జగన్‌కు దిక్కుతోచకే విమర్శలు: కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:10 AM
తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.13 వేలు అందిస్తే జగన్‌రెడ్డికి దిక్కుతోచట్లేదని, ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

మచిలీపట్నం టౌన్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.13 వేలు అందిస్తే జగన్‌రెడ్డికి దిక్కుతోచట్లేదని, ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబంలో ఒక్క విద్యార్థికే జగన్ సాయం చేశారని, కూటమి ప్రభుత్వం మాత్రం పిల్లలందరికీ అమలు చేస్తోందన్నారు. రూ.15 వేలలో రూ.2 వేలు జేబులో వేసుకుంటున్నారని వైసీపీ నాయకులు విమర్శించడం హాస్యాస్పదమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.2 వేలు కట్ చేసి పాఠశాల అభివృద్ధికి వాడారని, ఇప్పుడు కూడా అదే జరిగిందని తెలిపారు. నాడు మిగిల్చిన రూ.2 వేలు జగన్ జేబులోకి వెళ్లాయా అని ప్రశ్నించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నాని తదితరులు పాల్గొన్నారు.