కొండంత నిఘా
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:56 AM
దసర శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారు భక్తులైతే.. దర్శనానికి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ చేతివాటాలు చూపించేవారు దొంగలు. భక్తుల హడావిడిని అవకాశంగా మార్చుకుని కనిపించిన వస్తువులను మాయం చేస్తుంటారు. వారికి అడ్డుకట్ట వేయడానికి సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) అధికారులు ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు.
దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రి చుట్టూ సీసీఎస్ భద్రత
నేరాల కట్టడికి ప్రణాళిక సిద్ధం చేసిన పోలీసులు
కొండ చుట్టూ 35 హాట్‌స్పాట్ల గుర్తింపు
గత ఉత్సవాల కంటే పెరిగిన పాయింట్లు
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : దసర శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారు భక్తులైతే.. దర్శనానికి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ చేతివాటాలు చూపించేవారు దొంగలు. భక్తుల హడావిడిని అవకాశంగా మార్చుకుని కనిపించిన వస్తువులను మాయం చేస్తుంటారు. వారికి అడ్డుకట్ట వేయడానికి సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) అధికారులు ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల మొత్తం 35 హాట్‌స్పాట్లను అధికారులు గుర్తించారు. గత శరన్నవరాత్రుల్లో గుర్తించిన హాట్‌స్పాట్ల కంటే ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగింది. గతంలోని ఘటనలను బేరీజు వేసుకుని ఈ పాయింట్లను పిన్ చేశారు. సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. నగదుకు సంబంధించినవి రెండో స్థానంలో ఉన్నాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వినాయకుడి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి వరకు ఒక ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. కుమ్మరిపాలెం వైపు నుంచి పాలఫ్యాక్టరీ, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణవీధి, రథం సెంటర్ వరకు మరో ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం 35 ప్రదేశాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి అక్కడ సీసీఎస్ సిబ్బందిని నియమించడానికి మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ పాయింట్లలో సీసీఎస్ సిబ్బందితో పాటు వివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని కేటాయిస్తారు.
వినాయకుడి ఆలయం నుంచి..
ఈ ఉత్సవాల్లో కెనాల్‌రోడ్డులోని వినాయకుడి ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయి. ఈ లైన్లలో వెళ్లిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని శివాలయం వైపున ఉన్న మెట్లమార్గం నుంచి కనకదుర్గానగర్‌లోకి ప్రవేశిస్తారు. కొండ ఎక్కే ప్రాంతం కంటే దిగే ప్రాంతంలో రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడే అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శరన్నవరాత్రులు ఆరంభం రోజే స్థానిక దొంగలు, స్థానికేతర దొంగలు ఇంద్రకీలాద్రి చుట్టూ వాలిపోతారు. కొంతమంది క్యూలైన్లలో నడుచుకుంటూ కొండపైకి వస్తుంటారు. అవకాశం దొరికినప్పుడు భక్తులకు సంబంధించిన ఏదో ఒక వస్తువును మాయం చేస్తారు. పని పూర్తికాగానే క్యూ మధ్యలో నుంచి బయటకు వచ్చేస్తుంటారు. కొంతమంది శివాలయం వైపున ఉన్న మెట్లమార్గం వద్ద కాపుకాసి భక్తులను అనుసరిస్తూ చోరీలు చేస్తారు.