పునర్విభజన మాటేంటి?
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:33 AM
జిల్లాల పునర్విభజన చిక్కుముడులు తేల్చటానికి మంత్రుల బృందం రంగంలోకి దిగింది. ఈనెల 29న ఉమ్మడి కృష్ణాజిల్లాలో పర్యటించనుంది. ఈ బృందంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ ఉంటారు. పునర్విభజన సమస్యలపై ఇటీవల అమరావతిలోని సచివాలయంలో మంత్రుల బృందం భేటీ అయ్యింది.
29న ఉమ్మడి కృష్ణాలో మంత్రుల బృందం పర్యటన
ద్విసభ్య బృందంలో నాదెండ్ల మనోహర్, పి.నారాయణ
గన్నవరం, పెనమలూరు, నూజివీడు సందర్శన
గ్రేటర్ విజయవాడ విలీన గ్రామాల పరిశీలన
అదేరోజు లిఖితపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణ
అభ్యంతరాలు, విజ్ఞప్తులు, సలహాల స్వీకరణ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాల పునర్విభజన చిక్కుముడులు తేల్చటానికి మంత్రుల బృందం రంగంలోకి దిగింది. ఈనెల 29న ఉమ్మడి కృష్ణాజిల్లాలో పర్యటించనుంది. ఈ బృందంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ ఉంటారు. పునర్విభజన సమస్యలపై ఇటీవల అమరావతిలోని సచివాలయంలో మంత్రుల బృందం భేటీ అయ్యింది. జిల్లాల విభజనకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు తీసుకోవాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే ఈ బృందం జిల్లాల బాట పడుతోంది.
ఎవరెవరిని కలుస్తారు..?
ఈనెల 29న ఉమ్మడి కృష్ణాజిల్లాకు రానున్న మంత్రుల బృందం జిల్లా కేంద్రాల్లోని ప్రజలను కలవనుంది. వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల విభజనపై అభ్యంతరాలు, ఇబ్బందులు, సలహాలను లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. ప్రజలు, ప్రజా, స్వచ్ఛంద సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా సరే తమ ప్రతిపాదనను లిఖితపూర్వకంగా అందజేయవచ్చు. వీటిపై అదేరోజు మంత్రుల బృందం ప్రాథమికంగా చర్చిస్తుంది. మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పూర్తిస్థాయి మంత్రుల బృందంలో చర్చించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు.
ప్రధాన సమస్యలివీ..
వైసీపీ హయాంలో ఉమ్మడి కృష్ణాజిల్లాను రెండుగా విభజించారు. కొత్తగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే, ఎన్టీఆర్ జిల్లాను అసమగ్రంగా ఏర్పాటు చేశారన ్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి గన్నవరం, పెనమలూరు మండలాలను తీసుకురావాలని, కృష్ణాజిల్లా పరిధిలోకి కైకలూరు, ముదినేపల్లిని తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. అలాగే, నూజివీడు, ఆగిరిపల్లి మండలాలను ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో కలపాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. వీటిని కిందటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. విజయవాడ గ్రేటర్ విలీన గ్రామాలను కూడా కృష్ణాజిల్లా పరిధిలోకి తీసుకొచ్చింది. తాజాగా విజయవాడను 81 గ్రామాలతో గ్రేటర్ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రుల బృంద పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల ప్రాతిపదికనే మండలాలను చేర్చాలా? వద్దా? అనే నిర్ణయాలను మంత్రుల బృందం తీసుకుంటుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆలోచన ఏమీ లేదనే తెలుస్తోంది.
పేర్ల మార్పు సంగతేంటి?
జిల్లాల పేర్లను పరస్పరం మార్చాలంటూ మంత్రుల బృందంలో ఒకరైన సత్యకుమార్ యాదవ్‌కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇప్పటికే ప్రతిపాదించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు కృష్ణాజిల్లాలో ఉంది కాబట్టి.. ఆ జిల్లాకే ఎన్టీఆర్ పేరు సముచితమని, అలాగే, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది ఎక్కువ దూరం ప్రవహిస్తుంది కాబట్టి కృష్ణాజిల్లా పేరు పెట్టాలని వెంకట్రావు సూచించారు.
నూజివీడు విలీనంపై సాధ్యాసాధ్యాలు
నూజివీడును కృష్ణాజిల్లాలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అప్పట్లో నూజివీడును కృష్ణాజిల్లాలో కలపమని కోరిన ప్రజలు ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో కలపమంటున్నారు. నూజివీడుకు విజయవాడ దగ్గర కాబట్టి ఈ ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రుల బృందం నూజివీడు భౌగోళిక పరిస్థితులను తెలుసుకోనుంది.