Share News

అందరికీ అందుబాటులో అమ్మ ప్రసాదం

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:41 AM

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని ఇకపై గ్రామ సచివాలయాల్లో బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. భవానీ దీక్షల విరమణ ఉత్సవాల్లో ఈ ప్రణాళికను అమలు చేయాలని భావిస్తున్నారు.

అందరికీ అందుబాటులో అమ్మ ప్రసాదం
దుర్గగుడి అధికారులు, పోలీసులతో సీపీ సమీక్ష సమావేశం

గ్రామ సచివాలయాల్లో బుకింగ్‌కు నిర్ణయం

భవానీ దీక్షల విరమణ ఉత్సవాల నేపథ్యంలోనే..

యాప్‌లోనూ బుక్‌ చేసుకునే అవకాశం

కొరత లేకుండా చేయడానికి ప్రణాళిక

దుర్గగుడి అధికారులతో పోలీసు కమిషనర్‌ సమీక్ష

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : డిసెంబరు 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ జరుగుతుంది. దీనిపై నగరంలోని పోలీసు కమిషనర్‌ చాంబర్‌లో శనివారం పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు.. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ కృష్ణకాంత పటేల్‌, ఈవో శీనానాయక్‌, ఈఈ కోటేశ్వరరావు, పశ్చిమ డివిజన్‌ ఏసీపీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల మాదిరిగా భవానీ దీక్షలకు కూడా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మొత్తం 19 లక్షల మంది భక్తులు వచ్చారు. తొలిరోజు నుంచి భక్తులు అడిగినన్ని లడ్డూలు అందజేసిన దేవస్థాన సిబ్బంది చివరి మూడు రోజుల్లో చేతులెత్తేశారు. భక్తులు ఐదు లడ్డూలు అడిగితే రెండే ఇచ్చారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సచివాలయాల్లో ఇలా..

రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిద్వారా లడ్డూలను ముందే బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని అధికారులు నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి బయల్దేరే భవానీలు సమీపంలో ఉండే గ్రామ సచివాలయాలకు వెళ్లి ఏ తేదీన అమ్మవారి దర్శనం చేసుకుంటారో, ఎన్ని లడ్డూలు కావాలో తెలియజేయాలి. దీనికి సంబంధించిన డబ్బును ఆన్‌లైన్‌లో అక్కడే చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక టోకెన్‌ ఇస్తారు. దాన్ని తీసుకొచ్చి దర్శనం పూర్తయ్యాక లడ్డూ కౌంటర్‌లో చూపిస్తే బుక్‌ చేసుకున్నన్ని లడ్డూలు ఇస్తారు.

యాప్‌ కూడా..

దేవస్థాన అధికారులు గత ఏడాది దీక్షల్లో ఒక యాప్‌ను ఆవిష్కరించారు. దాన్ని ఈ ఏడాది భవానీ దీక్షల విరమణకు మళ్లీ తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులోనూ లడ్డూలను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాలని భావించారు. యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి లడ్డూలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాక ఒక కోడ్‌ వస్తుంది. ఆ కోడ్‌ను కౌంటర్‌లో చూపిస్తే లడ్డూలు ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఏ రోజు ఎన్ని లడ్డూలు అవసరమవుతాయో లెక్క పక్కాగా తెలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ విధానాన్ని గత ఏడాదే అమలు చేయాలని భావించినా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయామని అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - Nov 09 , 2025 | 12:41 AM