌

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాసాధికార సర్వేను కాదని, మ్యాపింగ్‌ విధానాన్ని ఎంచుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసిన కొత్తలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ఈ మ్యాపింగ్‌ను చేపడుతున్నట్టు ప్రకటించింది. దీనిద్వారా ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో మ్యాపింగ్‌ చేశారు. ఆ మాటున వైసీపీ ప్రభుత్వం మైండ్‌గేమ్‌ ఆడింది. ఈ మ్యాపింగ్‌ను వలంటీర్లు చేయగా, వైసీపీకి చెందినవారు, ఆ పార్టీ అభిమానులు, సానుభూతిపరులకు ప్రయోజనం చేకూరేలా కుటుంబాల సంఖ్యను ఎక్కువగా చూపించారు. ఉమ్మడి కుటుంబాలను కూడా రెండుగా మ్యాపింగ్‌ చేశారు. ఇలా చేయడం వల్ల వైసీపీ అనుయాయులకే సంక్షేమ పథకాలు దక్కేవి. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు మాత్రం ఈ మ్యాపింగ్‌లో అన్యాయం జరిగింది. వేర్వేరు రేషన్‌ కార్డులు ఉన్నప్పటికీ ఒకే కుటుంబంగా చూపించారు. సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డుల అర్హత ప్రామాణికతను రద్దు చేసింది. కేవలం నిత్యావసరాల కోసం రైస్‌కార్డులు చెలామణి అయ్యేలా చేసింది. దీంతో ఒకే ఇంట్లో రెండు రేషన్‌ కార్డులున్నా.. సచివాలయ మ్యాపింగ్‌లో ఒకే కుటుంబంగా ఉంటే మాత్రం ఆ కుటుంబంలో ఒక్కరే పథకాలకు అర్హులయ్యేవారు. రెండు కుటుంబాలుగా ఉంటే ఇద్దరు అర్హత సాధించేవారు. భూములు, స్థలం, సొంత కార్లు, విద్యుత యూనిట్ల వాడకం, ఆదాయం వంటి అంశాలను నిర్దేశిత విధంగా ఉండాలన్న నిబంధనలను పొందుపరిచారు. వీటి మాటున పథకాలను కట్టడి చేసే వ్యూహాన్ని అమలు చేశారు. ఈ మ్యాపింగ్‌ విధానంతో తాము నష్టపోయామని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

అర్హులందరికీ పథకాల వర్తింపు

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాసాధికార సర్వే నిర్వహించేవారు. రేషన్‌ కార్డుల ప్రాతిపదికనే ఈ సర్వే జరిగింది. ప్రజలందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో (పబ్లిక్‌ డొమైన్‌)లో డేటా ఉంచింది. ఎవరైనా.. వారి రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు నెంబర్లను ఎంటర్‌ చేయగానే కుటుంబ వివరాలన్నీ తెలిసేవి. అన్ని పార్టీలకూ సమానంగా వారి అర్హతల ప్రాతిపదికన పథకాలు అందేవి. కాబట్టి ఆ సర్వేను ఇప్పుడు కూడా అమలు చేయాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.

కూటమి ప్రభుత్వం వచ్చినా అదే మ్యాపింగా..

ఐదేళ్ల పాటు తాము నష్టపోయామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అదే మ్యాపింగ్‌ విధానాన్ని అనుసరించటం వల్ల తమతో పాటు, అర్హులంతా నష్టపోతున్నారని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పథకాల అమలుకు పెట్టిన నిబంధనలు కూడా తూచా తప్పకుండా పాటించటం వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు.

Updated Date - Jul 18 , 2025 | 01:00 AM