Share News

దీక్షగా కదిలారు

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:48 AM

ఇంద్రకీలాద్రిపై భవానీల సంబరం ఆరంభమైంది. ఐదు రోజులు జరిగే భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు గురువారం జరిగిన అంకురార్పణతో మొదలయ్యాయి. మొదటిరోజే ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఎటుచూసినా సిందూర ఛాయలు కనిపించాయి.

దీక్షగా కదిలారు
కనకదుర్గానగర్‌లో భవానీల రద్దీ

భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు ప్రారంభం

తొలిరోజు 50 వేల మంది భక్తుల రాక

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై భవానీల సంబరం ఆరంభమైంది. ఐదు రోజులు జరిగే భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు గురువారం జరిగిన అంకురార్పణతో మొదలయ్యాయి. మొదటిరోజే ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఎటుచూసినా సిందూర ఛాయలు కనిపించాయి. గురువారం ఉదయం 6.30 నుంచి రాత్రి వరకు 50 వేల మందికి పైగా భవానీలు దీక్షలను విరమణ చేశారు. విజయవాడ, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన భవానీలు అధికంగా వచ్చారు. బుధవారం రాత్రే నగరానికి చేరుకుని, గురువారం తెల్లవారుజామున గిరిప్రదక్షిణ చేసి, వినాయకుడి ఆలయం వద్ద క్యూమార్గంలోకి ప్రవేశించారు. తొలి దర్శనం కోసం చాలామంది భవానీలు రాత్రి నుంచి క్యూలలోనే ఉండిపోయారు. కాగా, ప్రధానాలయంలో అమ్మవారి మూలవిరాట్‌ వద్ద జ్యోతి వెలిగించిన అర్చకులు, ఆలయ అధికారులు ఆ జ్యోతిని కనకదుర్గానగర్‌లోని హోమగుండాల వద్దకు తీసుకెళ్లారు. మొదటి హోమగుండం వెలిగించాక భక్తులను దర్శనానికి వదిలారు. మోడల్‌ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా భక్తుల రద్దీని పోలీసు, వీఎంసీ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల లెక్కలు ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై ప్రదర్శిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 29 వేల మంది దర్శించుకున్నారు.

గగనతలం నుంచి లెక్క

భవానీల సంఖ్య తొలిరోజు ఒక మాదిరిగానే ఉంది. శుక్రవారం సెంటిమెంట్‌ కారణంగా ఇరుముడులను విప్పడానికి ఇష్టపడరు. శనివారం నుంచి భవానీల రద్దీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎంతమంది భవానీలు వస్తున్నారన్న లెక్కలను పోలీసులు గగనతలం నుంచే తెలుసుకుంటున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీలు రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌ నుంచి క్యూలైన్‌ వద్దకు వస్తుంటారు. దూరప్రాంతాల నుంచి బృందాలుగా వచ్చేవారు ప్రత్యేక వాహనాల్లో చేరుకుంటారు. ఈ వాహనాలను బీఆర్టీఎస్‌ రోడ్డులో నిలుపుదల చేసుకుంటారు. ఈ ప్రాంతాల్లో టీథర్డ్‌ డ్రోన్లను పోలీసులు ఎగురవేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి ఎంతమంది భవానీలు ఇంద్రకీలాద్రి వైపునకు అడుగులు వేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ డ్రోన్లను దానికి అనుసంధానం చేశారు. డ్రోన్లు పైకి ఎగరగానే భవానీలు ఎంతమంది అనే విషయాన్ని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై కనిపిస్తుంది. దాన్ని బట్టి హోల్డింగ్‌ పాయింట్లు, క్యూలైన్ల వద్ద ప్రణాళికను అమలు చేస్తారు.

Updated Date - Dec 12 , 2025 | 12:48 AM