Share News

తోడుదొంగలు దొరికారు..!

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:11 AM

ఎన్టీఆర్‌ కాలనీలో ఆర్‌అండ్‌బీ విశ్రాంత ఇంజనీర్‌ రామారావు హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. రామారావును అనూష, వేమిరెడ్డి ఉపేందర్‌రెడ్డి ఊపిరాడకుండా చేసి చంపేసిన విషయం తెలిసిందే.

తోడుదొంగలు దొరికారు..!
అనూష

విశ్రాంత ఇంజనీర్‌ హత్య కేసులో చిక్కిన నిందితులు

శ్రీకాళహస్తిలో పట్టుబడిన అనూష, ఉపేందర్‌రెడ్డి

నేడు నగరానికి..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ కాలనీలో ఆర్‌అండ్‌బీ విశ్రాంత ఇంజనీర్‌ రామారావు హత్య కేసులో నిందితులు పోలీసులకు చిక్కారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు పట్టుకున్నారు. రామారావును అనూష, వేమిరెడ్డి ఉపేందర్‌రెడ్డి ఊపిరాడకుండా చేసి చంపేసిన విషయం తెలిసిందే. వారిని పట్టుకోవడానికి పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌ నుంచి రెండు, సీసీఎస్‌ నుంచి ఒక బృందం నిందితుల వేటలో ఉన్నాయి. రామారావును హత్య చేశాక అనూష, ఉపేందర్‌రెడ్డి ఆటోలో నులకపేట వెళ్లారు. అక్కడి నుంచి అదే ఆటోలో పీఎన్‌బీఎస్‌కు చేరుకుని, తిరుపతి బస్సెక్కి వెళ్లిపోయారు. నెల్లూరు బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడి ఫోన్‌ తీసుకుని మాజీ భర్తకు అనూష ఫోన్‌ చేసింది. తన గురించి పోలీసులు అడిగితే ఎలాంటి వివరాలు చెప్పొద్దని సలహా ఇచ్చింది. తిరిగి ఆ నెంబర్‌కు ఫోన్‌ చేయొద్దని తెలిపింది. ఆ తర్వాత తిరుపతి చేరుకుని ఓ లాడ్జిలో బస చేశారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లేసరికి లాడ్జి ఖాళీచేసి వెళ్లిపోయారు. చెన్నై వెళ్లిపోయినట్టు పోలీసులు అనుమానించారు. రామారావును హత్య చేసింది అనూష, ఉపేందర్‌రెడ్డి అని తేలాక పోలీసులు వారికి సంబంధించిన మొత్తం చరిత్రను తెలుసుకున్నారు. ఉపేందర్‌రెడ్డి మే నెలలో శ్రీకాళహస్తిలో రెండు కొత్త సిమ్‌కార్డులను కొన్నాడు. అతడు ఉపయోగించిన సెల్‌ నెంబర్లను సాంకేతికంగా తెలుసుకున్న పోలీసులు వాటిని ఎక్కడ కొన్నారో కనుగొన్నారు. అతడితో పోలీసులు టచ్‌లోకి వెళ్లారు. అనూష, ఉపేందర్‌రెడ్డి మళ్లీ సిమ్‌లు కొనడానికి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని నిఘా పెట్టారు. మూడు పోలీసు బృందాలు వేర్వేరు చోట్ల నిందితుల వేటలో ఉండగా, అనూష, ఉపేందర్‌రెడ్డి వచ్చారని శ్రీకాళహస్తి డిసి్ట్రబ్యూటర్‌ పోలీసులకు ఉప్పందించాడు. ఇదే విషయాన్ని పోలీసులు సీపీ రాజశేఖరబాబుకు చెప్పారు. వెంటనే ఆయన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజుతో మాట్లాడి నిందితులు ఉన్న చిరునామాకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపాలని అడిగారు. దీంతో ఆయన ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు, నలుగురు సిబ్బందిని అక్కడికి పంపారు. అక్కడే ఉన్న అనూష, ఉపేందర్‌రెడ్డిని వారు పట్టుకున్నారు. నిందితుల వేటలో ఉన్న ప్రత్యేక బృందాలు శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్లాయి. ఆదివారం మధ్యాహ్నానికి వారిని విజయవాడకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

ఉపేందర్‌రెడ్డిపై రెండు కేసులు

అనూష అసలు పేరు పల్లపు మంగ. వరుస పెళ్లిళ్ల కోసం ఆమె తన పేరును అనూషగా మార్చుకుంది. ఈమెకు ఉపేందర్‌రెడ్డిలో హైదరాబాద్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపేందర్‌రెడ్డిపై పల్లాడ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులున్నాయి. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోవడంతో అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఉపేందర్‌రెడ్డి అన్నయ్య హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ఆయన ఉపేందర్‌రెడ్డి జీవనోపాధి కోసం ఓ కారు కొనిచ్చాడు. దీన్ని అమ్మేసి అనూషతో కలిసి ఉంటున్నాడు. అంతకుముందు అనూష రెండు, మూడు వివాహాలు చేసుకుందని సమాచారం. ఉపేందర్‌రెడ్డితో సహజీవనం చేస్తూనే మాజీ భర్తలతో టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. ఉపేందర్‌రెడ్డికి తన అన్నయ్య హైదరాబాద్‌లో ఐదు ఉద్యోగాలు చూపించాడు. వాటిలో చేరిన కొద్దిరోజులకే మానేసి బయటకు వచ్చాడు.

Updated Date - Jul 13 , 2025 | 01:11 AM