దుబాయిలోనూ దుకాణం
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:09 AM
విజయవాడలో అద్విక ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటుచేసి రూ.కోట్లు లూటీ చేసిన తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య దుబాయిలోనూ ట్రేడింగ్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాడు. అందుకే ఇక్కడ పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును దుబాయిలోని కబానా ట్రేండింగ్ కంపెనీకి పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అద్విక ఏర్పాటుకు భారీ స్కెచ్
పలుమార్లు అక్కడికి వెళ్లొచ్చిన ఆదిత్య
తాజాగా 42 మంది ఏజెంట్లకు నోటీసులు
తిరిగొస్తానని ఏజెంట్లకు చెబుతున్న ఆదిత్య
రంగంలోకి రాజకీయ దళారులు
డబ్బు ఇప్పిస్తామంటూ ఏజెంట్లతో బేరాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడలో అద్విక ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటుచేసి రూ.కోట్లు లూటీ చేసిన తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య దుబాయిలోనూ ట్రేడింగ్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాడు. అందుకే ఇక్కడ పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును దుబాయిలోని కబానా ట్రేండింగ్ కంపెనీకి పంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నామని ఏజెంట్లకు, ఖాతాదారులకు ఆదిత్య చెప్పినట్టు తెలిసింది. అద్వికలో డైరెక్టర్‌గా కిరణ్‌కుమార్, గిరి, సలహాదారురాలిగా ఉన్న కీర్తిని తీసుకుని పలుమార్లు దుబాయి వెళ్లి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఐబిస్, వెస్ట్రన్ స్టార్ హోటళ్లలో రెండు బిజినెస్ మీట్లు నిర్వహించినట్టు ఏజెంట్లు చెబుతున్నారు. ఈ సమావేశాలకు దుబాయిలోని కబానా సంస్థకు చెందిన ప్రతినిధులను తీసుకొచ్చాడని తెలుస్తోంది. పోలీసులు ఎంత విచారణ చేసినా ఆదిత్య మాత్రం నోరు విప్పట్లేదు. ఏజెంట్లను పిలిపించి విచారణ చేసి వివరాలను తెలుసుకోవాల్సి వస్తోంది. రెండు తెలుగు రాషా్ట్రల్లో మొత్తం 35 మంది ఏజెంట్లు ఉంటారని భావించారు. ఇప్పుడు ఈ సంఖ్య 42కు పెరిగింది. వాళ్లందరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఒక్కో ఏజెంట్‌ను పిలిపించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ ఏజెంట్లు ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారు, ఎంతమందితో ఎంతెంతె మొత్తంలో పెట్టుబడి పెట్టించారు, పేఅవుట్లు (చెల్లింపులు) ఎంత మొత్తం తీసుకున్నారు అనే వివరాలు బయటకు లాగుతున్నారు. ఆదిత్య మొత్తం డేటాను డిలీట్ చేయడంతో లెక్కలు తేల్చడానికి నానాపాట్లు పడాల్సి వస్తోంది. ఏజెంట్లు ఇచ్చిన లెక్కలనే పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇలా పెట్టుబడి.. అలా చెల్లింపులు...
ఆదిత్య వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలించిన పోలీసులకు ఒక విషయంలో మాత్రం స్పష్టత వచ్చింది. పెట్టుబడిగా వచ్చిన ఏ ఒక్క రూపాయికి అతడు రికార్డులు నిర్వహించలేదు. పెట్టుబడిగా వచ్చిన డబ్బును బకాయిదారులకు చెల్లించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో అద్విక బోర్డు ఏర్పాటు చేసుకుని ఇద్దరు కార్యాలయాలు నిర్వహించారు. వారిలో ఒకరు రూ.25 కోట్లు పెట్టగా, మరొకరు రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించాడు. ఇందులో ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఇద్దరితో ఆదిత్య చేసిన చాటింగ్‌ను పోలీసులు చదివారు. పెట్టుబడిదారులు ఒత్తిడి చేస్తున్నారని, వారిలో కొంతమంది రాజకీయ నేతలతో ఒత్తిడి చేయిస్తున్నారని చాటింగ్ చేశాడు. త్వరలో భారీ మొత్తంలో ఒక పెట్టుబడి వస్తుందని, అది రాగానే అందులో నుంచి ఆ అకౌంట్లను సెటిల్ చేద్దామని ఆదిత్య సమాధానం ఇచ్చాడు. దీన్నిబట్టి ఆదిత్య ఎక్కడా రికార్డులు నిర్వహించలేదని గుర్తించారు. మరోపక్క గోల్డెన్ లీఫ్ నకిలీ వెబ్‌సైట్‌ను జనం నుంచి డబ్బు వసూలు చేయడానికి విరివిగా ఉపయోగించుకున్నాడు. అద్వికకు సలహాదారులుగా ఉన్న కీర్తి, ఆమె భర్త నరసింహారావు సింగపూర్‌లో ఫారెన్ ఎక్స్ఛేంజ్ విభాగంలో పనిచేశారు. అద్వికలో ఈ గోల్డెన్ లీఫ్‌ను కీర్తి నిర్వహించింది. అద్వికలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇందులో ఖాతాలు సృష్టించారు. ఇందులో కీర్తి 40 శాతం వాటా పెట్టినట్టు చూపించారు.
మళ్లీ వస్తా.. రెట్టింపు వ్యాపారం చేద్దాం
పోలీసుల అదుపులో ఉన్న ఆదిత్యను కొంతమంది ఏజెంట్లు కలుస్తున్నారు. ఇదంతా విచారణ సమయంలో జరుగుతోంది. ఆ సమయంలో ఆదిత్య వారితో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ విచారణ మొత్తం ఈఎస్‌ఐ రోడ్డులో ఉన్న అద్విక ట్రేడింగ్ కంపెనీలో జరుగుతోంది. పోలీసులు అరెస్టు చేసి, కేసు పెట్టి జైలుకు పంపినా మళ్లీ బయటకు వస్తానని చెబుతున్నట్టు తెలియవచ్చింది. తర్వాత వ్యాపారాన్ని మరింత రెట్టింపు స్థాయిలో పరుగులు తీయిస్తానని భరోసా ఇస్తున్నట్టు సమాచారం. ఎవరెవరికి బకాయి ఉన్నామో ఆ ప్రతి రూపాయిని తిరిగి చెల్లిస్తానని అభయం ఇస్తున్నాడు. దీనికి ఆరేడు నెలల సమయం పడుతుందని చెబుతున్నట్టు తెలియవచ్చింది.
ఫ్లాట్‌ను విక్రయించిన యజమానికి ఝలక్
ఆదిత్య పెనమలూరు మండలం తాడిగడపలో రూ.2 కోట్లతో ఒక ఇంటిని నిర్మించాడు. ఇది పూర్తయ్యాక రూ.2.50 కోట్లతో ఆదిత్య, కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న కిరణ్‌కుమార్ కలిసి ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ఫిలిం కాలనీలో రెండు ఫ్లాట్లు కొన్నారు. అడ్వాన్స్‌గా బిల్డర్‌కు ఇచ్చిన డబ్బును తిరిగి అద్వికలో పెట్టుబడిగా పెట్టించారు. కొంతకాలంగా చెల్లింపులు ఆగిపోవడంతో బిల్డర్ తిరుగుబాటు చేశాడు. ఆదిత్యను కూర్చోబెట్టి ఆ ఫ్లాట్‌ను తన పేరు మీద బిల్డర్ రాయించుకున్నాడు. ఇదికాకుండా తాడేపల్లిలో రూ.కోటి విలువైన రెండు, మూడు ఫ్లాట్లను బుక్ చేశాడు. వాటికి అడ్వాన్స్‌లు ఇచ్చి ఆ డబ్బును పెట్టుబడిగా తీసుకున్నాడు.
రంగంలోకి రాజకీయ దళారులు
అద్వికలో పెట్టుబడిదారులుగా ప్రముఖులు ఉన్నాయి. ఎవరి డబ్బును వారు ఇప్పించుకునే పనిలో పడ్డారు. సందట్లో సడేమియా అన్నట్టుగా రాజకీయ దళారులు రంగంలోకి దిగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఏజెంట్లు అద్విక కార్యాలయం వద్ద చర్చించుకున్నారు. నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే పీఏ టచ్‌లోకి హైదరాబాద్, విశాఖపట్నం ఏజెంట్లు వెళ్లినట్టు తెలిసింది. అసలు మొత్తాన్ని వెనక్కి ఇప్పించినందుకు కొంత మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు చెప్పుకొంటున్నారు.