Share News

భవానీల నిరసన

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:46 AM

‘డౌన్‌.. డౌన్‌.. పోలీస్‌’ అంటూ భవానీ మాలధారులు నిరసన వ్యక్తం చేశారు. మాలలో ఉన్న తమపై విచక్షణ కోల్పోయి దాడి చేసిన కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

భవానీల నిరసన
ఆందోళన చేస్తున్న భవానీలకు సర్దిచెబుతున్న పోలీసులు

జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

పరిమితికి మించి వెళ్తున్న ఆటోను ఆపిన కానిస్టేబుల్‌

స్క్యూబ్రిడ్జి వద్ద గొడవ.. చేయిచేసుకున్న కానిస్టేబుల్‌

క్షమాపణ చెప్పాలంటూ బైఠాయించిన భవానీలు

రంగంలోకి దిగి సర్దిచెప్పిన పోలీసు ఉన్నతాధికారులు

కానిస్టేబుల్‌పై చర్యలకు హామీ ఇవ్వడంతో విరమణ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ) : ‘డౌన్‌.. డౌన్‌.. పోలీస్‌’ అంటూ భవానీ మాలధారులు నిరసన వ్యక్తం చేశారు. మాలలో ఉన్న తమపై విచక్షణ కోల్పోయి దాడి చేసిన కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో గంటపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. భజన నిమిత్తం 16 మంది భవానీలు కంకిపాడు నుంచి తాడేపల్లి బయల్దేరారు. పరిమితికి మించి ప్రయాణిస్తున్న ఆటోను మార్గంమధ్యలో తాడిగడప 100 అడుగుల రోడ్డు వద్ద కానిస్టేబుల్‌ ఆపారు. ఆ సమయంలోనే భవానీలకు, కానిస్టేబుల్‌కు మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. అయితే, మరోసారి అదే కానిస్టేబుల్‌ ఆటోను సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద ఆపి ఫొటో తీసి పంపించేశారు. ఇదే సమాచారాన్ని సదరు కానిస్టేబుల్‌.. పటమట పోలీస్‌ స్టేషన్‌లోని మరో కానిస్టేబుల్‌కు చేరవేశారు. పటమట పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఆటోను బెంజిసర్కిల్‌ వద్ద ఆపి విచారణ చేశారు. ఈ సందర్భంలోనూ భవానీలకు, కానిస్టేబుల్‌కు వివాదం జరిగింది. కొద్దిసేపటి తరువాత ఆటోలో బయల్దేరిన భవానీలను కానిస్టేబుల్‌ వెంబడించి స్క్యూబ్రిడ్జి వద్ద నిలుపుదల చేశారు.

రోడ్డుపై బైఠాయించిన భవానీలు

స్క్యూబ్రిడ్జి వద్ద ఆటోను ఆపిన కానిస్టేబుల్‌కు, భవానీ మాలాధారులకు మళ్లీ గొడవ అయ్యింది. భవానీ మాలధారణలో ఉన్న ఓ హిజ్రాపై కానిస్టేబుల్‌ చేయుచేసుకున్నాడు. చేతిపై బలంగా కొట్టడంతో తోటి భవానీ మాలధారులు కానిస్టేబుల్‌పై తిరగబడ్డారు. దీంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే భవానీలంతా హైవేపై నినాదాలు చేశారు. కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని బైఠాయించారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. అటు కనకదుర్గమ్మ వారధి వరకు, ఇటు రామవరప్పాడు రింగ్‌ వరకు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ఆందోళన కొనసాగింది. కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకునే వరకు కదిలేదని భవానీలు పట్టుబడటంతో ఏసీపీ దామోదర్‌ ఘటనాస్థలానికి చేరుకుని భవానీలతో మాట్లాడారు. వివాదానికి కారణమైన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళనను విరమించారు.

వివాదంపై విచారణ

భవానీ మాలాధారులకు, పోలీస్‌ కానిస్టేబుల్‌కు జరిగిన వివాదంపై విచారణ వేగవంతం చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రమాదకరంగా వెళ్తున్న భవానీ మాలాధారుల ఆటోను కానిస్టేబుల్‌ ఆపి, వారికి జాగ్రత్తలు చెప్పినట్లు పేర్కొన్నారు. భవానీలు సహనం కోల్పోయి కానిస్టేబుల్‌పై వాగ్వాదానికి దిగడమే కాకుండా అతని బైక్‌ను కింద పడేశారని, ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టారని, మరో కానిస్టేబుల్‌పై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ వివాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, సీసీ ఫుటేజీలను సేకరిస్తున్నామని తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Dec 09 , 2025 | 12:46 AM