ఎన్నాళ్లీ నిషేధం
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:06 AM
నిషేధిత భూముల మోక్షం కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో వందలాది మంది ఎదురుచూస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న 22ఏ సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐఏఎస్‌లతో నియమించే కమిటీలో సీనియర్ తహసీల్దార్లను కూడా భాగస్వామ్యం చేయాలని కోరుతున్నారు.
నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి చొరవ ఏదీ?
ఏళ్ల తరబడి బాధితుల ఎదురుచూపులు
క్షేత్రస్థాయిలో 22ఏ ఆధారిత సమస్యలు అనేకం
ఐఏఎస్‌లతో కూడిన కమిటీతో కొన్ని ఇబ్బందులు
తహసీల్దార్లనూ భాగస్వామ్యం చేయాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిషేధిత భూములకు (22ఏ) సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఏళ్ల తరబడి లబ్ధిదారులు ఎదురుచూస్తూనే ఉన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవడానికి ఐఏఎస్ అధికారులతో పాటు సీనియర్ తహసీల్దార్లతో కమిటీని నియమించాల్సిన అవసరం ఉంది. తహసీల్దార్ల సిఫార్సుల మేరకు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించగలిగితేనే పరిష్కారం లభిస్తుంది.
ఎందుకు పరిష్కారం కావట్లేదు?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనాధీన భూములను స్వాత ంత్య్ర సమరయోధులకు పట్టాలుగా ఇచ్చారు. 1953లో అప్పటి కలెక్టర్ పట్టాలు ఇస్తున్నట్టుగా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. తర్వాత క్రమంలో ఈ భూములు చేతులు మారాయి. స్వాతంత్య్ర సమరయోధుల వార సులకు రిజిస్ర్టేషన్ కూడా చేశారు. ఇప్పుడివి నిషేధిత భూముల్లో ఉన్నాయి. ఈ తరహా 22ఏ జాబితా పరిష్కారానికి సంబంధించి ఐఏఎస్ అధికారుల ఆలోచన ఏ విధంగా ఉందంటే.. అనాధీన, అసైన్డ్ భూముల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇచ్చిందా? ఆ జీవోలో వారు ఉన్నారా? 1950 నుంచి అనుభవంలోనే ఉన్నాడా? ఎఫ్‌ఎంబీ ఉందా? ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉందా? ఒరిజినల్ పట్టా ఉందా? దానికి సంబంధించి రికార్డు ఉందా? ఎన్ని రకాల మార్పులు జరిగాయి? వంటి వివరాలు అడుగుతున్నారు. 1983 అనంతరం తాలూకా వ్యవస్థ పోయి మండల వ్యవస్థ వచ్చిన క్రమంలో ఇలాంటి అనాధీన భూములకు సంబంధించిన రికార్డులు వరదలు, విపత్తుల్లో పోయాయి. రికార్డులు, జీవోలు లేకపోతే లబ్ధిదారులు కాకుండాపోతారా? అప్పట్లో కలెక్టర్లు ఇచ్చిన ప్రొసీడింగ్ లేఖలు ఇప్పటికీ ఉన్నాయి. ఇలాంటి అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తేనే అర్హులైన వారికి నూరుశాతం న్యాయం జరుగుతుంది. అనాధీన భూములే కాకుండా అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలుగా ఇచ్చిన వాటి సమస్య కూడా దాదాపు ఇలాగే ఉంది. వీటి పరిష్కారానికీ ప్రభుత్వం చొరవ చూపించాలి.
లేని రికార్డులు ఎక్కడి నుంచి తెస్తాం..
బ్రిటీషు వారి నుంచి వచ్చిన రికార్డులు ఆ తర్వాత క్రమంలో అందుబాటులో లేకుండాపోయాయి. 75 ఏళ్లకు సంబంధించిన రికార్డులు ఇప్పుడు ఏ కార్యాలయంలోనూ పూర్తిస్థాయిలో లేవు. 1983 తర్వాత తాలూకాల నుంచి మండల వ్యవస్థలు ఏర్పడిన క్రమంలో రికార్డుల బదిలీ సక్రమంగా జరగలేదు. దీంతో గతంలో ప్రభుత్వ భూములను పేదలకు కేటాయించిన రికార్డులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ప్రభుత్వం జీవోలు ఇవ్వకపోయినా.. అప్పట్లో ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతో పట్టాలుగా ఇచ్చినవి ఉన్నాయి. అలాగే, రికార్డులను భద్రంగా ఉంచడానికి అప్పట్లో రికార్డు రూమ్ అసిస్టెంట్లు ఉండేవారు. ఇప్పుడు చాలాచోట్ల రికార్డు అసిస్టెంట్లే లేరు. ఇలాంటపుడు రికార్డులు ఎలా భద్రంగా ఉంటాయి? లబ్ధిదారులు 40 ఏళ్లకు పైగా ఉంటున్నా కూడా హక్కుదారులు కాదంటే చట్టం కూడా ఒప్పుకొనే పరిస్థితి లేదు. వారికి యాజమాన్య హక్కులు కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఇప్పటికైనా లబ్ధిదారుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా ఈ సమస్యకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.