Share News

పుట్టినింటి నుంచి మెట్టినింటికి..

ABN , Publish Date - May 03 , 2025 | 12:56 AM

మోనికా రజని.. భారత-పాక్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు. పాకిస్థాన్‌లోని కరాచీలో పుట్టిన ఈమె నగరంలోని గురునానక్‌ కాలనీకి చెందిన పవన్‌ బొడానిని 2016లో వివాహం చేసుకున్నారు.

పుట్టినింటి నుంచి మెట్టినింటికి..

పాకిస్థాన్‌కు చెందిన బెజవాడ కోడలు ప్రయాణం

దేశాలు వేరైనా పెద్దలు కుదిర్చిన పెళ్లి

ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్‌కు పయనం

ఆంక్షల నేపథ్యంలో ఆగమేఘాలపై భారతకు..

వీలుకుదిరినప్పుడల్లా విహారయాత్రలు

భర్త, కూతురుతో కలిసి ఉన్న ఫొటోలు వైరల్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మోనికా రజని.. భారత-పాక్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న పేరు. పాకిస్థాన్‌లోని కరాచీలో పుట్టిన ఈమె నగరంలోని గురునానక్‌ కాలనీకి చెందిన పవన్‌ బొడానిని 2016లో వివాహం చేసుకున్నారు. అయితే, ఇటీవలే ఆమె పుట్టినింటికి వెళ్లారు. ఆ తర్వాత ఉగ్రదాడి జరగటం, రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవటం, స్థానికేతరులు తిరిగి వెళ్లిపోవాలని రెండు దేశాలు ప్రకటించడంతో మోనిక పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె రాకపై ఉత్కంఠ నెలకొనగా, రెండు రోజుల కిందటే అమృతసర్‌కు చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. తన ఐదేళ్ల కుమార్తెతో క్షేమంగా చేరుకోవడంతో పాకిస్థాన్‌కు చెందిన బెజవాడ కోడలి టాపిక్‌ ఎక్కువగా నడుస్తోంది. జియా బొడానిగా పేరు మార్చుకున్న ఆమె భారతదేశ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. త్వరలో ఆమెకు భారత పౌరసత్వం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆమె పాకిస్థాన్‌ పౌరురాలిగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక వీసాను కలిగి ఉండటం వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం కుమార్తెతో కలిసి అమృతసర్‌లో ఉన్న ఆమె భర్త పవన్‌ బొడాని, అత్తమామలు కలిశారు. వీరంతా త్వరలో విజయవాడకు రానున్నారు. రెండు దేశాలపై ఎంతో మమకారంతో ఉండే రజనీ.. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో ఉన్న కియామరి ఫ్రెంచ్‌ బీచ్‌ను సందర్శించారు. సముద్రతీరంలో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఇండియాకు తిరిగొచ్చి రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో షరీఫ్‌ దర్గాను సందర్శించారు. అనాసాగర్‌ సరస్సును కూడా వీక్షించారు.

Updated Date - May 03 , 2025 | 12:56 AM