కబ్జా కోరల్లో బీసెంట్ రోడ్డు
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:40 AM
దశాబ్దాల కాలంగా వ స్త్ర వ్యాపారానికి కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్డు నేడు హాకర్ల ముసుగు వేసుకున్న కబ్జాదారుల చెరలో ఉంది.

రాజకీయ పార్టీల అనుచరుల పేరుతో ఆక్రమణలు
వ్యాపారాలు చేయకుండా అద్దెలకు ఇస్తున్న వైనం
ప్రజల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు
(ఆంధ్రజ్యోతి-గవర్నర్‌పేట): దశాబ్దాల కాలంగా వ స్త్ర వ్యాపారానికి కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్డు నేడు హాకర్ల ముసుగు వేసుకున్న కబ్జాదారుల చెరలో ఉంది. బందరు రోడ్డు రాఘవయ్య పార్కు హద్దుగా మొదలై ఏలూరు రోడ్డు ను కలిసే వరకూ రోడ్డును హాకర్ల ముసుగులో ఉన్న కబ్జాదారులు సొంతం చేసుకున్నారు. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీ నేతల అనుచరులు బీసెం ట్ రోడ్డులో ఆక్రమణలకు తెగబడటమే కాకుండా స్థలాలను మార్కింగ్ చేసి పేదలకు వ్యాపారాలు చేసుకోవడానికి అద్దెలకు ఇస్తున్నారు. కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లడానికి కూడా వీలులేకుండా బీసెంట్ రోడ్డు కబ్జాలకు గురైంది. కబ్జాదారుల ఆగడాలకు భయపడి స్థానిక వ్యాపారులు వలస పోయే పరిస్థితి దాపురించింది. స్థానిక వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు.
అధికారంతో పాటు ఆక్రమణదారులూ మారతారు
రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ ఇక్కడ ఆక్రమణదారులు మారిపోతూ ఉంటారు. కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులు పాత వారిని తొలగించి కొత్తవారికి స్థలాలు కేటాయిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో పాగాలు వేయిస్తున్నారు. కార్యకర్తలకు చిరు వ్యాపారుల ముసుగులు వేయిస్తున్నారు. పోలీసు లు, టౌన్‌ప్లానింగ్ సిబ్బంది అటువైపు చూడకుండా ఆర్డర్లు పాస్ చేస్తున్నారు. పోనీ ఆక్రమించిన పార్టీల కార్యకర్తలు వీధి వ్యాపారాలు చేస్తారా అంటే అదీ ఉండదు. హాకర్లను ఎంపిక చేసుకుని రోజువారీ అద్దెకు స్థలాన్ని లీజుకు ఇస్తున్నారు. వామపక్షాలు మొదలుకుని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ద్వితీయ శ్రేణినేతలు బీసెంట్ రోడ్డు మీద జీవనం సాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు మాజీ ప్రజాప్రతినిధి అనుచరుల కనుసన్నల్లో బీసెంట్ రోడ్డు వీధి వ్యాపారాలు సాగాయి. కూటమి అధికారంలోకి రావడంతో ప్రస్తుత ప్రజాప్రతినిధి అనుచరగణానికి బీసెంట్ రోడ్డు మీద కన్నుపడింది. లెనిన్ సెంటర్, బీసెంట్ రోడ్డును ఆక్రమించి హాకర్లకు అద్దెలకు ఇచ్చుకుని సంపాదించుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. దీని ఫలితంగానే బుధవారం బీసెంట్ రోడ్డులో హాకర్ల మధ్య వివాదాలు తలెత్తాయి. అధికార పార్టీ కార్యకర్తలు బీసెంట్ రోడ్డు లో వివిధ కూడలి ప్రాంతాల్లో తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీ, వామపక్షాలకు చెందిన కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా గొడవ సర్దుమణిగినప్పటికీ మళ్లీజరిగే అవ కాశముందని స్థానికవ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.