పత్తిపై కత్తి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:46 AM
నాణ్యతతక్కువగా ఉన్న పత్తిని కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇంకా రైతులను ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కార్పొరేట్ సంస్థల కంటే కఠినమైన నిబంధనలతో వ్యాపారాన్ని సాగిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోంది.
రైతులను కలవరపెడుతున్న సీసీఐ నిబంధనలు
మేలిరకం పత్తినే కొంటామంటూ అష్టకష్టాలు
అన్నదాతలను ఏమారుస్తూ కాలయాపన
రాష్ట్రం మొత్తం జోరుగా పత్తి కొనుగోళ్లు
ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ దయనీయ స్థితి
ముఖ్యమంత్రికి చేరని పత్తి రైతుల కష్టాలు
నందిగామ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : వ్యాపారుల కబంధ హస్తాల నుంచి పత్తి రైతును ఆదుకుని మద్దతు ధర అందించాల్సిన కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మొండిగా వ్యవహరిస్తోంది. గతానికి భిన్నంగా బయ్యర్లు కొన్న సరుకుపై కూడా విజిలెన్స్ దాడులు నిర్వహిస్తూ విస్మయం కలిగిస్తోంది. నిశితంగా పరిశీలిస్తూ తేడా ఉండే బయ్యర్లపై చర్యలు తీసుకుంటోంది. గన్నీ, ప్లాస్టిక్ బ్యాగుల్లో తెచ్చిన పత్తిని కొనడాన్ని కూడా సీసీఐ నిషేధించింది. సంచులకు ఉండే మట్టి, పీచు పత్తిలో చేరి కల్తీ అవుతుందన్నది సీసీఐ వాదన. కొత్తగా అమల్లోకి వచ్చిన ఆ నిబంధన తెలియక బయ్యర్లు బోరేల్లో తీసుకొచ్చిన పత్తిని కొంటున్నారు. మూడు రోజులుగా దాడులు నిర్వహిస్తున్న విజిలెన్స్ అధికారులు గుంటూరు మిల్లుల వద్దకు వచ్చిన సరుకును నిలిపివేశారు. దీంతో దాదాపు 500 లారీలకు పైగా రోడ్లపై నిలిచిపోయాయి. జిన్నింగ్ తరువాత దిగుబడి, గింజ శాతం ఏది తగ్గినా బయ్యర్‌పై చర్యలు తీసుకుని సదరు మిల్లును బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు సీసీఐ సిద్ధంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే సీసీఐ అన్నదాతలతో వ్యాపారం చేస్తుందనే చెప్పాలి తప్ప.. ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. ‘సీసీఐ వస్తుంది. పత్తి కొంటుంది.’ అంటూ ఊదరగొట్టిన నాయకులు చివరికి ఉసూరుమనిపించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి.. సీసీఐ ఉన్నతాధికారులను కలిసి నిబంధనలు సడలించేలా చూడాల్సిన అవసరం ఉంది.
ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే సమస్య
తొలకరి ప్రారంభంలో కురిసిన వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా రైతులు పత్తి సాగు ప్రారంభించారు. నాటి నుంచి అనుకూల వాతావరణంలో సాగు సాఫీగా సాగింది. పూత, కాయదశలో పత్తి ఉండగా, భారీ వర్షాలకు పంట దెబ్బతింది. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టి దెబ్బతిన్న పంటను కాపాడుకున్నారు. పంట చేతికొచ్చే సమయంలో మొంథా విధ్వంసంతో మరోమారు పంట దెబ్బతింది. రోజుల తరబడి వర్షం కురవడం వల్ల తెగుళ్లు, పురుగు ఆశించి పత్తి నాణ్యత తగ్గింది. గింజల్లో పురుగులు చేరాయు. కాయలు సరిగ్గా విచ్చుకోకపోవడం వల్ల పత్తి పూర్తి ఆరుదల రాక కాయలుగానే తీయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి రాష్ట్రంలో ఒక్క ఎన్టీఆర్ జిల్లా రైతులే ఎదుర్కొన్నారు. గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోని పత్తి సాగు ఆలస్యంగా చేపట్టారు. దీనివల్ల తుఫాను సమయానికి చేలల్లో పత్తి లేదు. తుఫాను పోయి.. పొలాలు ఆరుదలకు వచ్చిన సమయంలో అక్కడ పత్తి చేతికి రావడం వల్ల నాణ్యత కోల్పోలేదు. పైగా గుంటూరు జిల్లాలో జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి రైతులు సీసీఐతో సంబంధం లేకుండానే మంచి ధరకు పత్తిని అమ్ముకున్నారు. నాణ్యత కూడా ఉండడం వల్ల సీసీఐ కూడా అధిక మొత్తంలో కొనుగోలు చేసింది. రాయలసీమలో కూడా వర్షాలు తగ్గాకే పత్తి రావడం వల్ల అక్కడి రైతులు ఎటువంటి ఇబ్బందీ లేకుండా పంటను అమ్ముకోగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులు ఒకింత సంతోషంగా ఉండగా, ఒక్క ఎన్టీఆర్ జిల్లా పత్తి రైతులు మాత్రం ఇబ్బందుల్లో పడిపోయారు. కొనేవారు లేక పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచుకున్నారు. సదరు పత్తి తీసిన కూలీలకు అప్పు చేసి కూలీ చెల్లించారు. సాధారణంగా తొలిదశలో పత్తి పంట ద్వారా వచ్చిన సొమ్ముతోనే మిగిలిన పంటలకూ పెట్టుబడులు పెట్టారు. కానీ, ఈ ఏడాది తొలిదశ పత్తి అమ్ముడుపోకపోవడం వల్ల మిర్చి, పసుపు తదితర పంటల సాగుకు రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి
పత్తి రైతుల కష్టం తొలగించేందుకు జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఇతర రైతు సంఘాలు సంఘటితం కావాలి. పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడం ద్వారా అన్నదాతకు న్యాయం చేయాలి. సీసీఐ ఉన్నతాధికారులతో, జౌళిశాఖ మంత్రితో మాట్లాడించి సీసీఐ నిబంధనలు సడలించే చర్యలు చేపట్టాలి. రైతుల ఒత్తిడి మేరకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఫోన్‌లో సంప్రదిస్తూ వస్తున్నారు. నెల కిందట కేంద్ర జౌళిశాఖకు లేఖ రాయగా, ఆ శాఖ నుంచి కానీ, సీసీఐ నుంచి కానీ ఇంతవరకు సమాధానం రాకపోవడం గమనిస్తే పత్తి నాణ్యత విషయంలో సీసీఐ స్థిరమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోకపోతే తామే స్వయంగా ముఖ్యమంత్రిని కలుస్తామని కొందరు రైతులు చెబుతున్నారు.