Share News

దారి తప్పింది..!

ABN , Publish Date - May 08 , 2025 | 12:38 AM

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ ప్యాకేజీ-4లో 7 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్‌ మారటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.100 కోట్ల మేర భారం పడింది. ఎన్‌-6 మార్గంలో వెళ్లాల్సిన అలైన్‌మెంట్‌ కాస్త ఎగువకు వెళ్లడంతో ఈ నష్టం జరిగింది. ఏడు కిలోమీటర్ల మేర 15 శాతం పనులు చేశాక మళ్లీ ఎన్‌-6 మార్గంలో రోడ్డును అభివృద్ధి చేశారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ అలైన్‌మెంట్‌ మార్చినందుకు కూటమి ప్రభుత్వంపై రూ.100 కోట్ల భారం పడే పరిస్థితి ఏర్పడింది.

దారి తప్పింది..!
వెంకటపాలెం వద్ద వెస్ట్‌ బైపాస్‌ పరిస్థితి ఇది. పసుపు రంగు గీత మారిన అలైన్‌మెంట్‌, ఎరుపు రంగు గీత అసలు అలైన్‌మెంట్‌

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌లో మారిన అలైన్‌మెంట్‌

వైసీపీ హయాంలో వెంకటపాలెంలో జరిగిన తప్పిదం

ఎన్‌-6లో అలైన్‌మెంట్‌ మారడం వల్ల రూ.100 కోట్ల భారం

ఏడు కిలోమీటర్ల మేర భూగర్భ ఫైల్స్‌, పిల్లర్ల పనులు

ఆ తర్వాత తెలుసుకుని యథాతథ స్థితికి మళ్లీ మార్పు

కూటమి ప్రభుత్వంపై అదనపు భారం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ ప్యాకేజీ-4లో 7 కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్‌ మారటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.100 కోట్ల మేర భారం పడింది. ఎన్‌-6 మార్గంలో వెళ్లాల్సిన అలైన్‌మెంట్‌ కాస్త ఎగువకు వెళ్లడంతో ఈ నష్టం జరిగింది. ఏడు కిలోమీటర్ల మేర 15 శాతం పనులు చేశాక మళ్లీ ఎన్‌-6 మార్గంలో రోడ్డును అభివృద్ధి చేశారు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ అలైన్‌మెంట్‌ మార్చినందుకు కూటమి ప్రభుత్వంపై రూ.100 కోట్ల భారం పడే పరిస్థితి ఏర్పడింది.

తప్పు జరిగింది ఇలా..

కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో వెస్ట్‌ బైపాస్‌ ప్యాకేజీ-4లో ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం సీడ్‌ యాకె ్సస్‌ రోడ్డు నుంచి ఎన్‌ -6 రోడ్డు మీదుగానే అలైన్‌మెంట్‌ను నిర్దేశించారు. దాదాపు 7 కిలోమీటర్ల మేర ఈ మార్పు జరిగింది. 7 వేల మీటర్ల పొడవు, 70 మీటర్ల వెడల్పు అంటే.. 130 ఎకరాల ప్రభుత్వ భూమిలో పనులు చేపట్టారు. ఏకంగా 7 కిలోమీటర్ల పాటు అలైన్‌మెంట్‌ మారినా ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే.. రాజధాని కోసం ఈ ప్రాంతంలో రైతులు అంతకుముందు టీడీపీ ప్రభుత్వానికి భూములిచ్చి ఉన్నారు. అలైన్‌మెంట్‌ మారిన భూమి కూడా భూ సమీకరణలోనే ఉంది. దీంతో ఎవరికీ తెలియలేదు. అయితే, ఈ మారిన అలైన్‌మెంట్‌ ఎన్‌-6 మార్గంలో కాకుండా కాస్త ఎగువన ఎందుకు చూపించారన్నది అర్థంకాని విషయంగా ఉంది. అలైన్‌మెంట్‌ను నిర్దేశించే విషయంలో ఎన్‌హెచ్‌ అధికారులు అక్షాంశ, రేఖాంశాలను గుర్తించలేకపోయారని తెలుస్తోంది. విద్యుత శాఖ టవర్ల కోసం వేసిన పెగ్‌ మార్కింగ్‌ను బేస్‌ చే సుకోవడం వల్లే అలైన్‌మెంట్‌ తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో 7 కిలోమీటర్ల పరిధిలో ఈ-11, ఎన్‌-6 జంక్షన్లలో ఆర్వోబీల కోసం పనులు పిల్లర్ల వరకూ వెళ్లాయి. నాలుగు కిలోమీటర్ల మేర డ్రెయిన్ల నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఈ పనుల విలువ దాదాపు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ తప్పిదాన్ని ఎన్‌హెచ్‌ అధికారులు నాటి వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. తిరిగి ఎన్‌-6 రోడ్డులోనే పనులు చేసుకోవాలని నాటి ప్రభుత్వం నిర్దేశించటంతో మళ్లీ ఆ మార్గంలో పనులు చేపట్టారు. అమరావతిలోని వెంకటపాలెంలో కృష్ణానది బ్రిడ్జికి అనుసంధానంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నుంచి తిరిగి కొత్తగా పనులు చేపట్టాల్సి వచ్చింది. అప్పటికే చేసిన పనికి జరిగిన నష్టాన్ని తామే చెల్లిస్తామని నాటి వైసీపీ ప్రభుత్వం అంగీకరించిందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ఈ భారం పడనుంది. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలు, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షం కావటంతో రూ.100 కోట్ల భారానికి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరే అవకాశం ఉంది.

ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టత

క్షేత్రస్థాయిలో అలైన్‌మెంట్‌ మారిన విషయం వెంకటపాలెం వాసులకు మినహా ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అలైన్‌మెంట్‌ ఏ విధంగా మారిందన్నది ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా తెలుస్తోంది. 2021లో అలైన్‌మెంట్‌ మారగా, 2023, మే 23 నాటికి అసలు అలైన్‌మెంట్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం రాజధాని పనుల నేపథ్యంలో భూములను చదును చేస్తున్నారు. ఆర్వోబీలు, అండర్‌ పాస్‌లకు వేసిన పిల్లర్లను పెకిలిస్తున్నారు. ఈ పిల్లర్లు ఉన్నచోట నీరుకొండ రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ కోసం భూమిలో వేసిన ఫైల్స్‌తో సహా తొలగిస్తుండటంతో విషయం బయటకు వచ్చింది.

Updated Date - May 08 , 2025 | 12:38 AM