గ్రేటర్‌కు జై
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:03 AM
గ్రేటర్ విజయవాడను ప్రభుత్వం ఓకే చేసింది. అయితే, ఆరు నెలల తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభించాలని దిశానిర్దేశం చేసింది. జనవరి 1 నుంచి జనగణన ప్రారంభం కానుండటం, ఈ సమయంలో భౌగోళికంగా ఎలాంటి మార్పులు చేపట్టే అవకాశం లేకపోవడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, గ్రేటర్ విజయవాడ ప్రతిపాదిత గ్రామాలను ఎన్నికల నుంచి తప్పించి ప్రత్యేక అధికారుల పాలనలో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
జనగణన తర్వాతే..
జనవరి 1 నుంచి జనగణన ప్రారంభం
జూన్ వరకు భౌగోళిక మార్పులకు అవకాశం లేదు
హడావిడి చర్యలతో ఇబ్బందులకు ఆస్కారం
ఆ 75 గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు లేనట్టే..!
ప్రత్యేక అధికారులను నియమించే యోచన
జూన్ తర్వాత తీర్మానాలు.. అప్పుడే గ్రేటర్‌కు శ్రీకారం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రేటర్ విజయవాడకు ముఖ్యమంత్రి చంద్రబాబు జై కొట్టారు. కాకపోతే ఈ ప్రక్రియ ప్రారంభానికి ఆరు నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గ్రేటర్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ తాజా జనగణన పూర్తయిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పటికే జనగణన నోటిఫికేషన్ వెలువడగా, మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో దేశవ్యాప్తంగా ఎలాంటి భౌగోళిక మార్పులు చేపట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాతే గ్రేటర్ అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో శనివారం సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం మంత్రి నారాయణ ఈ విషయం వెల్లడించారు.
తగిన గడువు లేకపోవటం వల్లే..
పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి తుది నోటిఫికేషన్ వెలువరించటానికి 10 రోజుల సమయం కావాలి. ప్రస్తుత సమయం కేవలం నాలుగు రోజులే ఉంది. ఈ ప్రక్రియ ఇంత తక్కువ సమయంలో అయ్యే పనికాదు. హడావిడి పనులు చేపట్టి తప్పులు చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి తప్పులు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం కంటే ఆచీతూచి ముందుకు వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.
ఆ 75 గ్రామాల ఎన్నికలకు నో
మార్చి నెలాఖరుకు పంచాయతీల పదవీకాలం పూర్తయ్యే క్రమంలో గ్రేటర్ విజయవాడ ప్రతిపాదిత 75 గ్రామాలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రత్యేక అధికారుల హయాంలో గ్రేటర్ తీర్మానాలను స్వీకరిస్తారు. ఎలాగూ ప్రత్యేక అధికారులే ఉంటారు కాబట్టి తీర్మానాలన్నీ సానుకూలంగానే వస్తాయి. దీంతో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది కాబట్టి ఇబ్బందులనేవి ఉండవు.