Share News

బుడమేరు రక్షణ గోడ పూర్తి

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:54 AM

బుడమేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బుడమేరు వరద మళ్లింపు కాల్వ (బీడీసీ) ఎడమ కాల్వకట్టపై వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 3.85 కిలోమీటర్ల నుంచి 4.2 కిలోమీటర్ల వరకు సుమారు 365 మీటర్ల మేర ఈ వాల్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన రెండు నెలల్లో పూర్తిచేసి రికార్డు సృష్టించారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ అనేక అవరోధాలను అధిగమిస్తూ ఎట్టకేలకు పూర్తిచేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అనుక్షణం పనులపై శ్రద్ధచూపి త్వరగా పూర్తయ్యేలా చూశారు.

బుడమేరు రక్షణ గోడ పూర్తి
పూర్తయిన రక్షణ గోడ

అవరోధాలను అధిగమించి పూర్తిచేసిన ప్రభుత్వం

భారీ వర్షాలను సైతం తట్టుకుని సాగిన పనులు

వెలగలేరు వద్ద నుంచి 365 మీటర్ల వరకు వాల్‌

బుడమేరు నుంచి బెజవాడకు వరద రాకుండా చెక్‌

ఇతర ప్రక్షాళన పనులు కూడా వేగవంతం

(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం) : బుడమేరు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బుడమేరు వరద మళ్లింపు కాల్వ (బీడీసీ) ఎడమ కాల్వకట్టపై వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 3.85 కిలోమీటర్ల నుంచి 4.2 కిలోమీటర్ల వరకు సుమారు 365 మీటర్ల మేర ఈ వాల్‌ నిర్మాణాన్ని ప్రారంభించిన రెండు నెలల్లో పూర్తిచేసి రికార్డు సృష్టించారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ అనేక అవరోధాలను అధిగమిస్తూ ఎట్టకేలకు పూర్తిచేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అనుక్షణం పనులపై శ్రద్ధచూపి త్వరగా పూర్తయ్యేలా చూశారు.

యుద్ధప్రాతిపదికన..

గత ఏడాది సెప్టెంబరులో బుడమేరుకు వచ్చిన వరదలకు బీడీసీపై 3.9 కిలోమీటర్‌ వద్ద 200 మీటర్ల మేర మూడు భారీగండ్లు పడ్డాయి. దీంతో బెజవాడ పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ గండ్లను యుద్ధప్రాతిపదికన వారంలో తాత్కాలికంగా పూడ్పించారు. అయితే, ఈ గండ్ల పూడికకు పెద్దపెద్ద బండలు వాడటం వల్ల కాల్వలో నుంచి సీపేజ్‌ కట్టడి కాలేదు. దీంతో శాశ్వతంగా గోడ నిర్మించడమే పరిష్కారమనుకుని ప్రభుత్వం రూ.23 కోట్ల నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో 550 మీటర్ల మేర రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాన్ని మే 5న ప్రారంభించారు. తొలిదశగా 365 మీటర్ల రిటైనింగ్‌ వాల్‌ను పూర్తిచేశారు. 8.65 మీటర్ల ఎత్తు, 1.8 మీటర్ల వెడల్పుతో ఈ గోడ నిర్మితమైంది. అలాగే, శాంతినగర్‌ వంతెన నుంచి ఈలప్రోలు వంతెన వరకు లెఫ్‌ బండ్‌ను గ్రావెల్‌ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. శాంతినగర్‌-కవులూరు మధ్య శిథిలావస్థలో ఉన్న పాత వంతెనను తొలగించే పనులు ప్రారంభించారు. ఇప్పటికే రూ.1.8 కోట్లతో వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ ఆధునికీకరణ పనులు చేయించారు. రెగ్యులేటర్‌కు ఉన్న 12 గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. వరదల సమయంలో సులువుగా గేట్లు తెరుచుకునేలా ఈ పనులు జరిగాయి.

ప్రక్షాళన పనులు చకచకా..

రిటైనింగ్‌ వాల్‌ పూర్తితో పాటు రెగ్యులేటర్‌ దిగువ భాగం నుంచి వరదను కొల్లేటికి సులువుగా తరలించే పనులు చేపట్టారు. రెగ్యులేటర్‌ దిగువ భాగంలో ఉన్న కాల్వ నుంచి వరదను ఎనికేపాడు యూటీ వద్దకు తరలించి, ఇప్పుడున్న 4 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. పనులు ప్రారంభించేందుకు చర్యలు కూడా చేపట్టారు. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రెయిన్‌లో పూడిక పనులు చేపట్టారు. కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రెయిన్‌ నీరు సముద్రంలోకి వెళ్లేలా.. రూ.9 కోట్లతో డీ సిల్టింట్‌ పనులు చేస్తున్నారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తికావడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గండ్ల సమయంలో రైతుల పొలాల్లో మేట వేసిన పూడికను తొలగించడంతో పాటు పొలాల్లోకి కావాల్సిన మట్టిని తోలించారు. ఇకపై గండ్లుపడే అవకాశం లేకుండా చేయడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:54 AM