Krishna Water Dispute : ఆంధ్ర పిటిషన్లపై విడివిడిగా విచారణ
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:01 AM
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్-2 వెలువరించింది. రాష్ట్రం కోరుతున్నట్లుగా 2023లో కేంద్రం జారీ చేసిన గెజిట్‌పైన.. రాష్ట్ర విభజన

బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్-2 నిర్ణయం
తొలుత 2023 కేంద్ర గెజిట్‌పై వాదనలు
తర్వాత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపైన..
ఫిబ్రవరి 19 నుంచి 21 దాకా విచారిస్తామని ట్రైబ్యునల్ స్పష్టీకరణ
అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్-2 వెలువరించింది. రాష్ట్రం కోరుతున్నట్లుగా 2023లో కేంద్రం జారీ చేసిన గెజిట్‌పైన.. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీ కేటాయింపులపైన వేర్వేరుగా విచారణ జరుపుతామని వెల్లడించింది. ఈ అంశాలపై వచ్చే నెల 19 నుంచి 21 దాకా మూడ్రోజుల పాటు ఆంధ్ర, తెలంగాణ వాదనలు వింటామని స్పష్టం చేసింది. గురువారం ఢిల్లీలో ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. రెండు రాష్ట్రాల పిటిషన్లను పరిశీలించిన తర్వాత.. తొలుత సెక్షన్ 3 కింద కేంద్రం జారీ చేసిన గెజిట్ మేరకు రాష్ట్రాలవారీ నీటి కేటాయింపులపై విచారణ జరుపుతామని.. తర్వాత విభజన చట్టం సెక్షన్ 89 మేరకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై విచారిస్తామని తేల్చిచెప్పింది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రైబ్యునల్-1 (బచావత్) కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారు. ప్రస్తుతం ఇదే అమలవుతోంది. దీనిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. తనకు సగం వాటా రావాలంటోంది. అలాగే విభజన చట్టం ప్రకారం నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతోంది. దీనినీ తెలంగాణ వ్యతిరేకిస్తోంది. గురువారంనాటి విచారణలో.. తాను వేసిన రెండు పిటిషన్లపై విడివిడిగా విచారణ జరపాలని ఏపీ విజ్ఞప్తి చేయగా.. తెలంగాణ మాత్రం తన పిటిషన్లపై ఒకేసారి వాదనలు వినాలని పట్టుబట్టింది. ఆంధ్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు జయదీప్ గుప్తా, ఉమాపతి వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలూ వేసిన పిటిషన్లను పరిశీలించి.. రాష్ట్ర విభజన చట్టానికి.. కేంద్రం జారీ చేసిన గెజిట్‌కు మధ్య వ్యత్యాసాన్ని గమనించి.. ఏ కేసుకు ఆ కేసును విడివిడిగా పరిగణించాలని ట్రైబ్యునల్‌ను అభ్యర్థించారు. ఇదే సందర్భంగా తెలంగాణ అదనపు పత్రాలు సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు ఇంకా ప్రారంభం కాకముందే.. సరైన సమయం రాకుండానే అదనపు పత్రాలను ప్రవేశపెట్టడాన్ని ఆక్షేపించారు. వాదనలు మొదలయ్యాక మాత్రమే రెండు రాష్ట్రాలూ అవసరమైన పత్రాలను అదనంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. రెండు రాష్ట్రాల వాదనలు ఆలకించిన ట్రైబ్యునల్.. విభజన చట్టం 89వ సెక్షన్ పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయింపులు, 2023లో కేంద్రం జారీ చేసిన గెజిట్ ప్రకారం పంపకాల పునఃసమీక్షపైనా విడివిడిగా వాదనలు వింటామని తెలిపింది. వచ్చే నెల 19 నుంచి 21వ తేదీదాకా మూడు రోజుల పాటు విచారణ జరుపుతామంటూ వాయిదా వేసింది.
మళ్లీ సుప్రీంకు ఏపీ!
కేంద్రం 2023లో ఇచ్చిన గెజిట్‌లోని విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ ఇదివరకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైబ్యునల్-2ను కొనసాగిస్తూ.. నీటి కేటాయింపులపై పునఃసమీక్ష చేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాల్ చేసింది. ట్రైబ్యునల్-2 కొనసాగింపుపై స్టే ఇవ్వాలని కోరింది. స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో తన తుది తీర్పునకు లోబడే ట్రైబ్యునల్-2 తీర్పు అమలవుతుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ట్రైబ్యునల్-2లో వాదనలు వినిపిస్తూనే.. ట్రైబ్యునల్-2 కొనసాగింపుపై స్టే ఇవ్వాలంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్రం భావిస్తోంది. కాగా.. కృష్ణా జలాల్లో తన వాటా 512 టీఎంసీలను కొనసాగించాలని ట్రైబ్యునల్ ముందు గట్టిగా వాదించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కుతాయని తెలియజేయనుంది. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఆమోదం పొందనవి అనేది గుర్తించాలని స్పష్టం చేయనుంది.