Share News

వేరుశెనగ విత్తనాలను వేరు చేశారు..!

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:59 AM

నూనె గింజల ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ (ఎన్‌ఎంఈవో) పథకం జిల్లాలో అభాసుపాలవుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన విత్తనాలను రైతులకు ఇవ్వకుండా గంపగుత్తగా పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు విత్తనాలు ఇచ్చినట్టుగా చూపి, కొంతమంది రైతులతో ఫొటోలు దిగి, ఆ తరువాత వాటిని ట్రాక్టర్లలో మండలానికి చెందిన ఇద్దరు ద్వితీయశ్రేణి నాయకులు తమ ఇళ్లకు తరలించుకుపోవడంతో విత్తనాలు అందని రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

వేరుశెనగ విత్తనాలను వేరు చేశారు..!

620 క్వింటాళ్ల ఉచిత వేరుశెనగ విత్తనాలు పక్కదారి

బందరు మండలంలో పంట సాగుచేయని రైతుల పేరిట..

ఇద్దరు నాయకుల ఇళ్లకు తరలించినట్టు ఆరోపణలు

అసలు రైతులు ప్రశ్నించగా.. పేర్లే లేవని బుకాయింపు

అనుమానాస్పదంగా వ్యవసాయ శాఖ అధికారుల తీరు

ఆందోళనకు సిద్ధమవుతున్న అసలు రైతులు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : నూనె గింజలకు సంబంధించి సాగు విస్తీర్ణం పెంచే కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఎన్‌ఎంఈవో పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పేరును ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌గా మార్చింది. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా జిల్లాలోని మచిలీపట్నం మండలాన్ని ప్రయోగాత్మకంగా వేరుశెనగ పంటసాగు నిమిత్తం ఎంపిక చేశారు. మండలానికి 620 క్వింటాళ్ల వశిష్ట వేరుశెనగ విత్తనాలను ఇటీవల మచిలీపట్నం మార్కెట్‌ యార్డులో దించారు. మచిలీపట్నం మండలంలోని ఒకట్రెండు గ్రామాల్లోని రైతుసేవా కేంద్రాల్లో వేరుశెనగ విత్తనాల పంపిణీ జరిగింది. విత్తనాలు రైతులకు ఇచ్చినట్లుగా హడావిడి చేశారు. కొద్దిమొత్తంలో విత్తనాలను అందజేసిన అనంతరం వాటిని మాయం చేశారు. మండలంలోని ఇద్దరు ద్వితీయశ్రేణి నాయకులు ట్రాక్టర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు.

రైతులతో సంతకాలు తీసుకుంటూ..

మచిలీపట్నం మండలంలోని సముద్రతీరం వెంబడి ఉన్న గ్రామాల్లోని ఇసుక భూముల్లో ఖరీఫ్‌లో కూడా వేరుశెనగ సాగు చేపడతారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఎంఈవో పథకం ద్వారా వశిష్ట రకం వేరుశెనగ విత్తనాలను ఉచితంగా అందజేశారు. వాస్తవంగా వేరుశెనగ పంటను సాగుచేసే రైతులకు రైతుసేవా కేంద్రాల ద్వారా ఈ విత్తనాలను అందజేయాలి. అయితే, ఒకరిద్దరు ద్వితీయశ్రేణి నాయకులు ఇదే అదనుగా తీసుకుని విత్తనాల పంపిణీలో జోక్యం చేసుకుని తమకు అనుకూలమైన వారి పేర్లను ముందస్తుగానే జాబితాల్లో చేర్చారు. గోపువానిపాలెం, కరగ్రహారం, తాళ్లపాలెం, పల్లెపాలెం, మంగినపూడి, తపసిపూడి, గోకవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు వేరుశెనగ పంటను సాగు చేస్తున్నట్లుగా జాబితాల్లో చూపారు. తమకు అనుకూలమైన వారి పేర్లను జాబితాల్లో చేర్చి వారికి విత్తనాలు ఉచితంగా ఇచ్చినట్టుగా చూపేందుకు రైతులతో సంతకాలు కూడా తీసుకున్నారు. అరెకరం భూమి ఉన్న రైతుకు 60 కిలోలు, 10 ఎకరాలు సాగుచేస్తున్న రైతుకు కూడా 60 కిలోల చొప్పున మాత్రమే వేరుశెనగ విత్తనాలు ఇస్తామని చెప్పి, తమ చిత్తానుసారంగా జాబితాలు తయారు చేయించారు. ఈ జాబితాల ప్రకారం పలు గ్రామాల్లో వేరుశెనగ పంటను సాగుచేయని రైతులకు విత్తనాలు ఇచ్చినట్టుగా చూపారు. వీరికి విత్తనాలు ఎలా ఇచ్చారనే అంశంపై మిగతా రైతులు ఆరా తీశారు. గ్రామాల్లో తమకు అనుకూలమైన పదిమందిలోపు రైతులకు వేరుశెనగ విత్తనాలు ఇచ్చి, మిగిలిన వాటిని దారి మళ్లించారనే విషయం బయటకు వచ్చింది. రైతులు విత్తనాల కోసం రైతుసేవా కేంద్రాలకు వెళ్లగా, పంపిణీ పూర్తయిందని, జాబితాల్లో మీపేర్లు లేవని చెప్పడం గమనార్హం.

పథకం ఉద్దేశమిదీ..

నూనెగింజల సాగును పెంచి, విదేశాల నుంచి నూనె దిగుమతులను తగ్గించే కార్యక్రమంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఈ ఎన్‌ఎంఈవో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆయా ప్రాంతాల్లో నూనెగింజల సాగు ఉత్పత్తి కోసం వివిధ రకాల పంటలను సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహం ఇచ్చేలా, నూనె ఉత్పత్తికి సంబంధించిన విత్తనాలను ఉచితంగా అందించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పథకం ఉద్దేశం బాగానే ఉన్నా.. ఉచితంగా వచ్చిన విత్తనాలను రైతులకు పూర్తిస్థాయిలో అందించకుండా, పక్కా ప్రణాళికతో దారి మళ్లించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతా జరిగినా మచిలీపట్నం మండల వ్యవసాయ శాఖ అధికారులు మిన్నకుండిపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగాపారదర్శకంగానే విత్తనాల పంపిణీ జరిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది.

Updated Date - Aug 31 , 2025 | 12:59 AM