Share News

వి..హంగామా

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:59 AM

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విహంగాలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఎయిరుపోర్టు చుట్టుపక్కల వ్యర్థాలు పేరుకుపోవడం, వర్షపు నీరు.. చెరువుల మాదిరిగా నిల్వ ఉండటం, వాటిలో చేపలు పెరుగుతుండటంతో పక్షులు భారీగా వస్తున్నాయి. విమాన టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఎదురుగా వస్తున్నాయి. విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేయించాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వందలమంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.

వి..హంగామా
విమానాశ్రయం ప్రహరీ వద్ద చెరువుగా నిలిచిపోయిన వర్షపు నీరు

గన్నవరం విమానాశ్రయంలో పక్షులతో ఇబ్బందులు

విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌ సమయంలో అడ్డుగా..

చెత్తకుప్పలతో నిండిపోతున్న ఎయిర్‌పోర్టు పరిసరాలు

వర్షపు నీరు నిల్వ ఉండి.. చెరువులుగా మారి..

భారీగా తరలివస్తున్న పెద్ద సైబీరియా పక్షులు

బోర్డులు పెట్టి చేతులు దులుపుకొన్న పంచాయతీ

గురువారం ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) : గన్నవరంలోని విజయవాడ విమానాశ్రయం నుంచి విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయడానికి పైలెట్లు భయపడాల్సి వస్తోంది. ఎక్కడ పక్షులు ఢీకొంటాయేమోనని ఆందోళన చెందాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో విమానాశ్రయం రన్‌వే పరిధిలో పక్షులు ఎగరటం పరిపాటిగా మారింది. పక్షుల కారణంగా విమానాలు ల్యాండింగ్‌ కాకుండా ఆకాశంలోనే చక్కెర్లు కొట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. గురువారం ఓ పక్షి ఢీకొనడంతో ఏకంగా విమాన సర్వీసే రద్దయ్యింది.

విమానాశ్రయం చుట్టూ ఆహార వ్యర్థాలు, చెత్తాచెదారం

విమానాశ్రయం చుట్టూ ఆహార వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని ఎక్కువగా వేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నాలుగువైపులా గన్నవరం, దావాజీగూడెం, అల్లాపురం, బుద్దవరం, అజ్జంపూడి, కేసరపల్లి పంచాయతీలు ఉన్నాయి. ఈ ఆరు గ్రామాల పరిధిలోని పంచాయతీ పాలకవర్గాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. గన్నవరం పంచాయతీ పనితీరైతే ఘోరంగా ఉంది. రోడ్లపై చెత్తకుండీలు, పక్కనే వ్యర్థాలు ఉంటున్నాయి. గన్నవరంలోని హోటళ్ల నిర్వాహకులు, కొబ్బరిబొండాల దుకాణాలవారు, కూరగాయలు విక్రయించేవారు, మాంసం షాపులవారు తమ దగ్గర ఉన్న వ్యర్థాలన్నింటినీ గన్నవరం చివర.. అంటే విమానాశ్రయానికి సమీపంలో ఎన్‌హెచ్‌-16 పక్కనే డంప్‌ చేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో పాటు దుకాణాల్లోని చెత్తాచెదారం అంతా కూడా ఇక్కడే డంప్‌ అవుతోంది. దీంతో కాకులు, కొంగలు, ఇతర పక్షులు ఆహారం కోసం వస్తున్నాయి. పక్షుల సంచారం వల్ల విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌కు సమస్య ఏర్పడుతోంది. విమానాలు ల్యాండ్‌ అయ్యే ముందు, టేకాఫ్‌ అయ్యే సమయంలో పక్షులు ఉంటే పారిపోవటానికి వీలుగా బాంబులు పేలుస్తారు. కానీ, ఇటీవల కాలంలో సైబీరియా నుంచి కొంగలు వస్తున్నాయి. ఇవి శబ్దాలకు పారిపోవట్లేదు.

సైబీరియా పక్షులతో సమస్య

గన్నవరం విమానాశ్రయం రన్‌వే ప్రహరీవైపు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వర్షాలు కురవటం వల్ల ఇవన్నీ చెరువులుగా మారుతున్నాయి. వాస్తవానికి ఈ నీరు హైవే పక్కన డ్రెయిన్‌ మార్గంలో కేసరపల్లి మీదుగా సాగుతూ బుడమేరులో కలవాలి. కానీ, డ్రెయిన్‌ పూడుకుపోవటం, ఆక్రమణల కారణంగా నీరు ఎటూ పోవట్లేదు. అవన్నీ క్రమేణా చెరువులుగా మారుతున్నాయి. వీటిలోని చేపలు తినటానికి సైబీరియా కొంగలు వస్తున్నాయి. ఈ కొంగలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. ఈ వృథా నీటిని మళ్లించేందుకు పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. దావాజీగూడెం, అల్లాపురం, బుద్దవరం, అజ్జంపూడి గ్రామాల్లో అయితే పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు జరిగినప్పుడు ఆహార వ్యర్థాలన్నింటినీ రోడ్ల పక్కనే పడేస్తున్నారు. ఫలితంగా విమానాశ్రయ పరిసరాలు పక్షులకు ఆవాసంగా మారుతున్నాయి. గతంలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానం ల్యాండ్‌ అయినపుడు రన్‌వే ప్రహరీ బయట నల్లటి పొగ వ్యాపించింది. చెత్త తగలబడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

ఎయిర్‌పోర్టు అధికారులు వినతులు పట్టించుకోరా?

ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్నప్పటి నుంచే ఈ సమస్యను గుర్తించిన ఎయిర్‌పోర్టు అధికారులు ఆ చుట్టుపక్కల ఆహార వ్యర్థాలను అరికట్టాలని, చెత్తకుప్పలను వేయించొద్దని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. ఎయిర్‌పోర్టు అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో కూడా ఈ అంశం చర్చకు దారితీసింది. అప్పట్లో తాత్కాలిక చర్యలు తీసుకున్నా ఆ తర్వాత వదిలేశారు. పంచాయతీలు బోర్డులు ఏర్పాటుచేసి చేతులు దులుపుకొన్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుని విమాన ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 06 , 2025 | 12:59 AM