Share News

ప్రణమిల్లుతున్నాం

ABN , Publish Date - Jul 05 , 2025 | 12:46 AM

ఇప్పటివరకు తమకు సాగునీరందించి జీవన ప్రమాణాల పెరుగుదలకు కారణమైన వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకానికి ఆయకట్టు రైతులు చేతులెత్తి మొక్కారు. పలు గ్రామాల రైతులు శుక్రవారం ట్రాక్టర్లపై వచ్చి పథకం పరిస్థితిని పరిశీలించారు.

ప్రణమిల్లుతున్నాం
వేదాద్రి ఎత్తిపోతల పథకానికి చేతులెత్తి మొక్కుతున్న ఆయకట్టు రైతులు

వేదాద్రి, కంచల ఎత్తిపోతలకు ఆయకట్టు రైతుల నమస్కారాలు

ప్రభుత్వం ఆదుకుని సాగుకు అనుకూలంగా మార్చాలని వేడుకోలు

నందిగామ, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : ఇప్పటివరకు తమకు సాగునీరందించి జీవన ప్రమాణాల పెరుగుదలకు కారణమైన వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకానికి ఆయకట్టు రైతులు చేతులెత్తి మొక్కారు. పలు గ్రామాల రైతులు శుక్రవారం ట్రాక్టర్లపై వచ్చి పథకం పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వ సాయంతో ఈ పథకం ఈ ఏడాది నుంచైనా పనిచేయాలని కోరారు. చాలాకాలం తరువాత పథకంలోని మోటార్లను, ప్యానల్‌ బోర్డులను పరిశీలించిన అన్నదాతలు ఉద్వేగానికి గురయ్యారు. సాగునీటి పథకానికి మరమ్మతులు చేయుంచి ఆదుకోవాలని వారంతా ప్రభుత్వాన్ని కోరారు. మూడు రోజులుగా రైతులు వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాల పరిసరాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఏ క్షణంలో నిధులు విడుదలైనా పనులు ప్రారంభించేలా తీర్చిదిద్దుతున్నారు. ఐదేళ్లుగా నిలిచిపోయి ఉన్న ఈ పథకంలో నాలుగు మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒక మోటారుకు తాత్కాలిక మరమ్మతులు చేపడితే పనిచేసే అవకాశం ఉందని గతంలోని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే, విద్యుతను పునరుద్ధరించి సదరు మోటార్లను పరిక్షించాల్సి ఉంది. కనీసం ఒక మోటారు పనిచేసినా ఆయకట్టు రైతులు ధైర్యంగా సాగు ప్రారంభించుకోవచ్చు. కాగా, నిధులు ఇప్పించే స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు పథకం వైపు తిరిగి చూడకపోవడం తమను ఆవేదనకు గురిచేస్తోందని వారన్నారు. మూడు రోజుల క్రితం ఈ పథకం పరిశీలనకు వచ్చిన ఎన్‌ఎస్‌పీ, ఐడీసీ అధికారులు తిరిగి అటువైపు చూడలేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఈ పథకాన్ని సందర్శించి స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ డీసీ చైర్మన్‌ రాటకొండ చంద్రశేఖర్‌, కృష్ణామిల్క్‌ యూనియన్‌ డైరెక్టర్‌ నెలకుదిటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 12:46 AM