ఏటీసీ టవర్ రెడీ
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:38 AM
విజయవాడ విమానాశ్రయంలో సరికొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, అనుబంధ కాంప్లెక్స్ పనులు పూర్తయ్యాయి. ఎయిర్‌పోర్టులో శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు అనుసంధానంగా ఈ టవర్, కాంప్లెక్స్ పనులను రూ.80 కోట్లతో చేపట్టారు.
విజయవాడ విమానాశ్రయంలో అత్యాధునికంగా నిర్మాణం
టెలి కమ్యూనికేషన్స్, ఎలక్ర్టికల్, టెక్నికల్ విభాగాలన్నీ ఇక్కడే
రూ.80 కోట్లతో పూర్తయిన టవర్, కాంప్లెక్స్ పనులు
ఇక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయటమే ఆలస్యం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ విమానాశ్రయంలో సరికొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, అనుబంధ కాంప్లెక్స్ పనులు పూర్తయ్యాయి. ఎయిర్‌పోర్టులో శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌కు అనుసంధానంగా ఈ టవర్, కాంప్లెక్స్ పనులను రూ.80 కోట్లతో చేపట్టారు. ఈ రెండూ యుద్ధప్రాతిపదికన పూర్తయ్యాయి. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ కూడా పూర్తయ్యాక వినియోగంలోకి తీసుకొస్తారు.
అత్యాధునికంగా...
అంతర్జాతీయ విమానాశ్రయాలకు అనుగుణంగా ఈ ఏటీసీ టవర్ అత్యాధునికంగా రూపుదిద్దుకుంది. పొడవు 25 మీటర్లు. విమానాల కదలికలను సమర్థవంతంగా నిర్వహించటంతో పాటు విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇది పనిచేస్తుంది. ఈ టవర్‌లో అధునాతన సాంకేతిక వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలు భూమిపైనా, ఆకాశంలో విమానాలతో నిరంతరం కమ్యూనికేషన్‌లో ఉంటాయి. దీనిలో ఇంకా సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడిప్పుడే పనులు చేపడుతున్నారు. విమమానాశ్రయ నూతన టెర్మినల్ బిల్డింగ్ పూర్తయ్యే నాటికి దీనిని పూర్తి చేస్తారు.
వేగవంతమైన వ్యవస్థలు
ఈ ఏటీసీ టవర్‌లో రాడార్ వ్యవస్థలు ఉంటాయి. రేడియో తరంగాలను ఉపయోగించి విమానం ఎక్కడ ఉంది, కచ్చితమైన స్థానం, వేగం, ఎత్తును ఇవి నిర్ణయిస్తాయి. ఆటోమేటిక్ డిపెండెంట్ సర్వెలైన్స్-బ్రాడ్‌కాస్ట్ (ఏడీఎస్-బీ) మరో ప్రధానమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా విమానం ఎక్కడ ఉందన్న విషయాన్ని ఉపగ్రహాల ద్వారా ప్రసారం చేస్తుంది. టవర్ దానిని గ్రహిస్తుంది. ఫ్లైట్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్స్ (ఎఫ్‌డీపీఎస్) అనేది ఇంకో ముఖ్యమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా విమాన మార్గం, చేరుకునే సమయాన్ని అంచనా వేయడం, వాతావరణం వంటి సమాచారాలను టవర్‌కు అందిస్తుంది. సర్ఫేస్ మూవ్‌మెంట్ రాడార్.. అనేది విమానం రన్‌వేపై ఉన్నపుడు ఇతర వాహనాల కదలికలను గుర్తిస్తుంది. దీంతో పాటు విమాన పైలెట్లతో నిరంతరం కమ్యూనికేషన్స్ చేసే వ్యవస్థ, రియల్‌టైమ్ వెదర్, రాడార్, శాటిలైట్ డేటాను అందించే వ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ ఏర్పాటు కావటానికి రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. టవర్ వెనుక ఉన్న కాంప్లెక్స్‌లో ఎలక్ర్టికల్, టెలి కమ్యూనికేషన్ విభాగాలు ఏర్పాటు చేస్తారు.