Kakinada Sea Port : కాకినాడ పోర్టు డీల్ ‘రివర్స్’!
ABN , Publish Date - Jan 21 , 2025 | 06:45 AM
‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు
వాటాలను కేవీరావుకు తిరిగిచ్చేసిన అరబిందో
మూడు రోజుల క్రితం గుట్టుగా బదిలీ.. వివాదంలో పైస్థాయి వ్యక్తుల మధ్యవర్తిత్వం
సెజ్‌ను మరిచిపోవాలంటూ కేవీరావుకు షరతు.. దీనికి బదులుగా పోర్టులో వాటాలు బదిలీ
పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్న కేవీ రావు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
‘కాకినాడ సీ పోర్టు’ మళ్లీ అసలు యజమాని కేవీ రావుకు దక్కింది. వైసీపీ హయాంలో బలవంతంగా వాటాల బదిలీ... కూటమి సర్కారు వచ్చాక దీనిపై సీఐడీకి కేవీరావు ఫిర్యాదు... ఆపై ఈడీ కూడా రంగంలోకి దిగిన సమయంలో విషయం కీలక మలుపు తిరిగింది. కేవీ రావు నుంచి అప్పట్లో బలవంతంగా లాక్కున్న వాటాలను ‘అరబిందో’ సంస్థ తిరిగి ఆయనకే అప్పగించింది. మూడు రోజుల కిందట వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. విషయాన్ని అటు సీఐడీ, ఇటు ఈడీ లోతుగా లాగకుండా ముందు జాగ్రత్తగా వాటాలను తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ... దీని వెనుక జరిగింది వేరని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కాకినాడ పోర్టులో మనీలాండరింగ్‌పై ఈడీ ఆరా తీస్తుండటం... అరబిందో ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి తలెత్తడం... తీగలాగితే భారీగా డొంక కదిలే పరిస్థితి ఉండటంతో కాకినాడ సీపోర్ట్ డీల్ ‘రివర్స్’ అయ్యింది. ప్రస్తుత పరిస్థితులను కేవీరావు పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది.
పైస్థాయి వ్యక్తులు కొందరు రంగంలోకి దిగి... ఇద్దరినీ కూర్చోబెట్టి కొత్త ‘డీల్’కు ఓకే చెప్పించారు. అప్పట్లో... రూ.2500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్ బ్యాచ్ రూ.494 కోట్లకే లాగేసుకుందని కేవీ రావు ఆరోపించారు. దీనిపై సీఐడీకి కూడా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కేవీరావుకు చెందిన... 8వేల ఎకరాలున్న కాకినాడ సెజ్ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. తాజాగా... ‘కాకినాడ సెజ్ గురించి మరిచిపోండి. అది అరబిందోకే! పోర్టులో మీ నుంచి తీసుకున్న వాటాలు మీకే వచ్చేస్తాయి’’ అని డీల్ కుదిరింది. దీని ప్రకారం 3 రోజుల కిందట అరబిందో పేరుతో ఉన్న 2.15 కోట్ల షేర్లు కేవీరావుకు బదిలీ అయిపోయాయి. దీనికి సంబంధించి అప్పట్లో తనకు చెల్లించిన డబ్బులను కేవీరావు అరబిందోకు తిరిగి ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో కాకినాడ పోర్టు పూర్తిగా కేవీరావు వశమైంది. సీపోర్టుకు స్టాక్ ఎక్స్ఛేంజీతో సంబంధం లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. ఇక... కాకినాడ సెజ్‌లో తన వాటాగా రూ.1104కోట్లు రావలసి ఉండగా, రూ.12 కోట్లతో సరిపెట్టారని కేవీరావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసినందున.. ఇక సెజ్ గురించి మరిచిపోయేలా డీల్ కుదిరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేవీరావు మాత్రం, సెజ్‌లో వాటాలను వదులుకునేది లేదని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.