Share News

Kurnool district: చక్రాల కింద నలిగిపోయారు!

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:49 AM

వైద్యం కోసం ద్విచక్రవాహనాలపై ఆస్పత్రులకు వెళ్తున్నవారిపై కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకెళ్లి ఐదు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

Kurnool district: చక్రాల కింద నలిగిపోయారు!

  • రెండు బైకులను ఢీకొట్టి ఐదుగురిని చిదిమేసిన కర్ణాటక ఆర్టీసీ బస్సు

  • వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తుండగా కర్నూలు జిల్లాలో ఘటన

  • మృతుల్లో ఏపీకి చెందిన గర్భిణి, ఆమె భర్త

  • కర్ణాటకకు చెందిన దంపతులతోపాటు కుమారుడు

  • డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమన్న పోలీసులు

ఆదోని రూరల్‌/కర్నూలు, రాయచూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): వైద్యం కోసం ద్విచక్రవాహనాలపై ఆస్పత్రులకు వెళ్తున్నవారిపై కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకెళ్లి ఐదు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకుందీ ఘోరం. కర్నూలు జిల్లా కుప్పగల్లు గ్రామానికి చెందిన దంపతులు కురువ పూజారి ఈరన్న (25), పూజారి ఆదిలక్ష్మి (23)లకు వ్యవసాయమే జీవనాధారం. వీరికి సుస్మిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆదిలక్ష్మి మూడు నెలల గర్భిణి. నెలవారీ వైద్య పరీక్షల కోసం మంగళవారం ఉదయం ఆదోని ఆస్పత్రికి బైక్‌పై బయలుదేరారు. అదే క్రమంలో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి పట్టణంలో అగ్రిమాపక శాఖ హోంగార్డుగా పని చేస్తున్న హేమాద్రి (40) చర్మసంబంధిత వ్యాధికి ఆదోని మండలం ఇస్వి గ్రామంలో ఇచ్చే నాటు వైద్యం కోసం భార్య నాగరత్న (35), కుమారుడు దేవరాజు (20)తో కలిసి బైక్‌పై వస్తున్నారు. వీరంతా మరో 20 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా, పెద్దతుంబలం-కౌతాళం మధ్య జాలిమంచి క్రాస్‌ రోడ్డు వద్ద, ఆదోని నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు(కేఏ 37 ఎఫ్‌ 0711) ఢీకొంది. దీంతో వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఐదుగురూ బస్సు చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందారు. హేమాద్రి, నాగరత్న, దేవరాజు మృతదేహాలు రోడ్డుపక్కనే చెల్లాచెదురుగా పడిపోగా..


ఈరన్న, ఆదిలక్ష్మి మృతదేహాలు బస్సు చక్రాల కింద నలిగిపోయాయి. ఆ సమయంలో బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. గంగావతికి చెందిన బస్సు డ్రైవర్‌ మహ్మద్‌సాబ్‌లాతి పారిపోయాడు. ఆదోని డీఎస్పీ హేమలత సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అతివేగంతోపాటు బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తెలిపారు.ప్రమాద స్థలంలో రహదారి వాలుగా (యూ టర్న్‌) ఉంది. అక్కడ బస్సు వేగాన్ని ఏమాత్రం తగ్గించకుండా వెళ్లడం.. పైకి ఎక్కేచోట బైకులు ఎదురు రావడంతో బస్సును డ్రైవర్‌ అదుపుచేయలేక ఢీకొట్టినట్లు తెలిసింది.

విచారం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్‌

బస్సు ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టీడీపీ కార్యకర్తలైన రైతు దంపతుల ఈరన్న, ఆదిలక్ష్మి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనలో మృతి చెందిన కర్ణాటక వాసులకు సంబంధించి అవసరమైన సహాయసహకారాలు అందించాలని టీడీపీ ఇన్‌చార్జి కె.మీనాక్షినాయుడుకు ఫోన్‌ చేసి సూచించారు. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు ఆదోని ఆస్పత్రికి వెళ్లి పూజారి ఈరన్న, ఆదిలక్ష్మి మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కర్ణాటక మృతుల కుటుంబాలవారితో మాట్లాడారు.

Updated Date - Mar 12 , 2025 | 05:49 AM