మత్తు కలిపింది ఇద్దరినీ..
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:16 AM
వైజాగ్‌కు చెందిన అర్జాల శ్రీవాత్సవ్, బొడ్డేపల్లి హవీల డిలైట్.. 19 గ్రాముల ఎండీఎంఏతో పాటు ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను ఈగల్ బృందం పట్టుకుని మాచవరం పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరినీ పోలీసులు ఒకటో ఏసీఎంఎం కోర్టులో శనివారం హాజరుపరచగా, 13వ తేదీ వరకు రిమాండ్ విధించారు.
ఇంటర్ కాలేజీలో డ్రగ్స్ అలవాటైన శ్రీవాత్సవ్
ఇద్దరూ డ్రగ్స్ కోసం బెంగళూరు పయనం
అంతటితో ఆగకుండా విశాఖపట్నానికి సరఫరా
బస్సు విజయవాడ రాగానే పట్టుకున్న పోలీసులు
ఎండీఎంఏతో పాటు ఎల్‌ఎస్‌డీ డ్రగ్ స్వాధీనం
విశాఖపట్నం ప్రేమజంట కేసులో కొత్త కోణాలు
ప్రేమికులిద్దరికీ వచ్చేనెల 13 వరకు రిమాండ్
(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వైజాగ్‌కు చెందిన అర్జాల శ్రీవాత్సవ్, బొడ్డేపల్లి హవీల డిలైట్.. 19 గ్రాముల ఎండీఎంఏతో పాటు ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ను ఈగల్ బృందం పట్టుకుని మాచవరం పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరినీ పోలీసులు ఒకటో ఏసీఎంఎం కోర్టులో శనివారం హాజరుపరచగా, 13వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఈ ఇద్దరి వద్ద ఎండీఎంఏతో పాటు ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌కు సంబంధించిన పేపర్లు లభించాయి. వాటిని నాలుకపై పెట్టుకుని చప్పరిస్తే కిక్ ఎక్కుతుంది. ఈ రెండు డ్రగ్స్‌ను శ్రీవాత్సవ్, హవీల వద్ద స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ కలిపిన ప్రేమ
విశాఖపట్నం మురళీనగర్ ఎన్జీవో కాలనీ ఆర్‌ఆర్‌ఆర్ గార్డెన్‌కు చెందిన అర్జాల శ్రీవాత్సవ్ తండ్రి నావికాదళంలో పనిచేస్తున్నాడు. అక్కడే మెకానికల్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. 15 ఏళ్ల వయస్సు నుంచి శ్రీవాత్సవ్‌కు సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉంది. ఇంటర్ చదువుతున్నప్పుడు స్నేహితుల నుంచి గంజాయి, డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. ఇంటర్‌లో లోహిత యాదవ్ అనే యువకుడితో శ్రీవాత్సవ్‌కు స్నేహం కుదిరింది. అతడు తరచూ డ్రగ్స్ తీసుకునేవాడు. లోహిత యాదవ్ నుంచి డ్రగ్స్‌ను తీసుకోవడం మొదలుపెట్టాడు. ఇంతకుముందు డ్రగ్స్‌తో శ్రీవాత్సవ్ విశాఖ మూడో పట్టణ పోలీసులకు చిక్కగా కేసు నమోదైంది. ఏడాది క్రితం విశాఖకు చెందిన బొడ్డేపల్లి హవీల డిలైట్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె తమ్ముడి ద్వారా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరికీ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఆ ప్రేమ మత్తుగా మారింది. శ్రీవాత్సవ్ మాదిరిగానే హవీల సిగరెట్, మద్యం తాగడంతో పాటు డ్రగ్స్ తీసుకుంటుంది. విశాఖపట్నం సీబీఎం కాంపౌండ్ ప్రీమియర్ ప్యారడైజ్ ప్రాంతానికి చెందిన బొడ్డేపల్లి హవీల తండ్రి శామ్యూల్ సివిల్ ఇంజనీర్. ఆమె గడిచిన ఏడాది నాగపూర్‌లోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసింది. తర్వాత పూణెలో బీడీఎం (బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్)గా మూడు నెలలు పనిచేసింది. తర్వాత ఉద్యోగం మానేసి వైజాగ్ వెళ్లిపోయింది. సివిల్ ఇంజనీర్‌గా ఉన్న తండ్రికి సహాయకురాలిగా ఉంటోంది. ఎంబీఏ చదువుతున్నప్పుడే స్నేహితుల ద్వారా సిగరెట్, మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంది. వైజాగ్‌కు వచ్చాక తన తమ్ముడు ద్వారా శ్రీవాత్సవ్‌తో పరిచయం ఏర్పడింది. శ్రీవాత్సవ్, హవీలకు ఒకే అలవాట్లు ఉండటంతో ఇద్దరి మధ్య బంధం బలపడింది. ఇద్దరూ కలిసి వైజాగ్‌లో ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నారు.
మాన్‌సూన్ ‘బ్లాస్ట్’ అయింది
శ్రీవాత్సవ్‌తో పాటు మరికొంతమంది స్నేహితులు గోవాలో ‘మాన్‌సూన్ బ్లాస్ట్’ పేరుతో మ్యూజికల్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో పాల్గొనడానికి శ్రీవాత్సవ్ ఈనెల 14న విశాఖ నుంచి గోవా వెళ్లాడు. అక్కడ ఆరు రోజులు ఉన్నాడు. అక్కడి నుంచి ఎండీఎంఏ డ్రగ్ కొనడానికి బెంగళూరు వెళ్లాడు. అక్కడికి హవీల డిలైట్‌ను పిలిపించుకున్నాడు. శ్రీవాత్సవ్ 21వ తేదీన గోవా నుంచి బెంగళూరుకు వెళ్లాడు. అదే సమయానికి హవీల అక్కడికి చేరుకుంది. ఇద్దరూ కలిసి బెంగళూరులో శ్రీవాత్సవ్ స్నేహితుడు ముత్యాల తరుణ్ రూమ్‌లో ఉన్నారు. శ్రీవాత్సవ్ తన స్నేహితుల ద్వారా మల్లెల మధుసూదన్‌రెడ్డి అలియాస్ మద్ది నుంచి రెండు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను రూ.4,700కు కొన్నాడు. ఈ డబ్బును హవీల ఫోన్‌పే ద్వారా పంపింది. తర్వాత శ్రీవాత్సవ్ వాట్సాప్‌కు మద్ది డ్రాప్ పాయింట్ పంపాడు. అక్కడికి శ్రీవాత్సవ్, హవీల వెళ్లి ఎండీఎంఏను తీసుకుని తాగారు.
సింగసండ్రలో సిగరెట్ పెట్టె
శ్రీవాత్సవ్, హవీల బెంగళూరులో ఉండగా, వైజాగ్‌లో లోహిత యాదవ్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చేటప్పుడు 20 గ్రాముల ఎండీఎంఏ తీసుకురావాలని చెప్పాడు. తాను చెప్పినట్టు చేస్తే అందులో నుంచి రెండు గ్రాములు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. లోహిత యాదవ్ వాట్సాప్ కాల్‌చేసి బెంగళూరులోని సింగసండ్ర మెట్రో రైల్వేస్టేషన్ వద్ద ఉన్న డ్రాప్‌పాయింట్ చిరునామా చెప్పాడు. దాని లొకేషన్‌ను శ్రీవాత్సవ్ వాట్సాప్‌కు పంపాడు. అక్కడ డ్రగ్స్ వ్యాపారులు ఎండీఎంఏను సిగరెట్ ప్యాకెట్లలో పెట్టి అక్కడ ఉంచారు. వాటిని తీసుకురావాలని లోహిత యాదవ్ చెప్పాడు. శ్రీవాత్సవ్, హవీల అక్కడికి వెళ్లి చూడగా 20 జిప్ కవర్ ప్యాకెట్‌ల్లో ఎండీఎంఏ ఉంది. అందులో ఒక ప్యాకెట్‌ను వారిద్దరూ తాగారు. 27వ తేదీన ఇద్దరూ కలిసి బెంగళూరు నుంచి వైజాగ్‌కు బస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. డ్రగ్ ఉన్న 19 కవర్లలో తొమ్మిది ప్యాకెట్లను హవీలకు ఇచ్చాడు. మిగిలిన ప్యాకెట్లను శ్రీవాత్సవ్ తన వద్ద ఉంచుకున్నాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు-విశాఖపట్నం బస్సు ఎక్కారు. ఈగల్ టీమ్‌కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు.. బస్సు విజయవాడలోని మహానాడు వద్దకు రాగానే ఆపి తనిఖీ చేయగా, వీరిద్దరూ పట్టుబడ్డారు. శ్రీవాత్సవ్‌తో ఎండీఎంఏ తెప్పిస్తున్న లోహిత యాదవ్‌ను మాచవరం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం అతడి పుట్టినరోజు. ఆ సందర్భంగా నిర్వహించుకునే పార్టీ కోసమే ఈ డ్రగ్‌ను రప్పిస్తున్నట్టు తెలిసింది. పోలీసులకు దొరక్కపోయి ఉంటే ఈ డ్రగ్‌తో ఎంజాయ్ చేసేవారు. లోహిత యాదవ్‌ను శనివారం రాత్రి విజయవాడకు తీసుకొచ్చారు.