Share News

ఒడిశా రైతులతో గంజాయి స్నేహం

ABN , Publish Date - Jun 15 , 2025 | 01:01 AM

కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ముసుగులో జరుగుతున్న గంజాయి వ్యాపారం కేసులో అనేక చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేయగా, పెనమలూరు మండలం కానూరు నారాయణపురం కాలనీకి చెందిన బిక్కి నరేంద్ర వ్యవహారాలు బయట పడుతున్నాయి.

ఒడిశా రైతులతో గంజాయి స్నేహం

డుబ్రీగూడ టూ బెంగళూరు వయా బెజవాడ

ఐదారేళ్లుగా యథేచ్ఛగా గంజాయి వ్యాపారం

బయటకు వస్తున్న బిక్కి నరేంద్ర లీలలు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ముసుగులో జరుగుతున్న గంజాయి వ్యాపారం కేసులో అనేక చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేయగా, పెనమలూరు మండలం కానూరు నారాయణపురం కాలనీకి చెందిన బిక్కి నరేంద్ర వ్యవహారాలు బయట పడుతున్నాయి. ఒడిశాలోని డుబ్రీగూడ నుంచి బెంగళూరుకు గంజాయి సరఫరా చేస్తున్న నరేంద్ర ఐదారేళ్ల నుంచి ఈ వ్యవహారాలు నడుపుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. గంజాయి కొనుగోలుకు మధ్యవర్తులతో కాకుండా నేరుగా రైతులతోనే సత్సంబంధాలు పెట్టుకుని వ్యాపారంలో కిక్కును పొందుతున్నాడు. నరేంద్ర కొంటున్న గంజాయి మొత్తం ఒడిశాలోని డిబ్రీగూడలో పండించిందేనని పోలీసులు గుర్తించారు.

మైనర్‌ను తీసుకొచ్చి ఉపాధి

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో ఒక మైనర్‌ ఉన్నాడు. సరుకు కొనుగోలు నిమిత్తం నరేంద్ర ఒడిశాకు వెళ్లినప్పుడు ఆ మైనర్‌ను గుర్తించి సహాయకుడిగా తెచ్చుకున్నాడు. నరేంద్ర తన గ్యాంగ్‌తో గంజాయి కొనుగోలుకు వెళ్లిన ప్రతిసారీ కొండలపై నుంచి ప్యాకెట్లను మోసుకుని బాలుడు కిందకు రావడాన్ని గమనించాడు. పైగా ఆ అబ్బాయి తెలుగు బాగా మాట్లాడుతుండటంతో కానూరుకు తీసుకురావాలని భావించాడు. కొనుగోలు చేసిన సరుకును సంబంధిత వ్యక్తులకు చేర్చడానికి ఈ మైనర్‌ బాగా ఉపయోగపడతాడని గుర్తించాడు. దీంతో ఆ బాలుడిని కానూరుకు తీసుకొచ్చి ఒక రూమ్‌ను అద్దెకు తీసుకుని ఉంచాడు. అతనికి అవసరమైన అన్ని సదుపాయాలు నరేంద్రనే కల్పించాడు.

బైకులు, కార్లతో ఎస్కార్ట్‌

గంజాయి గ్యాంగ్‌ సాధారణంగా ఎస్కార్ట్‌ విధానాన్ని పాటిస్తుంది. వెనుకవైపు రెండు బైక్‌లపై గంజాయి తీసుకొస్తున్నారంటే ముందు మరో రెండు బైకులు ఆ మార్గంలో పరిస్థితులను గమనించడానికి వెళ్తుంటాయి. ఎక్కడెక్కడ పోలీసులు ఉన్నారు, ఎక్కడైనా చెకింగ్‌లు జరుగుతున్నాయా.. అనే విషయాలను గమనించి సమాచారం అందిస్తాయి. ఇప్పటివరకు వెనుకవైపు కారులో గంజాయిని తీసుకొస్తే ముందు నుంచి బైకులు ఎస్కార్ట్‌ ఇచ్చేవి. నరేంద్ర ఇందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కారులో సరుకును తీసుకొస్తే పోలీసులకు దొరికిపోవడం ఖాయమని భావించాడు. ఇందుకోసం బైక్లపై తన అనుచరులతో గంజాయిని రప్పిస్తూ కార్లతో వారికి ఎస్కార్ట్‌ ఇచ్చేవాడు. ఇందుకోసం తన సొంత కార్లను ఉపయోగించడమే కాకుండా అద్దెకు కార్లు తీసుకునేవాడు.

Updated Date - Jun 15 , 2025 | 01:01 AM