అద్వితీయం
ABN , Publish Date - May 02 , 2025 | 01:14 AM
పడి లేవడం కెరటం గుణం. అమరావతి కూడా ఓ కెరటమే. వైసీపీ హయాంలో వెనకడుగు పడినా.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెట్టింపు ఆశలతో మళ్లీ ఎగసిపడుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.49 వేల కోట్ల పనులతో ఆవిష్కృతం కాబోతోంది. ఇంకా రూ.61 వేల కోట్ల పనులు చేపట్టే అవకాశం కూడా ఉండటం, రాజధాని చుట్టుపక్కల కీలకమైన మౌలిక సదుపాయాలకు బీజం పడుతుండటంతో ఆశల అమరావతి సాకారమయ్యే ందుకు ఈ పునః ప్రారంభోత్సవం కీలకం కానుంది.
శంకుస్థాపనతో అమరావతికి మహర్దశ
గతంలో రూ.15 వేల కోట్ల పనులతో నిర్మాణానికి శ్రీకారం
తాజాగా అంతకు మూడు రెట్ల పనులతో పునర్నిర్మాణం
రూ.49 వేల కోట్ల పనులకు టెండర్లు
రూ.61 వేల కోట్లకు చేపట్టాల్సిన పనులు
కేంద్ర, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు మరో రూ.30 వేల కోట్లు
అదనపు భూ సమీకరణ జరిపితే మరింత పెరిగే అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం రూ.15 వేల కోట్ల విలువైన పనులతో మొదలైంది. తాజాగా పునర్నిర్మాణాన్ని పురస్కరించుకుని అంతకుమించి రూ.70 వేల కోట్ల పనులతో శ్రీకారం చుట్టగా, రూ.49 వేల కోట్ల విలువైన పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇక అమరావతిలో కేంద్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పెట్టే పెట్టుబడులు కలిపితే మొత్తం రూ.లక్షన్నర కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.30 వేల కోట్ల మేర అమరావతి పెట్టుబడులను ఆకర్షించింది. విద్య, పరిశోధనాభివృద్ధి, ఆరోగ్యం, ఆతిథ్యం, బ్యాంకులు, కేంద్ర సంస్థల రూపేణా రూ.30 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ జరిగింది. ఈ సంస్థలన్నీ శంకుస్థాపన అనంతరం పనులు ప్రారంభించనున్నాయి. పునర్నిర్మాణ పనుల కోసం సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి నిధుల సమీకరణ జరుపుతున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, గృహ నిర్మాణం, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన నిర్మాణ కార్యకలాపాలకు కూడా శ్రీకారం చుడుతుండటంతో పెట్టుబడులు మరిన్ని పెరిగే అవకాశముంది. వీటన్నింటి నేపథ్యంలో అమరావతి విస్తరణ కోసం మరో 44 వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన అనంతరం దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.
మౌలికసదుపాయాల కల్పన
అమరావతి చుట్టూ మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుకు అయ్యే రూ.35 వేల కోట్ల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టు సాకారమైతే అమరావతే కాకుండా రాజధాని ప్రాంత పరిధిలోని కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ భారీ ప్రాజెక్టుకు ఇటీవలే కేంద్రం అనుమతులిచ్చింది. భూ సేకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిని 14 వరసలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వస్తే ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని కంకిపాడు, పెనమలూరు, గన్నవరం, ఆగిరిపల్లి, మైలవరం, నందిగామ వంటి ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి.
వ్యాపార కార్యకలాపాలు విస్తృతం
అమరావతి పునర్నిర్మాణ పనులతో ఐదేళ్లుగా స్తబ్దుగా ఉన్న వ్యాపారకలాపాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. నిర్మాణరంగం పతాక స్థాయిలో జరగటం వల్ల మెటీరియల్ కొనుగోళ్లు విస్తృతంగా జరుగుతున్నాయి.