Share News

CM Chandrababu Naidu: పక్కాగా ఖరీఫ్‌ ప్రణాళిక

ABN , Publish Date - Jun 11 , 2025 | 03:46 AM

రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని, 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని, మూడు పంటల విధానాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ అధికారులకు సూచించారు.

CM Chandrababu Naidu: పక్కాగా ఖరీఫ్‌ ప్రణాళిక

ముందే సాగునీరు విడుదల.. 24 గంటల్లో బ్యాంకు రుణాలు

ఉపాధి నిధులతో గట్ల వెడల్పు .. వరిలో సన్నరకాలను ప్రోత్సహించాలి

సాగు పరిజ్ఞానం, విధానాలపై అన్నదాతలకు అవగాహన పెంచాలి

వచ్చే వేసవిలో 5 లక్షల ఎకరాల్లో సాగు.. సమీక్షలో చంద్రబాబు నిర్దేశం

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖరీఫ్‌ పంటల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని, 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని, మూడు పంటల విధానాన్ని తీసుకురావాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు సన్నద్ధతపై మంగళవారం ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ పంటలను తుఫాన్ల నుంచి రక్షించుకునేలా పంట కాలాన్ని ముందుకు జరిపేలా కార్యాచరణ మొదలు పెట్టినట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనికి అనుగుణంగా ఈ ఏడాది గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ముందుగానే సాగునీరు విడుదల చేసినట్లు తెలిపారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లోని భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామన్నారు. జూలై మొదటి వారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో వరి, కంది, వేరుశనగ, పత్తి ప్రధానంగా సాగు చేస్తుండగా, వేరుశనగ, పత్తి సాగు తగ్గుతోందన్నారు. కంది సాగు పెరిగి, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని వివరించారు. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో 14 తుఫాన్లు సంభవించగా, అక్టోబరులో 5, నవంబరులో 6, డిసెంబరులో 3 తుఫాన్లు ప్రభావం చూపాయని చెప్పారు. అక్టోబరులో వచ్చే తుఫాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘అనంతపురం వంటి జిల్లాల్లో ఏడాదిలో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారు. దీని వల్ల భూసారం దెబ్బతింటోంది. అలాకాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదోక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలి. వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ సాగు జరిగేలా చూడాలి. దీనిలో 19 మండలాలు రిజర్వాయర్లు, 57 మండలాలు చెరువులు, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయి. వీటిని వినియోగించుకుని, దిగుబడులు సాధించాలి. అలాగే వచ్చే ఏడాది వేసవిలో ఉత్తరకోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు సాగు చేసేలా రైతుల్ని సన్నద్ధం చేయాలి. వరిలో అధిక డిమాండ్‌ ఉన్న సన్నరకాలను పండించేలా రైతుల్ని ప్రోత్సహించాలి. అన్నదాతకు ఆదాయం మరింత పెరిగే మార్గాలను చూడాలి.’’ అని సీఎం సూచించారు.


అంతర పంటకు ప్రాధాన్యం

వరిలో అంతర పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరి పంట మధ్యలో లేదా, పంట చుట్టూ ఆక్వాకల్చర్‌, హార్టీకల్చర్‌ సాగుకు ప్రయత్నించాలన్నారు. రైతుల పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే ఈ గట్లను ఉపాధి హామీ పథకం నిధులతో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో అపరాలు, చిరు ధాన్యాల సాగు పెరగాలని సూచించారు. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండాలన్నారు. పంటల సాగులో ఎరువులు, పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించి, భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గతేడాది 39 లక్షల టన్నుల ఎరువులు వినియోగించగా, ఈ ఏడాది 35 లక్షల టన్నులకు తగ్గించేలా చూడాలన్న సీఎం.. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

అవగాహన పెంచాలి!

రైతులకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా, హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్లను పరుచూరు యార్డులో ప్రారంభించామని, దీనిపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు సీఎంకు వివరించారు. బర్లీ పొగాకు స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోకో, మామిడి కొనుగోళ్ల వివరాలపై సీఎం ఆరా తీశారు. మరోవైపు వాట్సాప్‌ గవర్నెన్స్‌, మన మిత్ర ద్వారా కొత్తగా వ్యవసాయశాఖకు సంబంధించిన 3 సేవలు అందుబాటులో తెచ్చామని అధికారులు చెప్పారు. పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ అమలు విధానాన్ని వివరించారు. మార్క్‌ఫెడ్‌ సేవలను ఇకపై వాట్సాప్‌ ద్వారా రైతులు పొందే అవకాశం కలిగిందన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 03:48 AM