Driver Subrahmanyam Murder: అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:30 AM
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. దర్యాప్తులో విస్మరించిన అనేక అంశాలపై లోతుగా విచారణ జరిపేందుకు ప్రాసిక్యూషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
రాజమహేంద్రి కోర్టులో ప్రాసిక్యూషన్ పిటిషన్
మృతుడి తల్లి లేవనెత్తిన అనుమానాల ప్రస్తావన
మరికొందరు సాక్షులను ప్రశ్నించాలి..
సాంకేతిక ఆధారాలూ సేకరించాలి
తదుపరి విచారణకు అనుమతివ్వాలని వినతి
అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో..
కాకినాడ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతి కోరుతూ ప్రాసిక్యుషన్ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక న్యాయస్థానంలో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తులో అనేక కీలక అంశాలను విస్మరించిన నేపథ్యంలో లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని అందులో పేర్కొంది. మృతుడి తల్లి నూకరత్నం సైతం తన కుమారుడి హత్య కేసులో అనేక అనుమానాలు వ్యక్తంచేస్తూ ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశారని తెలిపింది. ‘హత్యకు గురైన తన కుమారుడి శరీరంలో మూడుచోట్ల అంతర్గతంగా, 31 చోట్ల శరీరంపై గాయాలున్నాయని ఆమె పేర్కొన్నారు. ఒకే వ్యక్తి ఇన్ని చోట్ల గాయాలు చేసి చంపడం కుదరదని, నిందితుడికి ఈ హత్యలో మరికొందరు సహకరించి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. అప్పట్లో జరిగిన పోలీసు దర్యాప్తులో ఈ అంశాలను విస్మరించారని తెలిపారు. హత్య జరిగినప్పుడు నిందితుడి కాల్‌డేటాను సైతం విశ్లేషించలేదని, అనంతబాబు వద్ద గన్‌మెన్ ఆ సమయంలో ఎక్కడున్నారనేదానిపైనా పోలీసులు విచారించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాల్లో తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉంది. తదుపరి విచారణకు వీలుగా పాటిల్ దేవరాజ్ మనీశ్ అనే ఐపీఎస్ అధికారిని కాకినాడ జిల్లా ఎస్పీ ఇటీవల నియమించారు. కేసులో మరికొందరు సాక్షులను కూడా విచారించాల్సి ఉండడం, మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో తదుపరి కేసు విచారణకు అనుమతించండి’ అని న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ కోరింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..