Share News

రాజకీయం.. రసవత్తరం

ABN , Publish Date - May 15 , 2025 | 01:05 AM

తిరువూరు మునిసిపాలిటీలో క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. ఈనెల 19న పాలకవర్గ వైసీపీ నుంచి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో ఆ పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొందరు వైసీపీ కౌన్సిలర్లు పక్క చూపులు చూస్తుండటంతో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు కలిసి వారిని బుధవారం పట్టణం దాటించారు. ప్రత్యేక వాహనంలో దూరప్రాంతానికి తరలించారు.

రాజకీయం.. రసవత్తరం
తిరువూరు మునిసిపల్‌ కార్యాలయం

తిరువూరు మునిసిపాలిటీలో క్యాంప్‌ రాజకీయాలు

19న వైసీపీ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో రాజుకున్న వేడి

పక్కచూపులు చూస్తున్న కొంతమంది కౌన్సిలర్లు

చైర్మన్‌ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు

ప్రత్యేక వాహనాల్లో పట్టణం దాటించిన స్థానిక నేతలు

తిరువూరు, మే 14 (ఆంధ్రజ్యోతి) : తిరువూరు మునిసిపాలిటీలో క్యాంప్‌ రాజకీయాలు మొదలయ్యాయి. ఈనెల 19న పాలకవర్గ వైసీపీ నుంచి కొత్త చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో ఆ పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొందరు వైసీపీ కౌన్సిలర్లు పక్క చూపులు చూస్తుండటంతో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు కలిసి వారిని బుధవారం పట్టణం దాటించారు. ప్రత్యేక వాహనంలో దూరప్రాంతానికి తరలించారు.

19న కొత్త చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో..

తిరువూరు మునిసిపల్‌ వైసీపీ చైర్మన్‌ ఎన్నిక మొదటి నుంచి రాజకీయ వివాదాలకు దారితీసింది. ఈ కౌన్సిల్‌లో మొత్తం 20 మంది సభ్యులు ఉండగా, వారిలో 17 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ సభ్యులు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి ఏప్రిల్‌ 3న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 23న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఆమె రాజీనామాను ఆమోదించారు. దీంతో గత ఒప్పందం ప్రకారం చైర్‌పర్సన్‌ పదవి ఆశిస్తున్న మోదుగు ప్రసాద్‌ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్‌ ఎన్నికకు సంబంధించి ఈ నెల 12న నోటిఫికేషన్‌ జారీ కాగా, 19న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తిరువూరులో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు పక్కచూపులు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఎనిమిది మంది కౌన్సిలర్లు పార్టీ మారుతున్నారని, ప్రస్తుత మున్సిపల్‌ బోర్డు వైసీపీ చేయి జారుతుందనే ప్రచారంతో నాయకులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలుమార్లు తమ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో చైర్మన్‌ పీఠం పార్టీ చేజారి పోకూడదనే ఆలోచనతో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో క్యాంప్‌ రాజకీయానికి తెరలేపారు.

ఆది నుంచీ వివాదాలే..

వైసీపీ ఆధ్వర్యంలో పాలకవర్గం కొలువుదీరిన నాటి నుంచి ఆ పార్టీ కౌన్సిలర్ల మధ్య సఖ్యత కొరవడింది. ఆధిపత్య పోరు నేపథ్యంలో కౌన్సిల్‌ సమావేశాలే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైర్‌పర్సన్‌ రెండేళ్ల తర్వాత రాజీనామా చేయాలనే నాటి ఎమ్మెల్యే రక్షణనిధి షరతు, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కొన్ని అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయి.

Updated Date - May 15 , 2025 | 01:05 AM