భక్తులకు భద్రతేదీ?
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:08 AM
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ భక్తులకు భద్రత కరువైంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయా నికి వచ్చే భక్తులపై స్థానికులు దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆలయం దగ్గర భక్తులపై వరుస దాడులు జరగటమే ఇందుకు నిదర్శనం. ఈ దాడులను అరికట్టేందుకు పోలీసులు, దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో భక్తులపై దాడులు
ఇష్టానుసారంగా పేట్రేగిపోతున్న కొందరు స్థానికులు
కోళ్లు డ్రెస్సింగ్ చేసేవారు, డప్పు కొట్టేవారితో ఇబ్బందులు
భక్తులు వద్దు వద్దంటున్నా వెంట పడి గొడవలు
దేవస్థాన సత్రాల్లో ఉండటానికి భయపడుతున్న భక్తులు
ప్రైవేట్ మామిడి తోటల్లోనూ అవే అరాచకాలు
అధికారులు తగు భద్రత కల్పించాలని వేడుకోలు
ఆంధ్రజ్యోతి, పెనుగంచిప్రోలు రూరల్ : కిందటి వారం ఒంగోలుకు చెందిన పదిమంది భక్తులు కుటుంబ సమేతంగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం వారంతా దేవస్థానం సత్రాల్లో గదులు అద్దెకు తీసుకుని వంటలు చేసుకున్నారు. తీరా భోజనాలు చేసే సమయంలో స్థానికులు కొందరు భోజనం పెట్టాలని అడగటంతో పెట్టారు. ఆ తర్వాత మరికొందరు వచ్చి భోజనాలు పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో భక్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో స్థానికులు దాడులకు తెగబడ్డారు. కర్రలతో ఇష్టానుసారంగా దాడి చేయటంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ‘దేవాలయానికి వచ్చాం. మాకు కేసులు వద్దంటూ..’ బాధితులు స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు.
గత నెలలో విజయవాడకు చెందిన ఒక య్యూటూబర్ ఆలయం వద్ద కారును వేగంగా నడిపాడు. అతడిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించకుండా దారుణంగా కొట్టారు. ప్రాణాలతో బయటపడ్డ బాధితుడు తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భక్తుల వెంట పడుతూ దాడులు
తిరుపతమ్మ దర్శనానికి వచ్చే భక్తులు మొదటగా పాలపొంగళ్లు చేసి ఆలయంలోకి వెళ్తారు. అలా వెళ్లే క్రమంలో వారి వద్దకు కోళ్లు డ్రెస్సింగ్ చేసేవారు, డప్పులు కొట్టేవారు భారీగా వస్తున్నారు. భక్తులు వద్దని వారించినా వారి వెంట పడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో భక్తులకు, వారికి వాగ్వాదం జరిగి, ఘర్షణలకు దారితీస్తోంది. మునేరు పక్కనే ఉన్న ప్రైవేట్ మామిడి తోటల్లో సైతం భక్తులపై నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. తోటల్లో పనిచేసే కార్మికులు, కూలీలు తరచూ భక్తులను మోసం చేస్తున్నారు. భక్తులు తెచ్చిన మేకలు, పొటేళ్లను వధించే క్రమంలో వారికి తెలియకుండా మాంసాన్ని తప్పిస్తున్నారు. ఈ విషయాన్ని నిలదీసిన భక్తులపై దాడులకు పాల్పడుతున్నారు.
సత్రాల్లో భయం భయం
సకల వసతులతో ఉన్న దేవస్థానం సత్రాల్లోకి శుక్ర, ఆదివారాల్లో భక్తులు వేలాదిగా వస్తారు. అక్కడే బంధుగణంతో విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలో అక్కడకు స్థానికులు యాచకుల మాదిరిగా వచ్చి భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆదమరిచి ఉన్న భక్తుల వస్తువులను అపహరిస్తున్నారు. ఈ సత్రాల్లో తక్కువ రుసుముకు గదులు, కల్యాణ మండపాలు అందుబాటులో ఉన్నా స్థానికుల ఇబ్బందులతో చాలామంది భక్తులు మునేరు పక్కనే ఉన్న ప్రైవేట్ తోటల్లోకి వెళ్లిపోతున్నారు.
హోంగార్డులు ఉన్నా స్థానికులకే వత్తాసు
ఆలయ భద్రతకు ప్రస్తుతం 15 మంది హోంగార్డులు సేవలందిస్తున్నారు. వీరు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఆలయం వద్ద ట్రాఫిక్ నిర్వహణ, గొడవలు జరగకుండా చూడాలి. ఆలయ భద్రతను పర్యవేక్షించాలి. గతంలో 30 మంది హోంగార్డులు ఉండేవారు. క్రమేణా వారి సంఖ్యను తగ్గించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారంతా స్థానికులే కావటంతో విధుల నిర్వహణలో నిర్లక్ష్య భావన, భక్తులపై స్థానికులు దాడులకు పాల్పడిన సందర్భాల్లో స్థానికులకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
భక్తుల భద్రతపై చర్యలు తీసుకుంటాం..
ఇటీవల కాలంలో భక్తులపై దాడుల విషయం నా దృష్టికి వచ్చింది. ఆలయానికి వచ్చే భక్తుల భద్రత విషయంలో పోలీసుల సహకారం తీసుకుని పటిష్ట చర్యలు తీసుకుంటాం.
- కిశోర్‌కుమార్, తిరుపతమ్మ దేవస్థానం ఈవో