కేఎంసీ కన్నతల్లితో సమానం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:01 PM
కర్నూలు మెడికల్ కళాశాల (కేఎంసీ) కన్నతల్లితో సమానమని మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు.

ఇక్కడి నుంచే రాజకీయ ప్రస్థానం
మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి
ఘనంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం
కర్నూలు హాస్పిటల్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కళాశాల (కేఎంసీ) కన్నతల్లితో సమానమని మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. విద్యార్థి దశలోనే కర్నూలు మెడికల్ కాలేజీలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న తన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఇక్కడే అన్నారు. శనివారం కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూలెక్చరర్ గ్యాలరీలో అల్యూమినీ అసోసియేషన ఆర్గనైజింగ్ చైర్మన డాక్టర్ కుమారస్వామి రెడ్డి అధ్యక్షతన కేఎంసీ పూర్వ విద్యార్థుల రెండు రోజుల వార్షిక సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంవీ మైసూరా రెడ్డి మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజీ తనకు తల్లి తర్వాత తల్లి లాంటిదని, తాను ఎక్కడికి పోయినా డాక్టర్ అని కేఎంసీలో చదువుకున్నట్లు గర్వంగా చెప్పుకుంటామన్నారు. 1966 బ్యాచకు చెందిన తాను కాలేజీలో విద్యను అభ్యసించానని, అప్పట్లో విద్యార్థి దశలో మూడో సంవత్సరం రెప్రజెంటీవ్‌గా హౌస్ సర్జన విభాగ ప్రధాన కార్యదర్శిగా పని చేశానన్నారు. రిటైర్డు డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ మాట్లాడుతూ జిల్లా చారిత్రంగా, పౌరాణికంగా, సంస్కృతి పరంగా ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు రావడం గర్వకారణమన్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రఖ్యాత గైనకాలజిస్టు పి.గురురాజా మాట్లాడుతూ కాలేజీ తనకు డిగ్రీతో మానవత్వం, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. మంచి స్నేహితుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామన్నారు. స్నేహితుల వద్ద కష్టపడేతత్వాన్ని అలవర్చుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచవో పి.శాంతికళ, కేఎంసీ ప్రిన్సిపాల్ కె.చిట్టినరసమ్మ, కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు, సీటీవీఎస్ సర్జన డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ విక్రమసింహారెడ్డి, ఎనఆర్‌ఐ సదాశివరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలమద్దయ్య, కోశాధికారి మహేశ్వరరెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.