టెండర్ల మాయా‘జలం’
ABN , Publish Date - May 22 , 2025 | 12:57 AM
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో టెండర్ల మాయాజాలం నడుస్తోంది. రెండు జిల్లాల్లో నాలుగు మంచినీటి పంపింగ్ స్టేషన్లకు సంబంధించిన ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ (ఓఅండ్‌ఎం) టెండర్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడువు తీరినా పాత కాంట్రాక్టరే వీటి నిర్వహణ చేపడుతుండటం, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక కూడా కొత్త కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడం వెనుక పెద్ద కథే నడిచిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మరో మాయ
రెండు జిల్లాల్లో నాలుగు పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు టెండర్లు
తాత్కాలిక కాలానికి జనవరిలో ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం
అయినా పాత కాంట్రాక్టర్‌తోనే పనుల కొనసాగింపు
కొత్త కాంట్రాక్టర్ టెండర్‌ను ఎక్కువకు కోట్ చేయడమే కారణం
ఐదు నెలల కాలానికి రూ.50 లక్షల వరకు దండుకునే యత్నం
కాంట్రాక్టర్లతో ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల మిలాఖత
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్)లో ఉన్నతాధికారుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే అనేక టెండర్ల వ్యవహారాలు వివాదాలమయం కాగా, తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో పిలిచిన ఓఅండ్‌ఎం మంచినీటి పంపింగ్ స్టేషన్ల టెండర్లను కూడా అపహాస్యం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో చిల్లకల్లు, గౌరవరం, లింగాల ఓఅండ్‌ఎం స్కీమ్‌లకు, కృష్ణాజిల్లాలో మొవ్వ ఓఅండ్‌ఎం పంపింగ్ స్టేషన్లకు కొద్దినెలల కిందట టెండర్లు పిలిచారు. నీటిని శుద్ధిచేసి గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థను ఓఅండ్‌ఎం పంపింగ్ స్టేషన్లు అంటారు. ప్రజారోగ్యంలో కీలకపాత్ర పోషించే ఈ స్టేషన్ల నిర్వహణ టెండర్ల విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనివెనుక భారీ ఎత్తున ముడుపుల పర్వం నడిచిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
పాత కాంట్రాక్టర్‌తోనే పనులు
వాస్తవానికి ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఏడాది కాలానికి టెండర్లు పిలుస్తారు. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 నాటికి అన్నమాట. జడ్పీ అఽధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో శాంక్షన్లు రావు. ఈ కాలాతీతాన్ని బట్టి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాత్కాలికంగా టెండర్లు పిలుస్తుంటారు. ఈ కోవలోనే తాత్కాలిక కాలానికి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో 3, కృష్ణాజిల్లాలో 1 ఓఅండ్‌ఎం పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు టెండర్లు పిలిచారు. ఈ నాలుగు పంపింగ్ స్టేషన్ల టెండర్లను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. జనవరి 18న అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఆరోజు నుంచే కాంట్రాక్టర్ పనిచేయాల్సి ఉంటుంది. కానీ, నాలుగు నెలలు గడిచి, ఐదో నెలలోకి ప్రవేశించినా కొత్త కాంట్రాక్టర్ వాటిని స్వాధీనం చేసుకుని నిర్వహించలేదు. పాత కాంట్రాక్టరే ఇప్పటికీ వాటిని నిర్వహిస్తున్నాడు. దీనివెనుక పెద్ద కథే నడిచింది. పాత కాంట్రాక్టర్ గతంలో 5 శాతం ఎక్కువకు కోట్ చేశాడు. కొత్త కాంట్రాక్టర్ 18 శాతం తక్కువకు కోట్ చేశాడు. దీంతో ఓఅండ్‌ఎం నిర్వహణకు కాంట్రాక్టర్లకు చెల్లించే ధరలో వ్యత్యాసం ఏర్పడింది. పాత కాంట్రాక్టర్ ఈ పనులు చూస్తే నెలకు దాదాపు రూ.10 లక్షల వరకు ఆదా అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ నాలుగున్నర నెలల కాలానికి, ఆ తర్వాతకు దాదాపు రూ.అరకోటి వరకు ఆదా అయ్యే అవకాశం ఏర్పడింది. దీంతో ఇంకా పాత పద్ధతిలోనే బిల్లుల చెల్లింపు వల్ల ప్రభుత్వంపై భారం పడుతోంది. ఇంత జరుగుతున్నా అదనపు కాలం పనిచేస్తున్న పాత కాంట్రాక్టర్, అగ్నిమెంట్ చేసినా పనులు చేపట్టని కొత్త కాంట్రాక్టర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ముడుపులు అందాయా?
ఓఅండ్‌ఎం పంపింగ్ స్టేషన్ల నిర్వహణను ఇంకా పాత కాంట్రాక్టరే చేపడుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొత్త కాంట్రాక్టర్, పాత కాంట్రాక్టర్ మధ్య అవగాహన కుదరడంతో పాటు ఈ ఇద్దరితో ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు కూడా చేతులు కలిపారన్న ఆరోపణలు వస్తున్నాయి. అదనంగా చెల్లించే డబ్బును దండుకునే ప్రణాళికలో భాగంగానే ఈ వ్యవహారం నడిచిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆడిట్‌కు ఏం సమాధానం చెబుతారు?
టెండరు దక్కించుకున్న కొత్త కాంట్రాక్టర్ తో తక్కువ ధరకు పనులు చేయించకుండా పాత కాంట్రాక్టర్‌తో ఎక్కువ ధరకు ఎందుకు చేయిస్తున్నారన్న అంశంపై అనుమానాలు కలుగుతు న్నాయి. ఆడిటింగ్‌లో అ విషయాన్ని ప్రశ్నిస్తే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఏం సమాధానం చెబుతారో అర్థంకాని పరిస్థితి.
తెరపైకి కొత్త టెండర్లు
ఓపక్క ఈ టెండర్ల వివాదం నడుస్తుండగానే, మరోవైపు కొత్త వివాదానికి తెరలేపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మళ్లీ ఈ నాలుగింటికి కొత్తగా టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో కొత్త, పాత సంస్థలు పాలు పంచుకునేందుకు రంగం సిద్ధం చేశారు. సాధారణంగా ఈ రెండు కాంట్రాక్టు సంస్థలు చేసిన పనికి వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలి. ఈ పనిచేయకపోవటంతో ఉన్నతాధికారులు సదరు సంస్థలతో లాలూచీ పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి.