Share News

జెట్‌ వేగం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:48 AM

జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీ లో ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ బ్యాలెన్స్‌ పనులు పూర్తి చేయటానికి వీలుగా ఏపీఐఐసీ కీలక అడుగు వేసింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ కాంప్లెక్స్‌ను పూర్తి చేసేందుకు రూ.19.55 కోట్లతో టెండర్లు పిలిచింది.

జెట్‌ వేగం
జెట్‌సిటీలో అసంపూర్తిగా ఉన్న మొదటి ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ టవర్‌

ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ పూర్తికి ఏపీఐఐసీ టెండర్లు

రూ.19.55 కోట్లతో ఆరు నెలల్లో పూర్తిచేయాలని గడువు

వైసీపీ ప్రభుత్వ హయాంలో జెట్‌సిటీ విధ్వంసం

కూటమి వచ్చాక అభివృద్ధికి తొలి అడుగులు

కాంప్లెక్స్‌ పూర్తయితే అన్ని వర్గాలకూ ఒకేచోట పని

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వాక్‌ టు వర్క్‌ విధానంలో జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌) సిటీ మెగా టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిని ప్రకటించారు. ఆ వెంటనే ఇది ఏర్పాటైంది. జెట్‌సిటీని ఏపీ అర్బన్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఎంఎల్‌) శాఖ పరిధిలో చేపట్టేందుకు అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి ప్రజా రాజధాని అయితే జెట్‌సిటీని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని నాటి టీడీపీ ప్రభుత్వం భావించింది. దీంతో విజయవాడ శివారున జక్కంపూడి, వేమవరం, షాబాద గ్రామాల చుట్టూ వ్యాపించి ఉన్న కొండ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ దాదాపు 300 ఎకరాల వరకు ఉంది. ఈ ప్రాంతంలో ముందుగా కొండల చుట్టూ పేద, మధ్య, ధనిక వర్గాలందరినీ దృష్టిలో ఉంచుకుని బహుళ అంతస్థుల భవనాలను నిర్మించాలని నిర్ణయించారు.

వైసీపీ హయాంలో చతికిలపడి..

పేద, మధ్య త రగతి వర్గాల కోసం 50 వేల ఇళ్ల నిర్మాణం తలపెట్టాలని నిర్ణయించి డీపీఆర్‌ తయారుచేసి కేంద్రానికి పంపారు. కేంద్రం ఆమోదం తర్వాత పీఎంఏవై కాంపోనెంట్‌ వాటా కూడా ఈ ఇళ్లకు తోడైంది. యుద్ధప్రాతిపదికన టిడ్కో ద్వారా కొండ ప్రాంతం చుట్టూ 15 వేల ఇళ్ల నిర్మాణాన్ని తలపెట్టేందుకు టెండర్లు పిలిచింది. ఎన్‌సీసీ అనే సంస్థ ఈ పనులు దక్కించుకుంది. ముందుగా 10 వేల ఇళ్లకు టెండర్లు పిలవగా, 7 వేలలోపు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 70 శాతం మేర పూర్తయ్యాయి. ఇదే సందర్భంలో ఇక్కడ నివసించే ప్రజలంతా స్థానికంగానే పనిచేసుకోవటానికి వీలుగా నాలుగు ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ టవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణ బాధ్యతలను అప్పట్లో విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. రూ.147 కోట్లతో మొదటి ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు పనులు చేపట్టారు. దాదాపు టవర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం పూర్తయింది. గోడలు, ఇంటీరియర్‌, ప్లంబింగ్‌, ఎలక్ర్టికల్‌, పెయింటింగ్‌ వంటి పనులు మిగిలాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.

కూటమి వచ్చాక పునరుజ్జీవం

కూటమి ప్రభుత్వం వచ్చాక.. జెట్‌సిటీలోని బ్యాలెన్స్‌ ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో పాటు అసంపూర్తిగా ఉన్న మొదటి ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ టవర్‌ పనులను కూడా పూర్తి చేయించేందుకు వీలుగా ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఏపీఐఐసీ మొదటి టవర్‌ పనుల పూర్తికి టెండర్లు పిలిచింది. కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఇచ్చారు. ఈ ఆరు నెలల్లో మొదటి టవర్‌ పూర్తయితే వరుసగా రెండు, మూడు, నాలుగు టవర్లను ప్రణాళికగా పూర్తి చేయనున్నారు. ఈ టవర్లను కూడా వేర్వేరు పారిశ్రామిక సంస్థలకు కేటాయిస్తారు. దీంతో పేదలకు అందుబాటులోనే పనులు దొరుకుతాయి. ఈ ప్రాంతం కొత్తగా విస్తరిస్తుంది. జెట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా ఆ తర్వాత దశలో ధనిక వర్గాలకు గృహ నిర్మాణం, వారు వ్యాపారులు చేసుకోవటానికి వీలుగా కాంప్లెక్స్‌ టవర్లు, రోడ్ల నిర్మాణం, ఉద్యానవనాలు ఇలా అనేక ప్రణాళికలు ఉన్నాయి. మొదటి ఫ్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ పనులతో మళ్లీ జెట్‌సిటీకి కదలిక వచ్చింది.

Updated Date - Sep 18 , 2025 | 12:48 AM