గౌతమ్ సవాంగ్‌పై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 01:10 AM
వైసీపీ హయాం లో డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్ప డ్డారని, ఆయనపై కఠిన చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు.
అజిత్‌సింగ్‌నగర్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాం లో డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్ అనేక అక్రమాలకు పాల్ప డ్డారని, ఆయనపై కఠిన చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న గౌతమ్ సవాంగ్, కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు పాల్పడ్డ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. అజిత్ సింగ్ నగర్‌లోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2022లో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో 162 పోస్టులు అమ్ముకుని రూ.150 కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. మాన్యువల్‌గా జరగాల్సిన పరీక్ష వాల్యూ షన్‌ను డిజిటలైజేషన్ ద్వారా చేసి వైసీపీకి అనుకూలమైన వారికి పోస్టులు కట్టబెట్టారని, ఇందులో భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. డిప్యూటీ కలెక్టర్ పోస్టు రూ.2.50 కోట్లు, డీఎస్పీ పోస్టు రూ.1.50 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. పరీక్ష రాసిన అభ్య ర్థులు హైకోర్టును ఆశ్రయించగా సవాంగ్ కోర్టును కూడా తప్పు దో వ పట్టించారన్నారు. ఆ నోటిఫికేషన్ ద్వారా వివిధ పదవుల్లో ఉన్న 162 మంది నియామకాలు చెల్లవని ఆరు నెలలలోపు మళ్లీ పరీక్షలు నిర్వహించి నియామకపు ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇచినా నేటికి అమలు కాలేదన్నారు. నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన సమయంలో బంగారం దొంగతనం కేసుల్లో రికవరీపై చాలా ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రైవేట్, ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్న సవాం గ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ, హోం సెక్రటరీ, ఏసీపీ, సీఐడీ విభాగాలకు లేఖలు రాశామని తెలిపారు.