కబానా కహానీ
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:46 AM
1,200 మంది నుంచి రూ.300 కోట్లు వసూలు చేసిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అధినేత ఆదిత్య ఆ మొత్తాన్ని ఏం చేశాడు? దుబాయిలోని ట్రేడింగ్ కంపెనీ కబానాకు పంపించాడా? ఆ వివరాలేమీ బయట పడకుండా ముందే ల్యాప్‌టాప్‌లో డేటా డిలీట్ చేశాడా? ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన డబ్బంతా కబానాకు వెళ్లడం వెనుక కుట్రను ఛేదించే పనిలో పోలీసులు ఉండగా, ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ‘పెద్దవారి’ జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది.
అద్విక డబ్బంతా దుబాయిలోని కబానా కంపెనీకి..
ముందు జాగ్రత్తగా ఆదిత్య తెలివితేటలు
కేసు నమోదుకు ముందే ల్యాప్‌టాప్ డేటా డిలీట్
మొత్తం డేటాను రిట్రీవ్ చేసిన పోలీసులు
కబానాకు నిధులు మళ్లించినట్టు గుర్తింపు
వివరాల కోసం దుబాయి కంపెనీకి మెయిల్
ఆదిత్య తమ్ముళ్ల కోసం హైదరాబాద్ వెళ్లిన కాప్స్
బాధితుల జాబితాలో పెరుగుతున్న ‘పెద్దవారు’
తాజాగా ఓ పోలీసు ఉన్నతాధికారి పీఏ
ఆయన డబ్బు రాబట్టేందుకు ఓ కానిస్టేబుల్ హడావిడి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : 1,200 మంది నుంచి రూ.300 కోట్లు వసూలు చేసి ఝలక్ ఇచ్చిన అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ అధినేత శ్రీవెంకట ఆదిత్య ఆ మొత్తాన్ని దుబాయిలో ఉన్న కబనా ట్రేడింగ్ కంపెనీకి మళ్లించాడని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆ వివరాలను ల్యాప్‌టాప్‌లో లేకుండా చేశాడు. నష్టాలు రావడం మొదలై, ఏజెంట్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్న సమయంలో కబనా పేరు కనిపించకుండా చేశాడు. ఈ ట్రేడింగ్ కంపెనీలోకి హవాలా మార్గంలో డబ్బును పంపినట్టు నిర్ధారించారు. అద్విక ట్రేడింగ్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఏయే మార్గాల ద్వారా ఎంతెంత మొత్తంలో నిధులు కబనా ఖాతాల్లోకి వెళ్లాయో వివరాలు ఇవ్వాలని పోలీసులు ఆ కంపెనీకి మొయిల్ చేశారు. అవి వచ్చాక లెక్కలు ఏవిధంగా మారతాయో వేచి చూడాలి.
తెలంగాణకు చేరిన పోలీసులు
ఈ కేసు దర్యాప్తులో మొత్తం 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఆదిత్య ఇక్కడే కాకుండా తెలంగాణ నుంచి పెట్టుబడులను రప్పించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఆదిత్య ఇద్దరు తమ్ముళ్లు ఈ వ్యవహారాలను నడిపినట్టు భావిస్తున్నారు. వారికోసం ఒక బృందం అక్కడకు వెళ్లింది. ఏజెంట్లు, ఖాతాదారులను నమ్మించడానికి ఆదిత్య గోల్డ్‌లీఫ్ పేరుతో నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌ను తయారు చేయించాడు. అందులో రూ.120 కోట్లు తన పెట్టుబడిగా చూపించాడు. ఇదికాకుండా అద్వికలో ట్రేడింగ్ చేయడానికి స్టాక్ మార్కెట్‌లో అనుభవం ఉన్న మహిళను సలహాదారుడిగా నియమించుకున్నాడు. లబ్బీపేటలో ఉంటున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెకు ఇప్పటి వరకు వేతనంగా రూ.2.50 కోట్లు చెల్లించినట్టు తెలిసింది.
కమీషన్ ఆశచూపి..
ఖాతాదారులతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఆదిత్య వారి ద్వారా పెట్టుబడులను రప్పించుకున్నాడు. ఎంత ఎక్కువ డిమాండ్ చేస్తే అంత మొత్తంలో కమీషన్లు ఇచ్చాడు. ఏజెంట్లు కొంత కమీషన్‌ను మినహాయించుకుని మిగిలిన దాన్ని ఖాతాదారులకు ఇచ్చేవారు. తొలినాళ్లలో కమీషన్ దండిగా అందడంతో ఖాతాదారులే ఏజెంట్ల అవతారమెత్తారు. 6 నుంచి 12 శాతం వరకు కమీషన్లు చెల్లించినట్టు తెలిసింది. వచ్చిన పెట్టుబడులు, ఇచ్చిన కమీషన్లకు సంబంధించిన మొత్తం వివరాలను ఆదిత్య ల్యాప్‌టాప్ నుంచి తొలగించేశాడు. అద్విక కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు ల్యాప్‌టాప్, కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లో ఎలాంటి డేటా కనిపించకపోవడంతో ప్రశ్నించే సరికి డిలీట్ మాట బయటకొచ్చింది. దీంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డేటాను రిట్రీవ్ చేశారు. ఆ సమయంలో ఆదిత్య అమ్మాయిలతో నగ్నంగా మాట్లాడిన దృశ్యాలు బయటపడ్డాయి.
బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారి పీఏ
అద్విక ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఓ పోలీసు ఉన్నతాధికారి సహాయకుడి పేరు బయటకొచ్చింది. ఆయన ఏకంగా రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టినట్టుగా తెలిసింది. ఈ మొత్తాన్ని ఎలాగైనా వెనక్కి రప్పించుకోవాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ భుజాన వేసుకున్నాడు. ఆదిత్యను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి ఈ కానిస్టేబుల్ నిత్యం ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆయా దర్యాప్తు బృందాల్లో ఉన్న సిబ్బందికి ఫోన్ చేస్తున్నాడు. ఓ ఉన్నతాధికారికి పీఏగా వ్యవహరించే వ్యక్తి డబ్బులు ఉన్నాయని, వాటిని ఎలాగైనా ఇప్పించాలని చెబుతున్నాడు. విజిలెన్స్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లోగడ విజయవాడ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశాడు. కేసు దర్యాప్తు మొత్తం టాస్క్‌ఫోర్స్ అధికారుల కనుసన్నల్లో సాగుతున్నందున ఆ సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా ఫోన్లు చేస్తున్నాడు. కాగా, ఉన్నతాధికారి వ్యక్తిగత సహాయకుడే కాకుండా ఈ కానిస్టేబుల్ కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. అద్వికలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే నిఘా విభాగంలో పనిచేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్ పేరు బయటకు వచ్చింది. ఆయన తన బినామీ ద్వారా రూ.50 లక్షలు పెట్టించాడు.