Madhav Reddy: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో..
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:37 AM
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు కాల్చిన కేసులో అరెస్టైన మాధవరెడ్డికి చిత్తూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణలో సహకరించకపోవడంతో కేసు మరింత దర్యాప్తు అవసరం ఉన్నదిగా కనిపిస్తోంది.
పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డికి బెయిల్
చిత్తూరు/తిరుపతి (నేరవిభాగం), ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచందారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డికి చిత్తూరు సీఐడీ కోర్టు శుక్రవారం రాత్రి బెయిల్ మంజూరుచేసింది. గతేడాది జూలై 21వ తేదీ రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్లు కాలిపోయాయి. వైసీపీ హయాంలో సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిధిలో పెద్దిరెడ్ది, ఆయన అనుచరులు అనేక భూఅక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం మారాక ఈ అక్రమాలు వెలుగులోకి రాకుండా చేసేందుకే ఫైళ్లను దహనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు బాధ్యత సీఐడీకి అప్పగించింది. ఫైళ్ల దహనం ఘటనలో కీలక సూత్రధారిగా భావిస్తున్న మాధవరెడ్డిని గురువారం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండల పరిధిలోని ఫాంహౌ్‌సలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి తిరుపతి తీసుకొచ్చారు. సీఐడీ కార్యాలయంలో డీఎస్పీ కొండయ్య, సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన్ను దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. ఫైళ్ల దహనం వెనుక కీలక సూత్రధారి ఎవరని అడుగగా.. ‘నాకు తెలియదు, నాకు సంబంధం లేదు’ అని ఆయన జవాబిచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో పెద్దిరెడ్డి, ఆయన వ్యక్తిగత కార్యదర్శి తుకారాం పాత్రపై వివిధ కోణాల్లో ప్రశ్నించగా.. ఆయన నుంచి సమాధానం రాలేదని తెలిసింది. ఏమడిగినా మాట్లాడకపోవడం.. తెలియదనే జవాబులే ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం మాధవరెడ్డిని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాక.. చిత్తూరు తరలించి సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. మాధవరెడ్డి తరఫున హైకోర్టు న్యాయవాది రాజేంద్ర, సీఐడీ తరఫున ఏపీపీ ఉమాదేవి వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టు సరిగా లేదని, మార్పులుచేసి సమర్పించాలని న్యాయాధికారి షేక్ బాబాజాన్ ఆదేశించారు. దీంతో వారురిమాండు రిపోర్టును తిరిగి సమర్పించారు. అనంతరం మాధవరెడ్డికి బెయిల్ ఇస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. సోమవారంలోగా లక్ష పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..