Share News

High Court : కేఎల్‌యూ ప్రెసిడెంట్‌కు హైకోర్టులో ఉపశమనం

ABN , Publish Date - Feb 07 , 2025 | 05:15 AM

కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌(కేఎల్‌ఈఎఫ్‌) ప్రెసిడెంట్‌ కోనేరు సత్యనారాయణకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన విషయంలో రెండు వారాలపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్‌పై సీబీఐ నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు

 High Court : కేఎల్‌యూ ప్రెసిడెంట్‌కు హైకోర్టులో ఉపశమనం

రెండు వారాలపాటు తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌(కేఎల్‌ఈఎఫ్‌) ప్రెసిడెంట్‌ కోనేరు సత్యనారాయణకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయన విషయంలో రెండు వారాలపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్‌పై సీబీఐ నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవేనని గుర్తు చేసింది. విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. కేఎల్‌ విశ్వవిద్యాలయానికి ఏ++ గుర్తింపు ఇచ్చేందుకు న్యాక్‌ బృందానికి లంచం ఇచ్చారని ఆరోపిస్తూ ప్రెసిడెంట్‌ కోనేరు సత్యనారాయణ, యునివర్సిటీ ఉప కులపతి, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్‌, మరికొందరు న్యాక్‌ బృందం సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ కోనేరు సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం కోర్టు విచారణ ప్రారంభమైన వెంటనే ముందస్తు బెయిల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో న్యాయమూర్తి లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించారు. సత్యనారాయణ తరఫున న్యాయవాది దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘సత్యనారాయణ వయస్సు 70 ఏళ్లు. యూనివర్సిటీ వ్యవహారాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం లేదు. న్యాక్‌లో మొత్తం 3,000 మంది ఉంటారు. న్యాక్‌ మార్గదర్శకాల మేరకు లాటరీ విధానంలో బృందంలోని సభ్యులను ఎంపిక చేస్తారు. కమిటీలో సభ్యులుగా ఎవరుండాలో ఒక వ్యక్తి నిర్ణయించలేరు. ఈ నేపథ్యంలో లంచం ఇవ్వడం ఎలా సాధ్యపడుతుంది? అరెస్టు నుంచి రక్షణ కల్పించాలి’ అని కోరారు. సీబీఐ తరఫు న్యాయవాది పీఎ్‌సపీ సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ... ‘పిటిషనర్‌ యూనిర్సిటీకి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన సూచనలతోనే యూనివర్సిటీకి చెందిన ఇతర నిందితులు న్యాక్‌ బృందంలోని సభ్యులకు లంచం ఇచ్చారు. ఈ వ్యవహారంలో అంతిమంగా లబ్ధిపొందింది పిటిషనరే. సీబీఐ సోదాలు జరిపి సొమ్మును రికవర్‌ చేసింది. తాను చెప్పినట్లు నడుచుకొనే వ్యక్తులను పిటిషనర్‌ న్యాక్‌ బృందంలో సభ్యులుగా ఎంపిక చేశారు. సోర్స్‌ ఇచ్చిన సమాచారంతో యూనివర్సిటీ ప్రతినిధులు, న్యాక్‌ సభ్యులపై సీబీఐ నిఘా పెట్టింది. న్యాక్‌ బృందంలోని సభ్యులకు రూ.10 లక్షలు లంచం ఇచ్చారు. కాల్‌ రికార్డులు కూడా ఉన్నాయి. పిటిషనర్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు ఇంటికి వెళ్లారు. గుండెనొప్పి అని ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్య నివేదికల్లో స్పష్టంగా ఉంది’ అని వివరించారు.

Updated Date - Feb 07 , 2025 | 05:15 AM