Share News

Kollu Ravindra: మంత్రి కొల్లు మనస్తాపం!

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:58 AM

రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనను కేసులతో వేధించిన కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును సొంత పార్టీ నేతలే ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టడంపై ఆయన బుధవారం బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. సదా సౌమ్యంగా కనిపించే కొల్లు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది.

Kollu Ravindra: మంత్రి కొల్లు మనస్తాపం!

నాపై హత్య కేసుపెట్టిన మాజీ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు వేదికపై చోటా?

ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన్ను టీడీపీ నేతలే ఎలా ఆహ్వానిస్తారు?

అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గనులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనను కేసులతో వేధించిన కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును సొంత పార్టీ నేతలే ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టడంపై ఆయన బుధవారం బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. సదా సౌమ్యంగా కనిపించే కొల్లు ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌కు కొత్త పాలక వర్గాన్ని నియమించింది. చైర్మన్‌గా తిరుపతికి చెందిన సదాశివం నియమితులయ్యారు. ఈ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. దీనికి మంత్రి కొల్లు కూడా హాజరు కావలసి ఉంది. అయితే స్థానికంగా ఆయన అందుబాటులో లేకపోవడంతో రాలేదు. అయితే నిర్వాహకులు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి రవీంద్రనాథ్‌ బాబును ఆహ్వానించారు. ఆయన హాజరై టీడీపీ నేతలతోపాటు వేదికపై కూర్చున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి చాలా బాధపడ్డారు. బుధవారం ఉదయం మచిలీపట్నంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైసీపీ హయాంలో రవీంద్రనాథ్‌బాబు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలో నాపై అక్రమ కేసు మోపి నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు.

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలెందరో ఈ సంఘటనపై బాధపడ్డారు. అటువంటి వ్యక్తిని పిలిచి ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై కూర్చోబెట్టడం నన్నెంతో బాధకు గురి చేసింది. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాను.’ అని అన్నారు. దీంతో టీడీపీకి అనుబంధంగా ఉన్న నాయీబ్రాహ్మణ సాధికార కమిటీ నేతల సమావేశం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. వారంతా మంత్రికి సంఘీభావం తెలిపారు. వారంతా టీటీడీ బోర్డు సభ్యుడు శాంతిరాంతో కలిసి మాట్లాడారు. నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సదాశివం తన సొంత ఆలోచనతో రవీంద్రనాథ్‌బాబును ఆహ్వానించారని, ఆయన చేసిన తప్పునకు మంత్రి బాధపడాల్సి వచ్చిందని చెప్పారు. సీనియర్లను పక్కనపెట్టి ఈ ఫెడరేషన్‌కు సదాశివాన్ని ఎలా నియమించారని కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. తర్వాత శాంతిరాం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిలారు రాజేశ్‌ను కలిసి ఈ పరిణామాలను వివరించారు.


53 రోజులు జైల్లో కొల్లు

జగన్‌ ప్రభుత్వ హయాంలో తనపై మోపిన ఓ హత్య కేసులో కొల్లు రవీంద్ర 53 రోజులు జైల్లో ఉన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నుంచి కొల్లు వ్యక్తిగత సహాయకుడికి ఫోన్‌ వచ్చిందని, ఈ హత్యతో కొల్లుకు ప్రమేయం ఉండడం వల్లే ఆ ఫోన్‌ వచ్చిందంటూ పోలీసులు నాడు అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్టు చేసేశారు. తనకు ఏ సంబంధమూ లేని కేసులో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారని కొల్లు ఆ సమయంలో ఆరోపించారు. వైసీపీ నేతల ఒత్తిడితో అప్పటి జిల్లా ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబే ఈ కేసు నమోదు చేయించారని విమర్శించారు.


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:58 AM