Share News

Karedo Village Farmers: ప్రాణాలైనా ఇస్తాం.. భూములు మాత్రం ఇవ్వం

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:54 AM

మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా వదులుకోం అంటూ రైతులు ముక్త కంఠంతో నినదించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ సచివాలయం-1 వద్ద శుక్రవారం గ్రామసభ జరిగింది.

Karedo Village Farmers: ప్రాణాలైనా ఇస్తాం.. భూములు మాత్రం ఇవ్వం

  • అధికారులకు స్పష్టం చేసిన కరేడు గ్రామస్థులు

  • ‘ఇండోసోల్‌’ భూసేకరణకు ససేమిరా

  • ప్రజల ఆందోళనతో గ్రామసభ వాయిదా

ఉలవపాడు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ సెంటు భూమి కూడా వదులుకోం’ అంటూ రైతులు ముక్త కంఠంతో నినదించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ సచివాలయం-1 వద్ద శుక్రవారం గ్రామసభ జరిగింది. ఇండోసోల్‌ సోలార్‌ ప్రాజెక్టు భూసేకరణకు కందుకూరు సబ్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ రాజశేఖర్‌ ఈ సభలో పాల్గొన్నారు. సుమారు వంద మంది పోలీసులు ఉదయం నుంచే గ్రామంలో మోహరించారు. కరేడు పంచాయతీలోని 16 గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు గ్రామసభకు చేరుకున్నారు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజశేఖర్‌ పరిశ్రమలతో అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పన తదితర అంశాలను వివరించారు. ఇంతలో గ్రామస్థులు ‘మా అనుమతులు లేకుండా మా భూములు తీసుకోవడానికి మీకు, ప్రభుత్వానికి హక్కు ఏముంది’ అంటూ నిలదీశారు.


రియల్‌ ఎస్టేట్‌ దందా కోసమే

‘ఇండోసోల్‌ కంపెనీకి 400 ఎకరాలు సరిపోతాయని అందరూ చెబుతుంటే ప్రభుత్వం మాత్రం 8,348 ఎకరాలు కావాలని విలువైన పచ్చటి భూములను లాక్కుంటోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో రూ.కోట్ల పోగేసుకోవడానికే కదా’ అంటూ కరేడు గ్రామస్థులు నిలదీశారు. పరిశ్రమల కోసం సేకరించిన భూముల పరిస్థితి, నష్టపోయిన గ్రామాల ప్రజల దుస్థితి కళ్ల ముందు కనిపిస్తోందని చెప్పారు. కరేడులోని రామకృష్ణాపురం, పొట్టేనుగుంట ఎస్టీ కాలనీ, ఉప్పరపాలెం ఎస్సీ కాలనీల్లోని 300 ఇళ్లు తొలగిస్తారని చెబుతున్నారని తమ ఇళ్ల జోలికి వస్తే మూకుమ్మడిగా తగలబెట్టుకుంటామని మహిళలు హెచ్చరించారు.

అర్ధంతరంగా ముగిసిన సభ

నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితులు, ప్రభుత్వంపై వారి ఆగ్రహం కట్టడి చేయలేమని గ్రహించిన అధికారులు గ్రామసభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఒక దశలో సబ్‌ కలెక్టర్‌ ప్రభుత్వం కల్పించబోయే రాయితీలు, పరిహారం వివరించేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా గ్రామస్థులు, రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌, కందుకూరు సబ్‌ కలెక్టర్‌.. రైతులు తమ అభిప్రాయాలు తెలియచేస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి ఏంటో చెప్పాలి

‘మా కరేడు తీర ప్రాంతంలో వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, కాయగూరలు సాగవుతూ చుట్టు పక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. దీనిని ఇంకేవిధంగా అభివృద్ధి చేస్తారో చెప్పండి.’ అంటూ మహిళలు అధికారులను నిలయదీయడంతో వారు నీళ్లు నమిలారు. ఎన్నో ప్రకృతి విపత్కర పరిస్థితులు, ఉపద్రవాలు ఎదురైనా వదులుకోని భూమిని ఇప్పుడు పరిశ్రమల పేరుతో దోపిడీ చేస్తామంటే ఊరుకుంటామా అంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 05 , 2025 | 07:47 AM