Share News

మరో గండం

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:50 AM

భారీ వర్షాలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పంట పొలాలు చాలావరకు నీటమునగగా, వరిపైరు నేలవాలింది. వారంలో కోతకు వస్తుందనగా, ఈ దుస్థితి ఏర్పడటంతో తల్లడిల్లిపోతున్న రైతుల నెత్తిన మరో పిడుగు పడింది. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడటంతో ఈనెల 26 నుంచి 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆవేదన చెందుతున్నారు.

మరో గండం
కోనేరులా కోనేరు సెంటర్‌

జిల్లా రైతులను భయపెడుతున్న మరో వాయుగుండం

ఈ నెల 26, 27, 28 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ

నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతోనే తీవ్రనష్టం

నేలవాలుతున్న వరి, కూరగాయల తోటల్లో నిలబడిన నీరు

వరికి బ్యాక్టీరియల్‌ లీప్‌ బ్లైట్‌, మానుగాయ తెగుళ్ల బెడద

ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతుల ఆవేదన

ఆంధ్ర జ్యోతి-మచిలీపట్నం : వర్షం ఇప్పట్లో జిల్లాను వీడే సూచనలు కనిపించట్లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్టుగా బంగాళాఖాతంలో తాజాగా శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది. శనివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని, 26వ తేదీ నాటికి తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు కోస్తాతీరానికి ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. కొద్దిరోజుల్లో వరికోతలు ప్రారంభం కానుండగా, ఈ తరుణంలో భారీ వర్షాల కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయోనని భయపడుతున్నారు.

వరికి తెగుళ్ల బెడద

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.60 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. 70 శాతం మేర వరిపైరు ఈత, కంకులు పాలుపోసుకునే దశలో ఉంది. వారంలో కోతకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో నాలుగైదు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో పైరు నిత్యం తడుస్తూనే ఉంది. వరి ఈనిన తరువాత, కంకులు పాలుపోసుకునే దశలో వర్షం కురిస్తే గింజలు పగిలిపోయి, వాటిలోకి నీరుచేరి తాలు, తప్పలు (సందుతప్పలు) కొంతమేర ఏర్పడతాయని రైతులు చెబుతున్నారు. గాలులు వీస్తే కంకుల సుంకు రాలిపోతుందని, దీంతో గింజలు పాలు పోసుకోవని రైతులు అంటున్నారు. దీంతోపాటు వర్షాలు ఎక్కువ రోజులు పడుతుండటంతో వరికంకులు పాలుపోసుకునే దశలో రబ్బీసు తెగులు (బ్యాక్టీరియల్‌ లీప్‌ బ్లైట్‌) వ్యాపిస్తుందని, ప్రస్తుతం కంకిపాడు, తదితర మండలాల్లో ఈ తెగులు కనిపిస్తోందని చెబుతున్నారు. దీని నివారణకు మందులు లేవని, ఒకపొలంలో నుంచి నీరు మరో పొలంలోకి వెళ్తే దానిద్వారా ఈ తెగులు వ్యాపిస్తుందంటున్నారు. వరికంకులు పాలుపోసుకునే దశలో, గింజలు గట్టిపడే దశలో గంటల తరబడి వర్షం కురుస్తుండ టంతో కంకులపై నీరు నిలబడి గింజలకు మానుగాయ తెగులు వ్యాపించే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటున్నారు. ముతకరకాలైన ఎంటీయూ-1061కు మానుగాయ ఏర్పడుతుందని, ఈ ఏడాది వరిపైరు ఎత్తుగా పెరగడంతో వర్షాలు, గాలుల కారణంగా ఈతదశలోనే నేలవాలిపోతోందని, అలా అధిక రోజులు నీటిలోనే ఉంటే పైరు, కంకులు పాచిపోయి కుళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటున్నారు. మెట్టప్రాంతాల్లో సాగుచేసిన మినుము పైరు పూతదశతో పాటు వివిధ దశల్లో ఉందని, అధిక రోజులు వర్షంలో తడవడం, పొలంలో నీరు నిలబడి ఉండటం వల్ల చనిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.

జిల్లాలో వర్షపాతం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు గూడూరులో అత్యధికంగా 89.2 మిల్లీమీటర్లు, నాగాయలంకలో అత్యల్పంగా 19.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, సగటు 46.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. శుక్రవారం రాత్రి సమయంలోనూ మచిలీపట్నం, మోపిదేవి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మచిలీపట్నంలో ప్రధాన రహదారులపైకి నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చల్లపల్లిలో 86.4 మిల్లీమీటర్లు, పమిడిముక్కలలో 71.6, ఘంటసాలలో 68.2, పెడనలో 64.0, మచిలీపట్నంలో 58.6, మొవ్వలో 56.0, గుడ్లవల్లేరులో 55.6, ఉయ్యూరులో 51.2, ఉంగుటూరులో 44.4, కంకిపాడులో 42.8, పెదపారుపూడిలో 42.6, మోపిదేవిలో 41.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ప్రమాదకరంగా కూరగాయల తోటలు

జిల్లాలోని మోపిదేవి, తోట్లవల్లూరు, చల్లపల్లి, ఘంటసాల, పెనమలూరు, ఉయ్యూరు తదితర మండలాల్లో కూరగాయల తోటలున్నాయి. మోపిదేవి మండలం నాగాయతిప్ప, మోపిదేవిలంక, కొక్కిలిగడ్డ తదితర గ్రామాల్లో 20 రోజుల క్రితం టమోటా, మిర్చి మొక్కలు నాటారు. తోటల్లో భారీవర్షాల కారణంగా నీరు నిలబడి ఉండటంతో మొక్కలు చనిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు తోటల్లోనూ నీరు నిలబడి ఉండటంతోమొక్కలు చనిపోతున్నాయని, వర్షం మరింత కురిస్తే పసుపు మొక్కలు చనిపోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:50 AM