Share News

అసైన్డ్‌ బందీ... ఇంకెంతకాలం..!

ABN , Publish Date - May 21 , 2025 | 12:55 AM

పేదలకు అసైన్డ్‌ భూములను ఇళ్ల పట్టాలుగా ఇచ్చి దశాబ్దాలు దాటుతున్నా ఇంకా నిషేధిత భూముల జాబితా (22ఏ) చెర వీడలేదు. నిజమైన లబ్ధిదారులకు ఆటోమేటిక్‌గా ఆ భూములపై యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయని పీవోటీ చట్టం చెబుతున్నా.. ఆ హక్కులను కాలరాస్తూ ఇంకా నిషేధిత జాబితా (22ఏ) చెరలోనే ఉంచారు. ఈ విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించిన వారికి న్యాయం జరుగుతుండగా, మిగతా వారికి మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు.

అసైన్డ్‌ బందీ... ఇంకెంతకాలం..!

పీవోటీ నిబంధనులున్నా.. అమలు సున్నా..

జీవోలు విడుదలైనా పట్టించుకోని వైనం

కోర్టును ఆశ్రయించిన వారికే న్యాయం

40 ఏళ్లు దాటుతున్నా హక్కులు లేక దైన్యం

ఉమ్మడి కృష్ణాలో 1.25 లక్షల మంది

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1.25 లక్షల నివేశనా స్థలాలు ఇచ్చినట్టుగా రికార్డులను బట్టి తెలుస్తోంది. వీటిలో చేతులు మారని ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 50 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, నాటి ప్రభుత్వాల హయాంలో పేదలకు దఫదఫాలుగా ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ స్థలాల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అర్బన్‌ ప్రాంతాల్లో లే అవుట్లు వేసి పేదలకు స్థలాలిచ్చారు. ఈ లే అవుట్లు కాలక్రమంలో కాలనీలుగా మారాయి. దశాబ్దాలు గడిచిపోతున్నా ఇవన్నీ నిషేధిత భూముల జాబితాలోనే ఉన్నాయి. తమ ఆర్థిక అవసరాల కోసం కొందరు లబ్ధిదారులు అమ్ముకున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1.25 లక్షల మందికి అసైన్డ్‌ పట్టాలు ఇస్తే, వాటిలో 75 వేలకు పైగా నివేశనా స్థలాలు చేతులు మారాయన్నది ఓ అంచనా. కేవలం 50 వేల స్థలాలే అసలైన లబ్ధిదారులు, వారి వారసుల చేతుల్లో ఉన్నాయి. పదేళ్లు దాటితే హక్కుదారులు అయిపోతారని పాత జీవోలు చెబుతున్నాయి. కానీ, ఏవీ అమల్లోకి రావట్లేదు. ఇది జరగాలంటే నిషేధిత భూముల జాబితా 22ఏ నుంచి తొలగించాలి.

ఇలా చేస్తే బెటర్‌

నిషేధిత భూముల నుంచి తొలగించటం వల్ల లబ్ధిదారులు తమ ప్లాట్లను కుటుంబ సభ్యుల పేరుతో గిఫ్డ్‌ డీడ్‌లు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. స్థలాలకు రిజిస్ర్టేషన్‌ జరుగుతుంది. ఫలితంగా లబ్ధిదారులు బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని ఆర్థిక అవసరాలు తీర్చుకునే అవకాశం కలుగుతుంది.

కోర్టును ఆశ్రయించే వారికే న్యాయం

ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌ యాక్ట్‌ (పీవోటీ) చట్టంలోని సెక్షన్‌-6 ప్రకారం.. అసైన్డ్‌ ల్యాండ్‌లో పదేళ్లు ఇంటిని నిర్మించుకుని నివసిస్తే ఆటోమే టిక్‌గా ఆ లబ్ధిదారుడికి పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. కానీ, మినహాయింపులు అమలు కాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో కొందరు అప్పులు చేసి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అలా ఆశ్రయించిన వారికి న్యాయం జరుగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందల సంఖ్యలో లబ్ధిదారులు న్యాయస్థానాల్లో టైటిల్‌ డిక్లరేషన్‌ సూట్స్‌ను ఫైల్‌ చేస్తున్నారు. ఇలా ఫైల్‌ చేసిన వారికి మాత్రం కోర్టు ఆదేశాలతో నిషేధిత భూముల నుంచి తొలగిస్తున్నారు. మిగిలిన వారికి మాత్రం అన్యాయం చేస్తున్నారు. నాటి ప్రభుత్వాలు ఇచ్చిన నివేశనా స్థలాలకు నేడు మార్కెట్‌ రేటు గణనీయంగా పెరిగింది. అయినప్పటికీ పిల్లల ఉన్నత విద్య, పెళ్లిళ్లు వంటి వాటికి బ్యాంకుల్లో తనఖా పెట్టుకునే అవకాశం కూడా లేకుండాపోతోంది. నిషేధిత భూముల్లో ఉండటం వల్ల బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదు.

Updated Date - May 21 , 2025 | 12:55 AM