Share News

బదిలీ బేరాలు

ABN , Publish Date - Jun 13 , 2025 | 01:00 AM

మచిలీపట్నంలోని డీపీవో కార్యాలయ అధికారులకు ఉద్యోగుల బదిలీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొందరు ఉద్యోగులు దళారీల అవతారమెత్తి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అనధికారికంగా పెత్తనం చెలాయించే కొందరు పంచాయతీ కార్యదర్శులు తమదైనశైలిలో చక్రంతిప్పి నగదు వసూళ్లకు పాల్పడటంపై పంచాయతీరాజ్‌ విభాగంలో చర్చ జరుగుతోంది.

బదిలీ బేరాలు

పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో ఇష్టారాజ్యం

చక్రం తిప్పిన పంచాయతీ కార్యదర్శులు, డీపీవో కార్యాలయ సిబ్బంది

ఐదేళ్లు దాటినా నగదు ఇస్తే సొంత మండలంలోనే పోస్టింగ్‌

కార్యాలయంలోనే అక్రమాలకు తెరలేపి బేరసారాలు

మామూళ్లు ముట్టడంతో వంత పాడుతున్న ఉన్నతాధికారులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మచిలీపట్నం సౌత మండలంలోని మేజర్‌ పంచాయతీలో పనిచేస్తున్న సీనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఒకరు ఉద్యోగుల బదిలీల నోటిఫికేషన్‌ వెలువడగానే, తన పంచాయతీకి వెళ్లకుండా, డీపీవో కార్యాలయంలోనే తిష్ట వేశాడు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు డీపీవో కార్యాలయానికి వచ్చిన వారితో మాటలు కలిపాడు. తనకు డీపీవోతో పాటు కార్యాలయంలో పనిచేసే అధికారులంతా తె లుసని, తాను చెప్పినట్టుగా వింటారని నమ్మించాడు. వారి ఎదుటే అధికారులతో మాట్లాడటం, ఇతర పనులు చేస్తూ హడావిడి చేశాడు. బదిలీల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఉద్యోగులకు వల వేశాడు. కోరుకున్న పంచాయతీకి బదిలీ చేయిస్తానని నమ్మబలికాడు. డీపీవో కార్యాలయ అధికారులు కూడా ఈ కార్యదర్శి చెప్పిన పనులు చేస్తుండటంతో తెరవెనుక బేరాలు కుదుర్చుకున్నాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలను సైతం పక్కనపెట్టించి, మీరు కోరుకున్న పంచాయతీకి బదిలీ చేయిస్తానని నమ్మించి, ఒక్కో పంచాయతీ కార్యదర్శి నుంచి పెద్దమొత్తంలో నగదు వసూలు చేశాడు. ఈ కార్యదర్శికి మరికొందరు వంత పాడారు. ఈ పంచాయతీ కార్యదర్శి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని కొందరు పంచాయతీ కార్యదర్శులు డీపీవో అధికారులకు ఫిర్యాదుచేసినా వారు పట్టించుకోలేదు. ఈ కార్యదర్శి, ఆయనకు మద్దతుగా ఉన్న కార్యదర్శుల సూచనల మేరకు డీపీవో కార్యాలయ అధికారులు బదిలీల జాబితాలను తయారుచేశారు. ఈ జాబితాలను కలెక్టర్‌కు పంపి ఆమోదింపజేసుకున్నారు.

గందరగోళంగా..

ఇటీవల జరిగిన బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో 35 మంది గ్రేడ్‌-1 సెక్రటరీలను, 11 మంది గ్రేడ్‌-2 సెక్రటరీలను, ఏడుగురు గ్రేడ్‌-3 సెక్రటరీలను, 46 మంది గ్రేడ్‌-4 సెక్రటరీలను.. మొత్తంగా 99 మందిని బదిలీ చేశారు. ఐదేళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న సెక్రటరీలను కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉండగా, కొందరికి మినహాయింపు ఇవ్వడం గమనించదగ్గ అంశం. ఐదేళ్లుగా ఒకే పంచాయతీలో పనిచే సిన వారిని సొంత మండలానికి బదిలీ చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మరీ బదిలీలు జరిపారు. ఉదాహరణకు.. మచిలీపట్నం మండలం పోలాటితిప్ప పంచాయతీ సెక్ర టరీ అసలు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోకున్నా బదిలీ చేశారు. బదిలీ ప్రాంతం చెప్పకుండా అలాగే ఉంచారు. పొట్లపాలెం పంచాయతీ సెక్రటరీని పోలాటితిప్ప పంచాయతీకి బదిలీ చేశారు. ఈ విషయంపై పోలాటితిప్ప సెక్రటరీ అధికారులను ఆశ్రయించగా, వేరే పంచాయతీకి బదిలీచేసే అంశాన్ని మరిచిపోయామని, దరఖాస్తు చేసుకుంటే ఏదో ఒక పంచాయతీకి పంపిస్తామని చెప్పడం గమనార్హం. పొట్లపాలెం పంచాయతీలో ఐదేళ్లుగా పనిచేస్తున్న కార్యదర్శిని వేరే మండలానికి బదిలీ చేయాల్సి ఉండగా, ఏవేవో కారణాలు చేసి అదే మండలంలోని వేరే పంచాయతీకి బదిలీ చేశారు. మచిలీపట్నం మండలం చినకరగ్రహారం పంచాయతీలో ఐదేళ్లుగా పనిచేస్తున్న సెక్రటరీని గరాలదిబ్బ పంచాయతీకి బదిలీ చేశారు. ఈ సెక్రటరీని ప్రస్తుతం జరిగిన బదిలీలో వేరే మండలానికి బదిలీ చేయాల్సి ఉన్నా నిబంధనలు పాటించలేదు.

అధికారుల తీరుపై విమర్శలు

డీపీవో కార్యాలయంలో పనిచేసే అధికారులు తమకు అనుకూలమైన ఉద్యోగులతో ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారని పంచాయతీ కార్యదర్శులు చెప్పుకొంటున్నారు. అధికారులు పంచాయతీల పరిశీలన కోసం వస్తే.. పెద్ద పంచాయతీల్లో పనిచేసే కార్యదర్శులకు ముందే ఈ ముఠా సమాచారం చేరవేసి, ఇంత నగదు ఇచ్చి పంపాలని చెబుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. డీపీవో కార్యాలయంలో అన్ని పనులు తానే చూస్తున్నట్టుగా హంగామా చేసే ఉద్యోగి ఒకరు, ఓ అడుగు ముందుకేసి అధికారుల పేరుచెప్పి పంచాయతీ కార్యదర్శుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని బాహాటంగానే చెప్పుకొంటున్నారు. మచిలీపట్నం సౌత మండలంలోని పెద్ద పంచాయతీలో పనిచేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతున్న ఈ పంచాయతీ కార్యదర్శి పనితీరుపై విచారణ జరపాలని గ్రామస్తులు గత సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 13 , 2025 | 01:00 AM