డేంజర్ స్క్రబ్ థైపస్
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:06 AM
స్క్రబ్ థైపస్ కేసులు జిల్లాను వణికిస్తున్నాయి. జీజీహెచ్‌లో కేసులు పెరుగుతుండటంతో వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధికారులు తగు జాగ్రత్తలు చెబుతున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో స్క్రబ్ థైపస్ ఉంటుందని, అక్కడ సంచరించే జీవుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా వర్షాకాల పంటలు వేసే జూలై నుంచి జనవరి సమయంలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఎలుకల ద్వారా మొక్కలపైకి చేరి దానిద్వారా రైతును కుట్టే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
జిల్లాలో పెరుగుతున్న కేసులు
జీజీహెచ్‌కు నెలలో 5 నుంచి 10 మంది..
వ్యవసాయ పనులు చేసేవారే ఎక్కువ
ముందుగా మేల్కొంటేనే అరికట్టగలం
లేదంటే కాలేయం, కిడ్నీపై ప్రభావం
విజయవాడ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జీజీహెచ్‌లో నెలకు కనీసం ఐదు నుంచి పది స్క్రబ్ థైపస్ కేసులు నమోదవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కనీసం రోజుకు ఐదుగురు ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. వీరిలో అధికంగా వ్యవసాయ పనులు చేసేవారు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. స్క్రబ్ థైపస్ కేసు జీజీహెచ్‌కు మొదటిసారిగా 2008లో వచ్చింది. నాటి నుంచి క్రమంగా కేసులు పెరుగుతున్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా బారిన పడినవారికి తీవ్రమైన జ్వరం వస్తుందని, అయితే చాలామందికి ఇటువంటి వ్యాధి ఉందని తెలియకపోవడం వల్లే ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా కుట్టిన రెండు రోజుల్లోనే తీవ్రమైన జ్వరం రావడంతో పాటు కళ్లు పసుపు రంగులోకి మారతాయి. మొదట్లో టైఫాయిడ్, మలేరియా అనుకుని వాటికి సంబంధించిన మందులు వాడతారని, రోజులు గడవడం వల్ల తీవ్రత ఎక్కువవుతుందని వైద్యులు తెలిపారు. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది తీవ్రప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. జ్వరం వచ్చిన 72 గంటల్లోనే మలేరియా, టైఫాయిడ్‌తో పాటు స్క్రబ్ థైపస్, లెప్టోస్పైరోస్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధికి ప్రత్యేకంగా మందులు లేవని, దీర్ఘకాలంగా యాంటీ బయోటిక్ వాడితే తగ్గుతుందని అంటున్నారు.
స్క్రబ్ థైపస్ లక్షణాలు
స్క్రబ్ థైపస్ బ్యాక్టీరియా కుట్టిన రెండు రోజుల్లోనే తీవ్రమైన జ్వరం వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ జ్వర తీవ్రత పెరగడంతో పాటు కళ్లు పసుపు రంగులోకి మారతాయి. ఇలా కొంతకాలానికి అవయవాలపై ప్రభావం చూపుతుంది. కాలేయంపై ప్రభావం చూపడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. కొంతకాలానికి కిడ్నీలపై ప్రభావం చూపి డయాలసిస్‌కు దారితీస్తుంది. తీవ్రమైన అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియా కుట్టిన ప్రాంతంలో కొంతమందికి చిన్నపుండులా ఏర్పడుతుంది. మరికొంతమందికి అది కూడా ఉండదు.
అపరిశుభ్ర ప్రదేశంలోనే ఉంటుంది
స్క్రబ్ థైపస్ బ్యాక్టీరియా ఎక్కువగా అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉంటుంది. ఇటువంటి ప్రదేశాల్లో దొర్లాడిన జంతువులు మానవ సంచారంలోకి రావడంతో బ్యాక్టీరియా వాటితో పాటే వస్తుంది. జంతువులు రాల్చిన చోట చెప్పులు లేకుండా నడిచినా, కూర్చున్నా మనుషుల్ని కుడతాయి. ముఖ్యంగా రైతులు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. పొలాల్లోకి వెళ్లే రైతులు షూ, చెప్పులు వేసుకోవాలి. ఈ బ్యాక్టీరియా కుట్టిన రెండు రోజుల్లోనే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ తర్వాత మలేరియా, టైఫాయిడ్‌తో పాటు స్క్రబ్‌థైపస్ పరీక్ష చేసుకోవాలి. ఎక్కువ రోజులు అశ్రద్ధ చేయడం వల్ల కాలేయం, కిడ్నీలపై ప్రభావం చూపే ప్రమాదముంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారిలో వేగంగా ప్రభావం ఉంటుంది. స్క్రబ్ థైపస్ వ్యాధికి ప్రత్యేకమైన మందులు లేవు. తీవ్రత ఎక్కవగా ఉన్నవారు దీర్ఘకాలికంగా యాంటీబయోటిక్ మందులు వాడితే తగ్గుతుంది.
- డి.శారద, అసోసియేట్ ప్రొఫెసర్, మైక్రోబయాలజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ