వెస్ట్ బైపాస్‌లో కీలక మలుపు
ABN , Publish Date - May 30 , 2025 | 01:17 AM
విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాజెక్టులో గొల్లపూడి జంక్షన్ వద్ద ‘రింగ్’కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికను ఎన్‌హెచ్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడంతో అనుమతి లభించింది. వారంలో గొల్లపూడి జంక్షన్ వద్ద పనులు ప్రారంభించి, రెండు వారాల్లో పూర్తి చేసేం దుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
గొల్లపూడి వద్ద రింగ్ ఏర్పాటుకు కేంద్రం ఓకే
భూసేకరణ లేకుండానే నిర్మాణానికి ప్రతిపాదన
వెంటనే పనులు చేపట్టడానికి కేంద్రం అనుమతి
వారంలో పనులు ప్రారంభమయ్యే అవకాశం
గొల్లపూడి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ వెస్ట్ బైపాస్ ప్రాజెక్టులో గొల్లపూడి వద్ద రింగ్ నిర్మాణం కీలకం. గొల్లపూడి దగ్గర ఎన్‌హెచ్-65ను అనుసంధానించే చోట ప్రస్తుతమున్న జంక్షన్ ఇబ్బందిగా మారింది. గొల్లపూడి ఆర్‌వోబీ దిగువన, సర్వీసు రోడ్ల మీదుగా ఇటు విజయవాడకు, అటు హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వాహనాలు మలుపు తిరగటానికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ వాహనాలు మళ్లీ ఎన్ హెచ్-65పైకి ఎక్కి, గొల్లపూడి సిగ్నల్ జంక్షన్ వరకు వెళ్లి, అక్కడ ఫ్రీలెఫ్ట్ తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కానీ, గుంటూరు నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే వాహనాలు కానీ ఇదే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోంది. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఎన్‌హెచ్-65 మీదుగా సూరాయిపాలెం ట్రాఫిక్ జంక్షన్ వరకు వెళ్లి ఫ్రీలెఫ్ట్ తిరిగి విజయవాడలోకి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గొల్లపూడి జంక్షన్ వద్ద రింగ్‌ను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఎంపీ కేశినేని చిన్ని కూడా సూచించారు. దీనిపై ఎన్‌హెచ్ అధికారులు సమగ్ర అధ్యయనం చేశాక రింగ్ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. రింగ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై కన్సల్టెన్సీని నియమించారు. ఈ కన్సల్టెన్సీ సంస్థ ఇటీవలే నివేదిక ఇచ్చింది. భూ సేకరణ అవసరం లేకుండానే, రింగ్‌ను అభివృద్ధి చేయవచ్చని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఆగమేఘాలపై ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపారు. కేంద్రం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. వారంలో పనులు ప్రారంభించి, పక్షం రోజుల్లోపే దీనిని పూర్తి చేయటానికి ఎన్‌హెచ్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
క్లోవర్ లీఫ్ జంక్షన్ సంగతేంటి?
గొల్లపూడి వద్ద రింగ్ కనుక అందుబాటులోకి వస్తే.. ఏలూరు, గుంటూరు నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్లే వాహనాలకు కానీ, హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు కానీ మార్గం సుగమమవుతుంది. వాస్తవానికి గొల్లపూడి జంక్షన్ వద్ద క్లోవర్ లీఫ్ జంక్షన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ మార్గాన్ని ఆరు వరసలుగా విస్తరించటానికి వీలుగా డీపీఆర్ రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలో గొల్లపూడి జంక్షన్ దగ్గర విజయవాడ బైపాస్‌తో హైదరాబాద్-విజయవాడ మార్గం అనుసంధానమవుతుంది. రెండు ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట క్లోవర్ లీఫ్ జంక్షన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కన్సల్టెన్సీ సంస్థ చేస్తోంది. తుది డీపీఆర్‌లో కనుక క్లోవర్ లీఫ్ జంక్షన్‌ను ప్రతిపాదిస్తే, రింగ్‌ను తొలగిస్తారు. విజయవాడ వెస్ట్ బైపాస్‌ను ప్రారంభించాలన్న సన్నాహాల నేపథ్యంలో తక్షణ అవసరాల కోసం రింగ్‌కే విజయవాడ ఎన్‌హెచ్ డివిజన్ అధికారులు ఓటు వేస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ ఆరు వరసల రహదారి విస్తరణ పనుల పూర్తికి మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. క్లోవర్ లీఫ్ జంక్షన్ కూడా ఆ తర్వాతే వస్తుంది.