ఖిల్లాపై అల్లరల్లరి
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:01 AM
కొండపల్లి ఖిల్లాపై ఆకతాయిలు అల్లరి సృష్టించారు. పది కార్లు, 30 మోటార్ బైకులపై ఈలలు, అరుపులు, హారన్లతో రచ్చరచ్చ చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ తరహాలో ఖిల్లా ప్రాంగణంలో టేబుళ్లు వేసుకుని మద్యం సేవించారు. వీరిని చూసి పర్యాటకులు భయపడిపోయారు. చాలామంది అక్కడి నుంచి వచ్చేశారు. ఈ గ్యాంగ్‌లో యువకులతో పాటు కొందరు యువతులు కూడా ఉన్నారు.
ఆకతాయిల మందు పార్టీ.. కేకలు.. అరుపులు
30 మోటార్ బైకులు, 10 కార్లలో వచ్చి గోలగోల
పర్యాటక ప్రాంతంలో టేబుళ్లు వేసుకుని మందు పార్టీ
అనంతరం వారిలో వారే కొట్టుకుని రచ్చ
భయపడి వెళ్లిపోయిన పర్యాటకులు
(ఆంధ్రజ్యోతి, ఇబ్రహీంపట్నం) : వినాయకచవితి రోజున విజయవాడకు చెందిన సుమారు 50 మంది యువకులు, కొందరు యువతులు సుమారు 30 మోటార్ బైకులు, పది కార్లతో కొండపల్లి ఖిల్లాకు వచ్చారు. ప్రకృతి అందాలు చూడటం మానేసి మందు పార్టీ మొదలుపెట్టారు. వీరు చేసిన వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కార్లలో ఏకంగా రెడీమేడ్ టేబుళ్లు, కుర్చీలు తీసుకొచ్చి సిట్టింగ్ వేసి మరీ పబ్లిక్‌గానే మద్యం సేవించారు. ఆ మత్తులో కార్లపై కూర్చుని హారన్లు మోగిస్తూ, వీడియోలు తీసుకుంటూ ఘాట్‌రోడ్డుపై కోతిమూకను తలపించారు. వీరి చేష్టలకు పర్యాటకులు భయపడిపోయారు. చివరికి వారిలో వారికే గొడవై కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వెళ్లి వారిని చెదరగొట్టారు. ఈ ఆకతాయిలు చేసిన అల్లరి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని పోలీసులు కూపీ లాగుతున్నారు.
పర్యాటకం మాటున పాడు పనులు
ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండపల్లి ఖిల్లాపై పర్యాటకం పేరుతో యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం కొత్త కాదు. గతంలోను జరిగాయి. కోటపైకి వెళ్లకుండా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లడం, పాడు పనులకు పాల్పడుతుండటంతో ఇటీవల ఖిల్లాపైకి వెళ్లే ఎంట్రన్స్‌లో ఒక పోలీస్‌ను పెట్టారు. దీంతో జంటల తాకిడి కాస్త కట్టడి అయ్యింది. కాగా, పర్యాటకులు నిరంతరం రాకపోకలు సాగించే ఖిల్లాపై సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో యువత మరింత రెచ్చిపోతోంది.
సీఎం బందోబస్తులో ఉన్నాం : ఏ.చంద్రశేఖర్, ఇబ్రహీంపట్నం పీఎస్ సీఐ
వినాయకచవితి రోజు సీఎం చంద్రబాబు డూండీ వినాయకుడి దర్శనం కోసం వస్తుండగా మేమంతా ఆ బందోబస్తుకు వెళ్లాం. యువకుల అల్లరి నా దృష్టికి వచ్చింది. విచారణ చేస్తున్నాం. ఎవరనేది తెలుసుకుంటున్నాం. బందోబస్తు మరింత పటిష్టం చేస్తాం. ఇలాంటి ఘటనలు మరోమారు పునరావృత్తం కానివ్వం.