Kakinada: ఆ భూమి రెవెన్యూ అధీనంలో..
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:40 AM
కాకినాడ నగరంలో సూర్యారావుపేటలోని వివాదాస్పద ప్రైవేటు భూమిపై న్యాయ వివాదం కొనసాగుతోందని కలెక్టర్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలు వెలువడే వరకు రెవెన్యూ అధీనంలోనే భూమిని ఉంచామని పేర్కొన్నారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై కాకినాడ కలెక్టరేట్ వివరణ
కాకినాడ, జూలై 3(ఆంధ్రజ్యోతి): కాకినాడ నగరంలో సూర్యారావుపేటలోని వివాదాస్పద ప్రైవేటు భూమిపై న్యాయ వివాదం కొనసాగుతోందని కలెక్టర్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలు వెలువడే వరకు రెవెన్యూ అధీనంలోనే భూమిని ఉంచామని పేర్కొన్నారు. సూర్యారావుపేటలోని రెండెకరాల ప్రైవేటు భూమికి కలెక్టరేట్‌లో రికార్డులు తారుమారు చేసేసి ఓ వైసీపీ నేత కొట్టేయడానికి స్కెచ్ వేసిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనాలపై స్పందించారు. సర్వే నంబరు 195/3లోని రెండెకరాల భూమిని కొప్పుల ప్రభావతి అనే మహిళ వద్ద తాను కొనుగోలు చేశానని, ఈ భూమిలోకి వెళ్లడానికి భద్రత కావాలంటూ చలికి వీరేంద్ర అనే వ్యక్తి గతంలో పోలీసులను ఆశ్రయించారని పేర్కొన్నారు. అదే సమయంలో ముమ్మిడి ఇంటి పేరుతో ఉన్న మరో కుటుంబం ఆ భూమి తమదేనంటూ డాక్యుమెంట్లు, ఈసీతో ముందుకు వచ్చారని తెలిపారు. దీనిపై 2023లో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి ఈ భూమికి సంబంధించి రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి ముమ్మిడి కుటుంబానిది కాదని తేల్చినట్లు తెలిపారు. అయినా ఆ భూమి తమదేనంటూ ముమ్మిడి కుటుంబం అందులోకి వెళ్లే ప్రయత్నం చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ఆ భూమి తమదేనంటూ అందులోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండడంతో సివిల్ కోర్టు ఆదేశా లు వచ్చే వరకు రెండు వర్గాలు ఆ వివాదాస్పద భూమిలోకి వెళ్లవద్దని నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆ భూమిని ప్రస్తుతం కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయ అధీనంలో కొనసాగిస్తున్నట్లు వివరించారు. ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ‘సరిదిద్దలేని దందా’ శీర్షికతో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ భూమిపై నెలకొన్న వివాదం, గత నేపథ్యంపై నిజానిజాలేంటనే దానిపై కాకినాడ జిల్లా కలెక్టర్ అమరావతిలోని సీసీఎల్‌ఏకు నివేదిక పంపారు.