చకచకా..
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:56 AM
విజయవాడ ఉత్సవ్-2025లో భాగంగా గొల్లపూడిలోని 40 ఎకరాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. కోర్టు తీర్పు సానుకూలంగా రావటంతో నిర్వాహకులు పనులు ముమ్మరం చేశారు.
విజయవాడ ఉత్సవ్-2025కు చురుగ్గా ఏర్పాట్లు
కోర్టు తీర్పుతో గొల్లపూడిలో పనులు ముమ్మరం
దసరా ఉత్సవాలకు ముందే అందుబాటులోకి..
కట్టుదిట్టమైన భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం) : విజయవాడ ఉత్సవ్-2025లో భాగంగా గొల్లపూడిలోని 40 ఎకరాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. కోర్టు తీర్పు సానుకూలంగా రావటంతో నిర్వాహకులు పనులు ముమ్మరం చేశారు. ఎక్స్‌కవేటర్లతో నేలను చదును చేస్తున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జిబిషన్ నిర్వహణ చేపట్టారు. దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యేలోపు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటుచేసేలా పనులు వేగవంతం చేశారు.
ఎగ్జిబిషన్ ప్రత్యేకతలు
ఎగ్జిబిషన్‌లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. రెస్ట్ చాంబర్, అఫిషియల్ చాంబర్, వీఐపీ చాంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే సమావేశ మందిరం కూడా ఉంటుంది. జెయింట్ వీల్, పలు రకాల ఆట వస్తువులు, గ్లోబల్ విలేజ్, ఫుడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులు, వ్యవసాయ, ఉద్యాన పంటలు, హస్తకళల ప్రదర్శనతో పాటు కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలను ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే వీఐపీలు, వీవీఐపీలు, సాధారణ భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సువిశాలమైన స్థలాన్ని ఎంపిక చేశారు. ఎగ్జిబిషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి అందులో నుంచి ప్రతి దృశ్యాన్ని సునితంగా పరిశీలిస్తారు. ప్రత్యేకంగా పోలీస్ పోస్టు పెట్టి దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు కట్టడి చేస్తారు. వైద్య సేవల కోసం హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ పోస్టును పెడుతున్నారు. విద్యుత సమస్య తలెత్తకుండా ప్రత్యేకమైన పవర్ హౌస్‌ను సిద్ధం చేస్తున్నారు.