కొల్లేరు ఏం చేద్దాం ?
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:56 AM
కొల్లేరు ఆక్రమణలపై సుప్రీంకోర్టులో వరుస ఫిర్యాదులతో కొల్లేరు ప్రజల్లో ఆందోళన మొదలైంది.

నేడు పరిరక్షణ సమావేశం
హాజరు కానున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
కైకలూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి):కొల్లేరు ఆక్రమణలపై సుప్రీంకోర్టులో వరుస ఫిర్యాదులతో కొల్లేరు ప్రజల్లో ఆందోళన మొదలైంది. అరకొర చేపల చెరువు గట్లలో ఉన్న నీటిలో చేపలను పట్టుకొని జీవనం సాగిస్తున్న వారికి ఇది మింగుడుపడని సమస్యగా మారింది. మరికొన్నిచోట్ల వేలాది ఎకరాలు చెరువులుగా మార్చి, దాని నుంచి వచ్చే ఆదాయంతో ఆయా గ్రామాల్లో ప్రజలు పంచుకొని జీవనాధారం పొందుతున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ పేరుతో వేలాది ఎకరాల చేపల చెరువులను ధ్వంసం చేశారు. అప్పటి నుంచి ఆయా కొల్లేరు గ్రామాల్లోని ప్రజలకు జీవనో పాధి లేక పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. ఇతర ప్రాంతాలకు వెళ్లలేని వారు ఆయా గ్రామా ల్లోని సంప్రదాయ వేటను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తరుణంలో మరొకసారి కొల్లేరు సమస్య తెరమీదకు రావడంతో స్థానికులు భయాందోళన చెందుతు న్నారు. మరోసారి ఉన్న
చెరువులను ధ్వంసం చేస్తే ఇక ఎప్పటికీ తమకు జీవనోపాధి లభించదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే అటవీశాఖ అధికారులకు చేపల చెరువులకు గండ్లు పెట్టారు. దీనిపైన మార్చి చివరి నాటికి కొల్లేరు కాంటూరు సరిహద్దులను నిర్ధారించి పూర్తిస్థాయిలో నివేదికలు అందించాలని సుప్రీంకోర్టు కోరడంతో ఈ సమస్య మొదటికి వచ్చింది. దీంతో కొల్లేరు ప్రాంతంలోని నాయకులు స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల జీవనోపాధికి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేక ఉన్న చెరువులను ధ్వంసం చేస్తారో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొల్లేరు ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారు. వీటి నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొల్లేరు పరిరక్షణ పేరుతో భారీ బహిరంగసభకు తెరతీశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు కైకలూరు ట్రావెలర్స్ బంగ్లాలో కొల్లేరు పరిరక్షణ సమావేశం జరపనున్నారు.
సమావేశానికి ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కొల్లేరు ప్రముఖ నాయకులు పాల్గొంటారని రాష్ట్ర టీడీపీ వడ్డీ సాధికారిక సమితీ కన్వీనర్ బలే ఏసురాజు తెలిపారు. కొల్లేరు సమస్య పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కొల్లేరు లంక గ్రామాల్లోని ప్రజలంతా పెద్దఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.