Share News

‘యాప్‌’రే..!

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:59 AM

రూ.లక్షల్లో బెట్టింగ్‌లు కడతారు.. అంతకు రెట్టింపు సంఖ్యలో గెలుస్తారు.. కొందరేమో ఓడిపోతారు.. అయినా ఎవరి జేబులోనూ రూపాయి కనిపించదు. క్రికెట్‌ బెట్టింగ్‌ కేసుల్లో పోలీసులకు ఈ అంశం సవాల్‌గా మారింది. సాంకేతికతను చక్కగా ఉపయోగించుకుంటున్న బెట్టింగ్‌బాబులు ఎక్కడికక్కడ నగదు రూపంలో కనిపించకుండా, యాప్‌ల రూపంలో లావాదేవీలు నిర్వహిస్తుండటంతో ఆ మూలాలు పసిగట్టే పనిలో పోలీసులు తలమునకలయ్యారు.

‘యాప్‌’రే..!

బెట్టింగ్‌ కేసుల్లో పోలీసులకు సవాల్‌గా యాప్‌లు

టెక్నాలజీతో మభ్య పెడుతున్న బెట్టింగ్‌బాబులు

చేతిలో డబ్బు కనిపించకుండా పందేలు

కీలకమైన యాప్‌ల సృష్టి.. వాటిద్వారా లావాదేవీలు

మూలాలు వెతికే పనిలో పోలీసులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పోలీసుల వేట ఎక్కువయ్యే సరికి క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌లు రూటు మార్చాయి. పోలీసులకు చిక్కినా చిల్లిగవ్వ దొరక్కుండా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఇదే ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు చట్టాలు, సెక్షన్ల కోసం పుస్తకాలను తిరగేసిన పోలీసులు ఈ బెట్టింగ్‌ కేసులతో సైబర్‌ ఫోరెన్సిక్‌ పుస్తకాలను పట్టుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుట్టురట్టు చేసిన బుకీలు, ప్లంట్లర్లను సంబంధిత పోలీస్‌స్టేషన్లలో అప్పగిస్తున్నారు.

సాంకేతిక మూలాలు ఎక్కడ?

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తాజాగా ఎనిమిది మంది బెట్టింగ్‌బాబులను అరెస్టు చేసి పటమట పోలీసులకు అప్పగించారు. వీరంతా రాధే ఎక్సేంజ్‌ యాప్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్టు తేలింది. ఇటీవల అవనిగడ్డకు చెందిన ఐదుగురిని అరెస్టు చేయగా, వారంతా పార్కర్‌ ఎక్సేంజ్‌ యాప్‌లో పందేలు కడుతున్నట్టు గుర్తించారు. ఇలా బెట్టింగ్‌లు నిర్వహించే ప్రధాన బుకీలు ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేయించుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇలా ఒక్కో బుకీ సొంత యాప్‌ల ద్వారా క్రికెట్‌పై లక్షలాది రూపాయలను వెనుకేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పోలీసులకు బుకీల్లో మూడు, నాలుగు దశల్లో ఉన్నవారే దొరుకుతున్నారు. వారికి డబ్బు వసూలు చేసి ఇచ్చే ఏజెంట్లు చిక్కుతున్నారు. ప్రధాన బుకీలు మాత్రం చిక్కడం లేదు. ఏ యాప్‌ ద్వారా పందేలు జరుగుతున్నాయో తేలినా వాటికి సంబంధించిన సాంకేతిక మూలాలు దొరకడం పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది. అయినా వాటి గురించి తెలుసుకుంటున్నారు.

కమీషన్‌ రూపంలో వసూలు

ప్రధాన బుకీలు ఎక్కడ ఉంటారో తెలియదు. వారి కింద మాత్రం దశలవారీగా సబ్‌బుకీలు ఉంటారు. ఈ సబ్‌బుకీల దిగువన ప్లంటర్లు పనిచేస్తున్నారు. బెట్టింగ్‌లో పాల్గొన్నవారు ఎంత ఇవ్వాలి, గెలిచిన వారికి ఎంత చెల్లించాలి.. అనే లెక్కలు మొత్తం యాప్‌ల్లో ఉంటున్నాయి. ఓడిన వారి నుంచి డబ్బు వసూలు చేసే బాధ్యతలను ప్లంటర్లు తీసుకుంటున్నారు. ఆటగాళ్ల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి సబ్‌బుకీలకు ఇచ్చిన వారికి లక్షకు రూ.1,000 కమీషన్‌ చెల్లిస్తున్నారు. ఆటగాళ్లందరి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేసి అప్పగించిన వారికి లక్షకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు. ఈ డబ్బును వెంటవెంటనే ఖాతాల్లో జమ చేసుకుని ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

విదేశాల్లో కాకినాడ బుకీ?

గన్నవరంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిది మంది సబ్‌బుకీలకు యాప్‌లో ప్రవేశాలకు అనుమతి ఇచ్చిన కాకినాడకు చెందిన ప్రధాన బుకీ పండును పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. విదేశాల్లో ఉంటూ బెట్టింగ్‌ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడని సమాచారం. ఈ పండునే.. రాధే ఎక్సేంజ్‌ యాప్‌ ద్వారా బెట్టింగ్‌ నడుపుతున్నాడు. ఈ యాప్‌కు అనుసంధానమైన కొంతమందిని వరంగల్‌ పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది. ఆ దెబ్బకు పండు విదేశాలకు చెక్కేశాడని అనుమానిస్తున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:59 AM